పవన్‌ శక్తి... వర్మ యుక్తి

జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ను పిఠాపురంలో ఎలాగైనా ఓడించాలని జగన్‌ కంకణం కట్టుకున్నా... అందుకు దీటైన వ్యూహంతో జనసేనాధిపతి విజయం సాధించారు.

Published : 05 Jun 2024 06:42 IST

లోకల్‌ ఎజెండాతో ఆకట్టుకున్న జనసేన అధినేత 
పిఠాపురంలో కలిసి కదిలిన మూడు పార్టీలు

ఈనాడు, కాకినాడ: జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ను పిఠాపురంలో ఎలాగైనా ఓడించాలని జగన్‌ కంకణం కట్టుకున్నా... అందుకు దీటైన వ్యూహంతో జనసేనాధిపతి విజయం సాధించారు. పవన్‌ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయమై మొదటి నుంచి సస్పెన్స్‌ కొనసాగింది. చివరకు దత్తాత్రేయ జన్మస్థలమైన పిఠాపురాన్ని ఆయన ఎంచుకున్నారు. అక్కడ తెదేపా అభ్యర్థిత్వం ఆశించిన మాజీ ఎమ్మెల్యే ఎస్‌.వి.ఎస్‌.ఎన్‌.వర్మ అప్పటికే పోటీకి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. దాంతో సాక్షాత్తూ తెదేపా అధినేత చంద్రబాబు జోక్యం చేసుకుని వర్మతో మాట్లాడి ఒప్పించారు. పిఠాపురం నియోజకవర్గ పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్న వర్మ... పవన్‌కల్యాణ్‌ తరఫున ప్రచారంతోపాటు పోలింగు నిర్వహణలోనూ కీలకపాత్ర పోషించారు. జనసేన, తెదేపా, భాజపా శ్రేణులు ఒక్కటై పనిచేయడం, పవన్‌ అభిమానులు పెద్ద ఎత్తున రంగంలోకి దిగడంతోపాటు సామాజిక సమీకరణాలూ కలిసి రావడంతో పవన్‌కల్యాణ్‌ భారీ మెజారిటీతో విజయం అందుకున్నారు. 

అక్కడే మకాం... జనంతో మమేకం 

ఎన్నికల షెడ్యూలు వచ్చిన తర్వాత పవన్‌కల్యాణ్‌ పిఠాపురం నియోజకవర్గంలోనే మకాం చేశారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలులో గృహ ప్రవేశం చేసి, అక్కడి నుంచే కార్యకలాపాలు సాగించారు. ఈ నివాసంలోనే ఉగాది వేడుకలనూ జరుపుకొన్నారు. అక్కడి నుంచే రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ ప్రచారానికి వెళ్లి వచ్చారు. మధ్యలో రోడ్‌షోలతో ప్రజలతో మమేకమవుతూ ఓటర్లను ఆకట్టుకున్నారు. స్థానిక ఎజెండాతో జనం ముందుకొచ్చారు. పిఠాపురం ప్రాంతాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానని, ఉప్పాడను ఏళ్లుగా వేధిస్తున్న సముద్రం కోత సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానని భరోసా ఇచ్చారు. ప్రతి మండలంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తామని, ఏలేరు, సుద్దగడ్డ జలాశయాలను ఆధునీకరిస్తామని, పిఠాపురాన్ని సీడ్‌ హబ్‌గా మార్చడంతోపాటు సెరీ, హర్టీకల్చర్‌ రైతులను ఆదుకుంటామన్నారు. పట్టు రైతులకు ప్రత్యేక మార్కెటింగ్‌ సదుపాయం కల్పిస్తామన్నారు. రైతులను రోడ్డున పడేసిన ఎస్‌ఈజెడ్‌లో కొత్త పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే బాధ్యత తీసుకుంటానని భరోసా ఇచ్చారు. గొల్లప్రోలు సంతను అభివృద్ధి చేస్తానన్నారు. ఇలా పలు హామీలతో కరపత్రాలు పంపిణీ చేసి ప్రజలకు చేరువయ్యారు. నియోజకవర్గంలోని రెండు పట్టణాలు, 52 గ్రామాల ప్రజలకు చేరువయ్యేలా రోడ్‌షోలు, బహిరంగ సభలు నిర్వహించారు. 

వర్మ కుటుంబ సభ్యులకూ ప్రాధాన్యం 

మాజీ ఎమ్మెల్యే వర్మ పవన్‌కల్యాణ్‌ గెలుపులో కీలకపాత్ర పోషించారు. ప్రతి పర్యటనలోనూ ఇద్దరూ కలిసే పాల్గొనడంతో రెండు పార్టీల శ్రేణుల మధ్య సమన్వయం సాధ్యపడింది. పవన్‌కల్యాణ్‌ సైతం వర్మతోపాటు ఆయన కుటుంబ సభ్యులకూ అత్యంత ప్రాధాన్యమిచ్చారు. పిఠాపురంలో వర్మ ప్రాధాన్యాన్ని అడుగడుగునా ప్రస్తావించారు. జనసేన ప్రధాన కార్యదర్శి, పవన్‌ సోదరుడు కొణిదెల నాగబాబు సైతం ఇక్కడే మకాం చేసి అన్ని వ్యవహారాలూ స్వయంగా చూసుకున్నారు. మరోవైపు జగన్‌ ఈ నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. పవన్‌కల్యాణ్‌ను ఓడించే బాధ్యతలను మిథున్‌రెడ్డికి అప్పగించారు. మద్యం, డబ్బులతో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి అన్ని ప్రాంతాలకు వైకాపా సీనియర్‌ నాయకులను ఇన్‌ఛార్జులుగా నియమించి, పర్యవేక్షించారు. ఆఖరికి చివరిరోజు వైకాపా అభ్యర్థి వంగా గీత గెలిస్తే ఉప ముఖ్యమంత్రిని చేస్తానని కూడా జగన్‌ ప్రకటించారు. ఇవేమీ పవన్‌కల్యాణ్‌ విజయాన్ని అడ్డుకోలేకపోయాయి. నాగబాబు భార్య పద్మజ, కుమారుడు వరుణ్‌ తేజ్, మేనల్లుళ్లు సాయిధరమ్‌ తేజ్, వైష్ణవ్‌ తేజ్, జనసేన స్టార్‌ క్యాంపెయినర్లు జానీ మాస్టర్, హైపర్‌ ఆది, శ్రీను, జబర్దస్త్‌ టీం సభ్యులు ప్రచారంలో పాల్గొని జోష్‌ నింపారు. పవన్‌కల్యాణ్‌కు మద్దతుగా చిరంజీవి సతీమణి సురేఖ, తనయుడు రామ్‌చరణ్‌ పిఠాపురం రావడం శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని