నాడు ఎమర్జెన్సీ విధించి నేడు రాజ్యాంగంపై నాటకాలా?

దేశంలో అత్యయిక పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించి, పౌరుల ప్రాథమిక హక్కుల్ని కాలరాసి.. రాజ్యాంగాన్ని అణగదొక్కినవారికి రాజ్యాంగంపై ప్రేమ నాటకాలాడే హక్కు లేదని ప్రధాని నరేంద్రమోదీ ఆక్షేపించారు.

Updated : 26 Jun 2024 06:08 IST

ఆనాటి తత్వం ఆ నేతల్లో సజీవంగానే ఉంది 
‘ఎక్స్‌’ వేదికగా కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ మోదీ 

దిల్లీ: దేశంలో అత్యయిక పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించి, పౌరుల ప్రాథమిక హక్కుల్ని కాలరాసి.. రాజ్యాంగాన్ని అణగదొక్కినవారికి రాజ్యాంగంపై ప్రేమ నాటకాలాడే హక్కు లేదని ప్రధాని నరేంద్రమోదీ ఆక్షేపించారు. 26.6.1975న ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి మంగళవారానికి 49 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన ఈ మేరకు ‘ఎక్స్‌’లో వరస పోస్ట్‌లతో స్పందించారు. ‘‘ఎమర్జెన్సీని ఎదిరించిన మహనీయులందరికీ నివాళులర్పించే రోజు ఇది. ఆనాడు ప్రజల ప్రాథమిక స్వేచ్ఛను కాంగ్రెస్‌ హరించింది. అధికారాన్ని కాపాడుకోవడం కోసం అప్పటి ప్రభుత్వం యావద్దేశాన్నీ జైలుగా మార్చింది. వ్యతిరేకించిన వారిని వేధించి, హింసించారు. దారుణమైన విధానాలను అమల్లోకి తెచ్చారు’’ అని మోదీ గుర్తుచేశారు. ‘‘లెక్కకు మిక్కిలిగా 356 అధికరణాన్ని (రాష్ట్రపతి పాలన విధింపు) రాష్ట్రాలపై ప్రయోగించారు. పత్రికా స్వేచ్ఛకు కళ్లెం వేయడానికి ఎన్నో బిల్లులు తీసుకొచ్చారు. రాజ్యాంగంలోని ప్రతి అంశాన్ని ఉల్లంఘించారు. నాటి సంకుచిత, కుటిల మనస్తత్వం ఆ పార్టీ నేతల్లో ఇంకా సజీవంగానే ఉంది. రాజ్యాంగంపై తమకున్న తిరస్కారభావాన్ని దాచిపెట్టి వారెంతగా నటిస్తున్నా ప్రజలు అర్థం చేసుకుని తిరస్కరించారు’’ అంటూ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమిపై ఎద్దేవా చేశారు.


స్వీయ వైఫల్యాలు దాచుకునేందుకే ఎమర్జెన్సీపై మోదీ వ్యాఖ్యలు

-ఖర్గే 

స్వీయ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ప్రధాని మోదీ- ఎమర్జెన్సీపై విమర్శలు చేస్తూ పాత చరిత్రను తిరగదోడుతున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ‘ఎక్స్‌’లో విమర్శించారు. ‘‘ఏకాభిప్రాయం, సహకారం గురించి చెప్పే మోదీ.. దానికి పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తుంటారు. పార్టీలను చీల్చడం, ప్రభుత్వాలను దొడ్డిదారిన పడదోయడం, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, సీఎంలను జైళ్లకు పంపించడం.. ఇదంతా అప్రకటిత ఎమర్జెన్సీ కాదా? 146 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్‌ చేసినప్పుడు ఏకాభిప్రాయం ఏమైంది? నోట్లరద్దు, లాక్‌డౌన్, ఎన్నికల బాండ్లు వంటి అంశాల్లో అది ఎక్కడకు పోయింది?’’ అని ప్రశ్నించారు. పార్లమెంటులో అనేక బిల్లులను గంటలోనే ఆమోదించారని గుర్తుచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు