Lavu Sri Krishna Devarayalu: ఏపీ ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చండి: లోక్‌సభలో తెదేపా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు

చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 90% సీట్లు.. 56% ఓట్లతో ఎన్డీయే కూటమికి అద్భుత విజయాన్ని కట్టబెట్టిన ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చేందుకు చర్యలు తీసుకోవాలని తెదేపా పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

Updated : 02 Jul 2024 08:19 IST

పోలవరం, అమరావతి నిర్మాణానికి నిధులివ్వండి 
రెవెన్యూ లోటు గ్రాంటు మంజూరు చేయాలని విజ్ఞప్తి

లోక్‌సభలో మాట్లాడుతున్న లావు శ్రీకృష్ణదేవరాయలు

ఈనాడు, దిల్లీ: చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 90% సీట్లు.. 56% ఓట్లతో ఎన్డీయే కూటమికి అద్భుత విజయాన్ని కట్టబెట్టిన ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చేందుకు చర్యలు తీసుకోవాలని తెదేపా పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అమరావతి, పోలవరం, కేంద్ర విద్యా సంస్థల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమవారం లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన తెదేపా తరఫున మాట్లాడారు. ‘‘ఏపీ ప్రజలు ఇటీవలి ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి అద్భుత విజయాన్ని అందజేశారు. వారి అకాంక్షల మేరకు రాష్ట్ర పునర్నిర్మాణానికి కేంద్రం సహకరించాలి. గత పదేళ్లుగా రాష్ట్రం రెవెన్యూ లోటుతో సతమతమవుతోంది. అందువల్ల 7-8 ఏళ్ల క్రితం విడుదల చేయాల్సిన రెవెన్యూ లోటు మొత్తాన్ని ఇప్పుడైనా ఇవ్వాలని ఆర్థిక మంత్రిని కోరుతున్నా. ప్రస్తుతం రాష్ట్రం రూ.13.5 లక్షల కోట్ల అప్పుల భారాన్ని మోస్తోంది. గత అయిదేళ్లలో తెచ్చిన రుణాలతో కొత్తగా ఒక్క మౌలిక వసతి కూడా కల్పించలేదు. తద్వారా ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి ప్రధాని, కేంద్ర మంత్రులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నా. పోలవరం ప్రాజెక్టు పూర్తికి జల్‌శక్తి మంత్రి దృష్టి సారించాలి. ఆయా పనులను వేగవంతం చేయాలి. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి రాజధాని అమరావతి నిర్మాణంపై దృష్టిపెట్టాలి. నిధులిచ్చి సాధ్యమైనంత త్వరగా రాజధాని నిర్మాణం పూర్తికి సహకరించాలి. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ నిర్మాణాన్ని వేగవంతం చేయాలి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో జాతీయ రహదారుల అభివృద్ధి కోసం ఏపీకి విధించిన రూ.4,700 కోట్ల పరిమితిని ఎత్తివేసి, ఎక్కువ నిధులు కేటాయించాలి. విభజన చట్టంలో పేర్కొన్న కేంద్ర విద్యా సంస్థల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలి. కాకినాడ వద్ద గ్రీన్‌ఫీల్డ్‌ పెట్రోకెమికల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు చేయాలి. రాష్ట్రానికి మంజూరైన రైల్వే ప్రాజెక్టుల భూసేకరణ కోసం కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాటా అడుగుతోంది. ఇప్పటికే రెవెన్యూ లోటుతో సతమతమవుతున్న ఏపీని మిగతా రాష్ట్రాలతో సమానంగా చూడకుండా ఆయా రైల్వే ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లాలి’’ అని శ్రీకృష్ణదేవరాయలు కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని