ప్రచార భోజనంబు

‘‘వివాహ భోజనంబు... వింతైన వంటకంబు...’’ విశేష ప్రజాదరణ పొందిన ఈ పాట కాస్త మారింది.   ‘‘ప్రచార భోజనంబు... తింటుంటే కమ్మగుండు.. ఈ ఒక్కరోజే కాదు.. ఇది ఎన్నికల పుణ్యంబు...’’ అంటూ వివిధ పార్టీల కార్యకర్తలు, నాయకులు లొట్టలేస్తున్నారు.

Updated : 03 Nov 2023 17:30 IST

కార్యకర్తలకు నోరూరించే వంటకాలు
వంట బృందాలు, చెఫ్‌లకు మస్తు గిరాకీ

‘‘వివాహ భోజనంబు... వింతైన వంటకంబు...’’ విశేష ప్రజాదరణ పొందిన ఈ పాట కాస్త మారింది.   ‘‘ప్రచార భోజనంబు... తింటుంటే కమ్మగుండు.. ఈ ఒక్కరోజే కాదు.. ఇది ఎన్నికల పుణ్యంబు...’’ అంటూ వివిధ పార్టీల కార్యకర్తలు, నాయకులు లొట్టలేస్తున్నారు. అంతేకాదు... ఎన్నికల పుణ్యమాని గరిటె తిప్పే వంట మేస్త్రీలకు, కేటరింగ్‌ బృందాలకు మస్తు గిరాకీ దొరుకుతోంది. వివాహాలు, చిన్నచిన్న వేడుకలప్పుడు తప్ప ఏడాది పొడవునా సరైన గిరాకీ లేని వారికి గడియ తీరిక లేదిప్పుడు. పది, ఇరవై, యాభై కాదు... ఏకంగా వందలు, వేల సంఖ్యలో భోజనాలను సకాలంలో సరఫరా చేయాల్సి ఉండటంతో వారు వంటగదుల్లో యుద్ధమే చేస్తున్నారు. 

ప్రతి అభ్యర్థికి ప్రత్యేకంగా వంట బృందం

ప్రధాన పార్టీలు మెజారిటీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాయి. మరికొన్నిచోట్ల జాబితాలు విడుదల కావాల్సి ఉన్నా ఇప్పటికే కొంత స్పష్టతైతే ఉంది. మండలాలు, పెద్ద గ్రామాలను లక్ష్యంగా చేసుకుని ప్రచారం కూడా మొదలైంది. దీనికోసం ఒక్కో అభ్యర్థి తన నియోజకవర్గం మొత్తంగా కనీసం వంద వరకు బృందాలను ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి బృందంలో కనీసం పది మంది కార్యకర్తలతోపాటు స్థానిక సానుభూతిపరులు ఉంటున్నారు. ఇలా నిత్యం వెయ్యి మందికిపైగా కార్యకర్తలు, నాయకులు పనిచేస్తున్నారు. వీరందరికీ అల్పాహారంతోపాటు సమయానికి రెండు పూటలా భోజనం అందివ్వడం అభ్యర్థులకు సవాలే. అందుకే 10-15 మందితో కూడిన వంట బృందాలను నియమించుకుంటున్నారు.

శివార్లలో కేటరింగ్‌

మరోవైపు హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, నిజామాబాద్‌ కేంద్రాలుగా ఉన్న కేటరింగ్‌ బృందాలకు మంచి గిరాకీ ఉంటోంది. రుచికరమైన రకరకాల ఆహార పదార్థాలను వీటి నిర్వాహకులు అందజేస్తున్నారు. ప్లేటుకు ఇంతని వసూలు చేస్తున్నారు. కోడి కూర, వేపుడుతో కలిపితే రూ.140, బిర్యానీకి రూ.160, మాంసాహారానికి రూ.180, మటన్‌ బిర్యానీకి రూ.200 చొప్పున తీసుకుంటున్నారు. కనీసం 200 భోజనాలకు ఒక ధర, 300 మించి సరఫరా చేయాల్సి వస్తే మరో ధరలు ఉంటాయని హైదరాబాద్‌కు చెందిన ఒక కేటరింగ్‌ యజమాని చెప్పారు. తక్కువ సంఖ్యలో ఆర్డర్లు ఉంటే... ధరలు వేరుగా ఉంటాయన్నారు. లోకేషన్‌ షేర్‌ చేస్తే తామే ఎక్కడికైనా తీసుకెళుతున్నట్లు చెబుతున్నారు.

అభ్యర్థులు వారానికి సరిపడా ఏమేమి వండాలో ముందే జాబితా పంపిస్తున్నారు. దాని ప్రకారం వంటవాళ్లు నోరూరించేలా భోజనాలు తయారు చేసి అందిస్తున్నారు. ఆయా ఆహార పదార్థాల్లోనూ ప్రత్యేకతలు ఉంటున్నాయి. ఆది, బుధ, శుక్రవారాల్లో కోడికూర, మిగిలిన రోజుల్లో కూరగాయలు అందిస్తున్నారు. కొందరు అభ్యర్థులైతే రోజూ ముక్క భోజనం పెట్టిస్తున్నారు.

తాత్కాలికంగా ఉపాధి

అభ్యర్థుల క్యాంపులు, ప్రధాన ప్రచార శ్రేణులకు ఆహారం సిద్ధం చేస్తున్న చెఫ్‌లకు, వంట మేస్త్రీలకు గిరాకీ పెరిగింది. వీరితో ఎన్నికల సమయం వరకు కనీసం రూ.50 వేలకు ఒప్పందం చేసుకుంటున్నారు. సహాయకులకు ఒక్కొక్కరికి రోజుకు రూ.700 చెల్లిస్తున్నారు. అంటే సహాయకులకు రానున్న 30 రోజులకు రూ.25 వేలకు మించే ఆదాయం లభించనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని