Andhra News: ఎట్టకేలకు వైకాపా నేతల అరెస్టు

గుంటూరు జిల్లా మంగళగిరిలో తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైకాపా ఎమ్మెల్సీ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్‌ను నిందితులుగా గుర్తించారు.

Published : 04 Jul 2024 06:00 IST

ఐదుగురి అరెస్టు... న్యాయస్థానంలో హాజరు
తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో 56 మంది నిందితుల గుర్తింపు
కీలక నిందితులుగా వైకాపా నేతలు అప్పిరెడ్డి, దేవినేని అవినాష్‌

ఈనాడు, అమరావతి: గుంటూరు జిల్లా మంగళగిరిలో తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైకాపా ఎమ్మెల్సీ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్‌ను నిందితులుగా గుర్తించారు. ఈ కేసులో బుధవారం గుంటూరుకు చెందిన కార్పొరేటర్‌ అచ్చాల వెంకటరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్‌ బత్తుల దేవానంద్, గిరి రాము, ఎస్‌కే ఖాజామొహిద్దీన్, షేక్‌ మస్తాన్‌వలీని మంగళగిరి పోలీసులు అరెస్టుచేసి కోర్టులో హాజరుపరిచారు. 2021 అక్టోబరు 19న తెదేపా కార్యాలయంపై వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. అడ్డొచ్చిన వారిపై దాడిచేసి తీవ్రంగా గాయపర్చారు. ఈ ఘటనపై అప్పట్లో గుంటూరు జిల్లా పోలీసులు కేసు నమోదుచేసినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీటీవీ ఫుటేజీలు, టోల్‌ప్లాజా వద్ద సేకరించిన డేటాతో పాటు తెదేపా కేంద్ర కార్యాలయంలో తీసుకున్న సమాచారంతో 85 స్క్రీన్‌షాట్లు తీసి విశ్లేషించి కొత్తగా 27మంది నిందితులను గుర్తించారు. ఇందులో వైకాపా కీలక నేతలు ఉండడంతో వారిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

వైకాపా కీలక నేతల ప్రమేయంపై దర్యాప్తు

దాడి కేసులో కొందరిని కొత్తగా గుర్తించారు. వీరిలో లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్‌తో పాటు విజయవాడ నగరపాలకసంస్థ వైకాపా ఫ్లోర్‌లీడర్‌ వెంకట సత్యనారాయణ (అరవ సత్యం), విజయవాడ కార్పొరేటర్‌ అంబేడ్కర్, గుంటూరు కార్పొరేటర్‌ అచ్చాల వెంకటరెడ్డి తదితరులను నిందితులుగా చేర్చారు. ఇప్పటివరకు 56 మందిని గుంటూరు జిల్లా పోలీసులు నిందితులుగా గుర్తించారు. వీరిపై నమోదుచేసిన వాటిలో కొన్ని నాన్‌బెయిలబుల్‌ సెక్షన్లు ఉన్నాయి.

నిందితులకు 14 రోజుల రిమాండ్‌

తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అరెస్టయిన ఐదుగురికి మంగళగిరి న్యాయస్థానం రిమాండ్‌ విధించింది. అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి వి.రామకృష్ణ నిందితులకు 14 రోజుల రిమాండ్‌ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ నాగమణి వాదనలు వినిపిస్తూ నిందితులపై హత్యాయత్నం, కుట్ర తదితర సెక్షన్ల కింద కేసు నమోదైందని, దర్యాప్తులో అనేక కొత్త విషయాలు వెలుగుచూసినందున రిమాండ్‌ విధించాలని కోరారు. నిందితుల తరఫున న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం మారిన తర్వాత ఉద్దేశపూర్వకంగా వైకాపా నేతలపై అదనపు సెక్షన్లు జతచేసినందున రిమాండ్‌ తిరస్కరించాలని వాదించారు. అనంతరం న్యాయమూర్తి నిందితులకు రిమాండ్‌ విధించారు.


న్యాయపోరాటం చేస్తాం: అంబటి రాంబాబు 

మంగళగిరి, న్యూస్‌టుడే: తమ పార్టీ కార్యకర్తల అరెస్టుపై న్యాయపోరాటం చేస్తామని మాజీ మంత్రి, వైకాపా నాయకుడు అంబటి రాంబాబు తెలిపారు. తెదేపా కార్యాలయంపై దాడి కేసులో గుంటూరుకు చెందిన ఐదుగురు వైకాపా కార్యకర్తలను మంగళగిరి గ్రామీణ పోలీసులు అరెస్టు చేయడంతో ఆయన మాజీ మంత్రి మేరుగు నాగార్జునతో కలిసి పోలీసుస్టేషన్‌కి చేరుకుని సీఐ శ్రీనివాసరావుతో మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని