9 ఓట్ల తేడాతో వీరు.. 98 శాతం ఓట్లతో వారు!

ఒక్కోసారి అఖండ మెజారిటీ దక్కొచ్చు. కొన్నిసార్లు అతికొద్ది తేడాతో గట్టెక్కొచ్చు! ఎన్నికల్లో గెలవడం అంటేనే ఓ కిక్కు..! అందుకే జయాపజయాలపైనే కాకుండా మెజారిటీలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది.

Published : 04 Jun 2024 05:05 IST

లోక్‌సభ ఎన్నికల్లో రికార్డులు

క్కోసారి అఖండ మెజారిటీ దక్కొచ్చు. కొన్నిసార్లు అతికొద్ది తేడాతో గట్టెక్కొచ్చు! ఎన్నికల్లో గెలవడం అంటేనే ఓ కిక్కు..! అందుకే జయాపజయాలపైనే కాకుండా మెజారిటీలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. దేశ చరిత్రలో అత్యల్ప మెజారిటీ రికార్డు ఇద్దరి పేరిట ఉంది. 1989 ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన కొణతాల రామకృష్ణ తన సమీప ప్రత్యర్థిపై 9 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1998లో బిహార్‌లోని రాజ్‌మహల్‌ స్థానం నుంచి భాజపా నేత సోమ్‌ మరాండీ కూడా కేవలం 9 ఓట్ల మెజారిటీతో గెలిచారు.

పీవీ పేరిట గిన్నిస్‌ రికార్డు.. దానిని చెరిపేసిన ప్రీతమ్‌ ముండే 

1991లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 89.5 శాతం ఓట్లు దక్కించుకున్నారు. 5 లక్షల మెజారిటీతో అప్పట్లో గిన్నిస్‌ రికార్డు సృష్టించారు. ఈ ఎన్నికలో తెలుగుదేశం తరఫున అభ్యర్థిని నిలబెట్టలేదు. లోక్‌జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత నేత రామ్‌ విలాస్‌ పాస్వాన్‌.. 1977లో జరిగిన ఎన్నికల్లో బిహార్‌లోని హాజీపుర్‌ నుంచి 89 శాతం ఓట్లు సాధించారు. మెజారిటీ 4,24,000 కావడం విశేషం. దేశ చరిత్రలోనే అత్యధిక మెజారిటీతో విజయం దక్కించుకున్న నేతగా భాజపా నాయకురాలు ప్రీతమ్‌ ముండే గుర్తింపు సాధించారు. 2014 ఉప ఎన్నికల్లో ఆమె ఈ అరుదైన ఘనత సాధించారు. కేంద్ర మాజీ మంత్రి, మహారాష్ట్ర బీడ్‌ నియోజకవర్గ ఎంపీ గోపీనాథ్‌ ముండే రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ స్థానంలో ఉపఎన్నిక నిర్వహించారు. ఇక్కడ ఆయన కుమార్తె ప్రీతమ్‌ పోటీచేసి, రికార్డు స్థాయిలో 6.96 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆ రికార్డును ఇప్పటివరకు ఎవరూ చేరుకోలేకపోయారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో నలుగురు భాజపా అభ్యర్థులు 6 లక్షల పైచిలుకు మెజారిటీతో గెలిచారు. జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ స్థానం నుంచి 1989లో పీఎల్‌ హాండూకు (జమ్మూకశ్మీర్‌ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ) ఏకంగా 98 శాతం ఓట్లు పోలయ్యాయి. అప్పట్లో ఈ స్థానంలో 7.36 లక్షల ఓటర్లుండగా.. కేవలం 5 శాతం (37,377) మంది మాత్రమే ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇందులో 36,055 మంది హాండూనే ఎన్నుకొన్నారు. ఆ ఎన్నికల్లో ఇక్కడ ప్రధాన పార్టీల నుంచి ప్రత్యర్థులెవరూ లేరు.

(ఇంటర్నెట్‌ డెస్క్‌)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని