Pinnelli: వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు

ఈవీఎం ధ్వంసం, ఎన్నికల అల్లర్ల కేసుల్లో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.

Updated : 26 Jun 2024 17:28 IST

నరసరావుపేట: పల్నాడు జిల్లా మాచర్ల వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎట్టకేలకు అరెస్టయ్యారు. ఎన్నికల సమయంలో పాల్పడిన నేరాలకు సంబంధించి హైకోర్టు తాత్కాలిక ఉపశమనం నేపథ్యంలో పిన్నెల్లి ఇంతకాలం అరెస్టు కాలేదు. ముందస్తు బెయిల్‌ పిటిషన్లను హైకోర్టు కొట్టివేయడంతో పోలీసులు వెంటనే ఆయన్ను నరసరావుపేటలో అదుపులోకి తీసుకుని పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయానికి తరలించారు.

మే 13న పోలింగ్‌ రోజు మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి రెచ్చిపోయారు. రెంటచింతల మండలం పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేశారు. బయటకు వస్తున్న సమయంలో చెరుకూరి నాగశిరోమణి అనే మహిళ నిలదీయటంతో ఆమెను తీవ్రంగా హెచ్చరిస్తూ దుర్భాషలాడారు. దీనిపై రెంటచింతల పోలీసులు 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈవీఎం ధ్వంసం చేయడాన్ని అడ్డుకోబోయిన తెదేపా ఏజెంట్‌ నంబూరి శేషగిరిరావుపై దాడి చేశారు. దీనిపై ఎమ్మెల్యే, మరో 15 మందిపై సెక్షన్‌ 307, 147, 148, 120బీ, 324, రెడ్‌విత్‌ 149 ఐపీసీ కింద రెంటచింతల పీఎఎస్‌లో కేసు నమోదైంది. తనను చంపేయాలని పిన్నెల్లి వైకాపా శ్రేణుల్ని ఉసిగొల్పినట్టు శేషగిరిరావు ఫిర్యాదు చేశారు. ఈకేసులో రామకృష్ణారెడ్డిని ఏ-1గా చేర్చారు. దాడి చేసిన ఎమ్మెల్యే అనుచరులు చింతా సుబ్బారావు, మరికొందరిని కేసులో చేర్చారు.

మే 14న పిన్నెల్లి, ఆయన తమ్ముడు వెంకట్రామిరెడ్డి అనుచరులతో కలిసి కారంపూడిలో అలజడి సృష్టించారు. రౌడీమూకలతో తెదేపా కార్యాలయంపై దాడిచేశారు. తెదేపా సానుభూతిపరులపై దాడులు చేస్తూ ఆస్తుల విధ్వంసానికి పాల్పడ్డారు. అడ్డుకోబోయిన సీఐ నారాయణస్వామిపై దాడిచేయడంతో ఆయన గాయపడ్డారు. దీనిపై వీఆర్వో ఫిర్యాదు మేరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి మరికొందరిపై సెక్షన్‌ 307, 332, 143, 147, 324, 149 కింద కేసు నమోదుచేశారు. ఈ కేసులకు సంబంధించి తనను అరెస్టు చేస్తారనే భయంతో పిన్నెల్లి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా జూన్ 4వరకూ అరెస్టు వద్దని ఆదేశించింది.

జూన్ 4న ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా ఏజెంట్ల నియామకానికి ఇబ్బంది లేకుండా ఆయనకు అరెస్ట్ నుంచి మినహాయింపు ఇచ్చింది. అయితే నంబూరి శేషగిరిరావు దీనిపై సుప్రింకోర్టులో పిటిషన్ వేశారు. పిన్నెల్లిని అరెస్టు చేయకపోవటంపై సుప్రింకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు వెంటనే తగిన ఆదేశాలు ఇవ్వాలని చెప్పింది. హైకోర్టులో పిన్నెల్లి బెయిల్ పిటిషన్ ఆ తర్వాత విచారణకు వచ్చినా తీర్పు రిజర్వ్ చేసి ఉంచారు. బుధవారం బెయిల్ పిటిషన్లు కొట్టివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నాలుగు పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేయడంతో పిన్నెల్లిని పోలీసులు అరెస్టు చేసి ఎస్పీ కార్యాలయానికి తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు