ఎమ్మెల్యేలపై స్పీకర్‌కు మెయిల్‌ ద్వారా ఫిర్యాదు

భారాస బీఫాంపై ఎమ్మెల్యేలుగా గెలిచిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సంజయ్‌కుమార్‌లు కాంగ్రెస్‌లో చేరడం చట్ట వ్యతిరేకమని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టంచేశారు.

Published : 27 Jun 2024 06:02 IST

మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి 

ఈనాడు, హైదరాబాద్‌: భారాస బీఫాంపై ఎమ్మెల్యేలుగా గెలిచిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సంజయ్‌కుమార్‌లు కాంగ్రెస్‌లో చేరడం చట్ట వ్యతిరేకమని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టంచేశారు. బుధవారం తెలంగాణభవన్‌లో ఆయన మాట్లాడుతూ... ‘‘వారి సభ్యత్వాలను రద్దు చేయాల్సి ఉంది. మూడు రోజుల నుంచి స్పీకర్‌ అపాయింట్‌మెంట్‌ కోసం ఎదురుచూస్తున్నాం. కానీ, మాకు అవకాశం ఇవ్వడం లేదు. దీంతో స్పీడ్‌ పోస్టు, మెయిల్‌ ద్వారా ఆ ఇద్దరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ ఫిర్యాదు చేశాం. వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాం. లేదంటే న్యాయపరంగా ముందుకెళ్తాం. మా హయాంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలే కేసీఆర్‌ దగ్గరకు వచ్చి కండువాలు కప్పుకొన్నారు. చట్ట ప్రకారమే మూడింట రెండోవంతు సభ్యులు భారాసలో చేరారు. ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి మా పార్టీ ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి మరీ కాంగ్రెస్‌ కండువాలు కప్పుతున్నారు’’ అని ఆరోపించారు.   ‘‘మా ఎమ్మెల్యేలు మా అధినేతను కలవడానికి వస్తే తప్పేముంది? ప్రజలే తండోపతండాలుగా వస్తున్నప్పుడు మా ఎమ్మెల్యేలు కలవడం సాధారణమే కదా’’ అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 

కాంగ్రెస్‌ రెండు నాలుకల ధోరణి ప్రదర్శిస్తోందని భారాస నేత దేవీప్రసాద్‌ మండిపడ్డారు. తెలంగాణభవన్‌లో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ... కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను వేలం వేస్తుంటే... ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆ కార్యక్రమంలో పాల్గొనడం దురదృష్టకరమన్నారు. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌.. ఒక్క హామీ కూడా అమలు చేయడం లేదని విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని