YS Jagan: గెలిస్తే ఒకలా.. ఓడితే మరోలా

ఎన్నికల ఫలితాలు వెలువడగానే ‘పథకాలు తీసుకున్నవారంతా ఏమయ్యారు’ అంటూ తన ఓటమి నెపాన్ని ప్రజలపై నెడుతూ మాట్లాడిన వైకాపా అధ్యక్షుడు జగన్‌.. ఇప్పుడు ఈవీఎంలపై కొత్త పల్లవినెత్తుకున్నారు.

Published : 19 Jun 2024 06:10 IST

2019లో ఈవీఎంలపై ఎలాంటి ఫిర్యాదులూ లేవన్నారు
ఇప్పుడు బ్యాలట్‌ పత్రాలనే వినియోగించాలంటూ ట్వీట్‌
ఎన్నికల్లో ఘోర పరాజయంతో జగన్‌ కొత్త పాట

ఈనాడు, అమరావతి: ఎన్నికల ఫలితాలు వెలువడగానే ‘పథకాలు తీసుకున్నవారంతా ఏమయ్యారు’ అంటూ తన ఓటమి నెపాన్ని ప్రజలపై నెడుతూ మాట్లాడిన వైకాపా అధ్యక్షుడు జగన్‌.. ఇప్పుడు ఈవీఎంలపై కొత్త పల్లవినెత్తుకున్నారు. ఈవీఎంలు వద్దు..బ్యాలట్‌ పేపర్లను వాడే దిశగా మనం ముందుకు కదలాలి అంటూ సూక్తులు వల్లిస్తున్నారు. మంగళవారం ఆయన ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. ‘న్యాయం అందడమే కాదు.. అలా అందజేసినట్లుగా కనిపించాలి. ప్రజాస్వామ్యం బలంగా ఉండడమే కాదు, నిస్సందేహంగా బలంగా ఉన్నట్లు కనిపించాలి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో జరిగే ఎన్నికల్లో ఈవీఎంలను కాకుండా బ్యాలట్‌ పత్రాలనే వినియోగిస్తున్నారు. మన ప్రజాస్వామ్య స్ఫూర్తిని కొనసాగించేందుకు మనం ఆ దిశగా ముందుకు కదలాలి’ అంటూ మంగళవారం ఆయన ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు.

80శాతం మంది ఓటేసినా ఒక్క ఫిర్యాదూ లేదు

ఇదే జగన్‌ 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఈవీఎంలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు మరోలా ఉన్నాయి. అప్పుడు ఏమన్నారంటే.. ‘80 శాతం ఓటర్లు పోలింగ్‌ బూత్‌ల్లో బటన్లు నొక్కారు. వారు ఎవరికి ఓటు వేశారో వీవీ ప్యాట్‌లో కూడా కనిపించింది. రెండూ మ్యాచ్‌ అయ్యాయి కాబట్టే ఓటు వేసిన వాళ్లంతా సంతృప్తి చెందారు. ఈ 80 శాతం ఓటర్లలో ఏ ఒక్క ఓటరూ ఎక్కడా ఫిర్యాదు చేయలేదు. నేనున్నా, నేను ఫ్యాన్‌ గుర్తుకు ఓటేస్తే వీవీ ప్యాట్‌లో సైకిల్‌ గుర్తు కనిపిస్తే నేనెందుకు గమ్మునుంటా? గమ్మునుండను కదా! అక్కడే బూత్‌లోనే గొడవ చేసి ఉండేవాడిని. అక్కడే ఫిర్యాదు చేసేవాడిని.. అలాగే ఓటేసిన తర్వాత అది వేరే పార్టీకి పడినట్లు ఎవరికీ కనిపించలేదు కాబట్టే.. ఓటర్లు సంతృప్తి చెంది ఎక్కడా ఫిర్యాదులు ఇవ్వలేదు’ అని వ్యాఖ్యానించిన విషయం ఇక్కడ పరిశీలనార్హం.

జూన్‌ 4న జగన్‌ పలికిన పలుకులు..

ఎన్నికల ఫలితాలు వెలువడిన జూన్‌ 4వ తేదీ సాయంత్రం జగన్‌ స్పందిస్తూ.. ‘ఫలితాలు ఇలా వస్తాయని ఊహించలేదు. ఎవరో మోసం చేశారనో, ఎవరో అన్యాయం చేశారనో అనొచ్చు కానీ, వాటికి ఆధారాల్లేవు. ఏం జరిగిందో దేవుడికే తెలుసు.. అమ్మఒడి తీసుకున్న 53లక్షల మంది తల్లులు, పింఛన్లు తీసుకున్న 66 లక్షల మంది, 1.05 కోట్ల మంది పొదుపు సంఘాల మహిళలు, చేయూతనందుకున్న 26లక్షల మంది మహిళలు, పెట్టుబడి సాయం అందుకున్న 54 లక్షల మంది రైతులు ఏమయ్యారు’ అంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాల కింద తానే తన సొంత డబ్బును పంచి పెడితే వారంతా తనకు ఓటు వేయలేదు అన్నట్లుగా మాట్లాడారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని