పరస్పర సవాళ్లతో హుజూరాబాద్‌లో ఉద్రిక్తత

కాంగ్రెస్, భారాస నేతల పరస్పర సవాళ్లతో కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Published : 26 Jun 2024 05:35 IST

ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి ప్రణవ్‌ల గృహ నిర్బంధం 

హుజూరాబాద్‌ గ్రామీణం, వీణవంక, న్యూస్‌టుడే: కాంగ్రెస్, భారాస నేతల పరస్పర సవాళ్లతో కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్టీపీసీ బూడిద రవాణా విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ అవినీతికి పాల్పడ్డారంటూ కొద్ది రోజులుగా ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ విషయమై మంత్రి జూబ్లీహిల్స్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలని ఎమ్మెల్యే మూడు రోజుల కిందట సవాల్‌ విసిరారు. కాగా కోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురి నుంచి ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి డబ్బులు తీసుకొన్నారని కాంగ్రెస్‌ హుజూరాబాద్‌ ఇన్‌ఛార్జి వొడితల ప్రణవ్‌ సోమవారం ఆరోపించారు. దీనిపై హుజూరాబాద్‌ మండలం చెల్పూరు ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలని సవాల్‌ విసిరారు. ఆ సవాల్‌ను ఎమ్మెల్యే స్వీకరించి మంగళవారం ఉదయం వస్తానని ప్రకటించారు. దీంతో ప్రణవ్‌ను, కౌశిక్‌రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఎమ్మెల్యే తన వద్ద డబ్బులు తీసుకొన్నారని చెల్పూరు మాజీ సర్పంచి మహేందర్‌గౌడ్‌ ఆలయం వద్ద ప్రమాణం చేశారు. కాంగ్రెస్‌ నాయకులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో పోలీసులు స్వల్ప లాఠీఛార్జి చేయగా ఇద్దరు గాయపడ్డారు. మరోవైపు ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి వీణవంకలోని నివాసంలో తడి బట్టలతో హనుమాన్‌ చిత్రపటంతో ప్రమాణం చేశారు. కాంగ్రెస్‌ నేత ప్రణవ్‌ హుజూరాబాద్‌ మండలం సింగాపూర్‌లోని తన నివాసంలో మాట్లాడుతూ దేవుడిపై ఒట్టేసి అబద్ధాలు ఆడటం ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డికే చెల్లుతుందని విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని