జులై 5న కోల్‌బెల్ట్‌ బంద్‌

బొగ్గు గనుల వేలానికి వ్యతిరేకంగా కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం పోరాడాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్‌ చేశారు.

Published : 27 Jun 2024 05:59 IST

గనుల వేలంపై ప్రభుత్వం అయోమయం: కూనంనేని

ఈనాడు, హైదరాబాద్‌: బొగ్గు గనుల వేలానికి వ్యతిరేకంగా కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం పోరాడాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్‌ చేశారు. కేంద్రప్రభుత్వ తీరును నిరసిస్తూ జులై 5న కోల్‌ బెల్ట్‌ బంద్‌కు పిలుపునిస్తున్నట్లు చెప్పారు. బుధవారం మఖ్దూంభవన్‌లో పార్టీ జాతీయ కార్యదర్శి సయ్యద్‌ అజీజ్‌ పాషా, సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, రాజ్‌కుమార్‌ తదితరులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. కొత్త బొగ్గు గనులను సింగరేణికే ఇవ్వాలన్నారు. సింగరేణి కార్మికుల ఉద్యమానికి మద్దతుగా కమ్యూనిస్టు పార్టీ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జులై 5 నుంచి 15 రోజుల పాటు నిరసన ప్రదర్శనలు, నిరాహార దీక్షలు, జిల్లా కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమాలు చేపడతామన్నారు. 2015లో ఎంఎంఆర్‌ చట్టం ద్వారా బొగ్గు గనులు రాష్ట్రం చేతుల్లో లేకుండా పోయాయన్నారు. బొగ్గు గనుల వేలం విషయంలో రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం అయోమయంలో ఉందని పేర్కొన్నారు. సింగరేణిని ప్రైవేట్‌పరం చేయబోమని హామీ ఇచ్చిన కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి  సింగరేణి పరిధిలోని గనుల వేలం పాటకు తెరలేపడం ఏంటని కూనంనేని మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని