Komatireddy: నల్గొండలోని భారాస కార్యాలయాన్ని కూల్చేయండి

నల్గొండలో రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా భారాస జిల్లా కార్యాలయాన్ని నిర్మించారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు.

Published : 02 Jul 2024 07:33 IST

మంత్రి కోమటిరెడ్డి ఆదేశాలు

నల్గొండలో విద్యుత్తు ఉపకేంద్ర నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, చిత్రంలో కలెక్టర్‌ నారాయణరెడ్డి తదితరులు

నల్గొండ జిల్లా పరిషత్తు, న్యూస్‌టుడే: నల్గొండలో రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా భారాస జిల్లా కార్యాలయాన్ని నిర్మించారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. దాన్ని కూల్చి వేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. నల్గొండలో రూ.3 కోట్ల అంచనా వ్యయంతో విద్యుత్తు ఉపకేంద్ర నిర్మాణ పనులకు సోమవారం మంత్రి శంకుస్థాపన చేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అనుమతి లేకుండా పేదలు ఇళ్లు నిర్మించుకుంటే నోటీసులు జారీ చేసి కూల్చి వేసే అధికారులు భారాస కార్యాలయం విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేశారని ప్రశ్నించారు. భారాస కార్యాలయ నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే రెండు నోటీసులు ఇచ్చామని అధికారులు మంత్రికి వివరించారు. వెంటనే కూల్చివేతకు ఉత్తర్వులు ఇవ్వాలని అధికారులకు మంత్రి సూచించారు. ఆ స్థలంలో విద్యార్థులకు వసతి గృహాలు నిర్మిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో హైదరాబాద్‌ తర్వాత నల్గొండను మోడల్‌ పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా రూ.700 కోట్లతో జాతీయ రహదారి బైపాస్‌ రోడ్డు నిర్మాణ పనులను ఆగస్టులో ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ నారాయణరెడ్డి, నల్గొండ పుర ఛైర్మన్‌ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని