KCR: ఒకరు పోతే పది మందిని తీర్చిదిద్దుకుందాం

పార్టీ మారిన నాయకుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని.. ఒకరుపోతే పది మంది నాయకులను పార్టీ తీర్చిదిద్దుకుంటుందని భారాస అధినేత కేసీఆర్‌ పునరుద్ఘాటించారు.

Published : 29 Jun 2024 03:54 IST

పార్టీ మారిన నాయకుల గురించి ఆలోచించొద్దు
రెట్టించిన ఉత్సాహంతో పనిచేద్దాం
శ్రేణులతో భారాస అధినేత కేసీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: పార్టీ మారిన నాయకుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని.. ఒకరుపోతే పది మంది నాయకులను పార్టీ తీర్చిదిద్దుకుంటుందని భారాస అధినేత కేసీఆర్‌ పునరుద్ఘాటించారు. తెలంగాణ ఆత్మను అర్థం చేసుకుంటూ.. సమస్యల లోతును పట్టుకొని పరిష్కరించే సత్తా కేవలం భారాసకు మాత్రమే ఉందని ఆయన అన్నారు. సమైక్యవాదులతో కలబడి, నిలబడి అత్యంత కష్టతరమైన తెలంగాణను సాధించిన భారాస శ్రేణులకు.. ప్రస్తుత పరిస్థితులు ఒక లెక్కనే కాదని భరోసా ఇచ్చారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో శుక్రవారం కోరుట్ల, జగిత్యాల, నిజామాబాద్‌ నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘మనం రెట్టించిన ఉత్సాహంతో భవిష్యత్తులో ఇంకా బాగా ప్రజల కోసం పనిచేయాల్సి ఉంది. గత పదేళ్లు ప్రజలు మనకు అవకాశమిచ్చారు. చిత్తశుద్ధితో, రాజీపడకుండా ఉద్యమ ఆకాంక్షల సాధన దిశగా.. లక్ష్యం ప్రకారం పని చేసి ప్రగతిని సాధించాం. వ్యవసాయం, సాగునీరు, విద్యుత్తు వంటి అనేక మౌలిక వ్యవస్థలను మెరుగుపరిచాం. కొన్నిసార్లు ప్రజాస్వామ్యంలో అబద్ధపు ప్రచారాలను నమ్మి ప్రజలు బోల్తాపడుతుంటారు. మొన్నటి ఎన్నికల్లో అదే జరిగింది. అంతమాత్రాన నిరుత్సాహపడొద్దు. మనం ఏ హోదాలో ఉన్నా.. ప్రజల కోసం పని చేయాల్సిందే. ఆనాడు మనం ఉద్యమంలో దిగినప్పుడు మనతో ఎవరున్నారు? నాడైనా నేడైనా నాయకులను తయారు చేసుకునేది పార్టీనే. మొన్న జగిత్యాల నుంచి ఒకాయన పోయి దొంగల్లో కలిశారు. బాధ పడేదేమీలేదు. ఆయనను తయారుచేసింది పార్టీనే. అంతకన్నా మెరుగైన నాయకత్వాన్ని పార్టీ తయారు చేసుకుంటుంది’’ అని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, డాక్టర్‌ సంజయ్, కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్‌.రమణ, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జీవన్‌రెడ్డి, జాజుల సురేందర్, గంప గోవర్ధన్, హన్మంత్‌ షిండే, జగిత్యాల జడ్పీ ఛైర్మన్‌ వసంత సురేశ్, పెద్దపల్లి భారాస నేత ఉష, తదితరులు పాల్గొన్నారు.

ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో జరిగిన సమావేశంలో భారాస శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్న కేసీఆర్‌

ఆత్మీయ సమావేశాలకు మూడు రోజుల విరామం

పలు నియోజకవర్గాల నుంచి తరలివస్తున్న ప్రజలు, కార్యకర్తలతో 15 రోజులుగా కేసీఆర్‌ నిత్యం సమావేశమవుతున్నారు. ఈ సమావేశాలకు మూడు రోజులు విరామం ప్రకటించాలని పార్టీ నిర్ణయించింది. శనివారం నుంచి సోమవారం వరకూ ¸ సమావేశాలు జరగవని మళ్లీ ఎప్పటి నుంచి నిర్వహిస్తారనేది త్వరలోనే ప్రకటిస్తామని పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. ముందస్తు సమాచారం లేకుండా వచ్చి ఇబ్బందులు పడొద్దని ప్రజలను కేసీఆర్‌ కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని