Pawan Kalyan: మమ్మల్ని గుండెల్లో పెట్టుకునేలా పాలన అందిస్తాం

వైకాపా అప్పుల ఊబిలోకి నెట్టేసిన ఈ రాష్ట్రానికి అంకితభావం ఉన్న నాయకులు కలిస్తే తప్ప అభివృద్ధి రాదన్నది తన విశ్వాసమని.. చంద్రబాబు అనుభవం, కార్యదక్షత ప్రభుత్వాన్ని నడిపించగలవని నమ్మానని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ అన్నారు.

Published : 04 Jul 2024 06:43 IST

ఆర్థికలోటు తీర్చి.. రాష్ట్రానికి నిధులు తెచ్చే బాధ్యత మాది
పిఠాపురం బహిరంగసభలో ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌

పిఠాపురం ఉప్పాడ బస్టాండ్‌ కూడలిలో జరిగిన వారాహి బహిరంగసభలో మాట్లాడుతున్న జనసేన అధినేత పవన్‌కల్యాణ్, చిత్రంలో ఎంపీ ఉదయ్‌ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే వర్మ, భాజపా నాయకుడు కృష్ణంరాజు, జనసేన జాతీయ అధికార ప్రతినిధి అజయ్‌కుమార్‌ తదితరులు

ఈనాడు, కాకినాడ- న్యూస్‌టుడే, పిఠాపురం: వైకాపా అప్పుల ఊబిలోకి నెట్టేసిన ఈ రాష్ట్రానికి అంకితభావం ఉన్న నాయకులు కలిస్తే తప్ప అభివృద్ధి రాదన్నది తన విశ్వాసమని.. చంద్రబాబు అనుభవం, కార్యదక్షత ప్రభుత్వాన్ని నడిపించగలవని నమ్మానని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ అన్నారు. ‘కనీసం దశాబ్దంన్నర మీరు మమ్మల్ని గుండెల్లో పెట్టుకునేలా పాలన అందిస్తాం. చంద్రబాబు అపార అనుభవంతో ఒక్క వాలంటీరు అవసరం లేకుండా.. ప్రభుత్వ ఉద్యోగులతోనే ఒకటో తేదీన లక్షల మందికి పింఛన్లు అందించగలిగాం’ అని పేర్కొన్నారు. తనను ఎన్నికల్లో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు బుధవారం సాయంత్రం పిఠాపురంలో వారాహి బహిరంగసభను పవన్‌కల్యాణ్‌ నిర్వహించారు. చంద్రబాబు, తాను ఆర్థికంగా లోటులో ఉన్న రాష్ట్రాన్ని ఎలా బయటకు తీసుకురావాలని ఆలోచిస్తున్నామని.. నిధులు తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటామన్నారు. 

మరోసారి ప్రమాణం

‘పవన్‌కల్యాణ్‌ అనే నేను భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాను. అఖండ మెజారిటీతో గెలిపించిన నా పిఠాపురం నియోజకవర్గ ప్రముఖులకు, పెద్దలకు, ప్రజలకు, యువతకు, ఆడపడుచులకు, తల్లులకు ప్రతి ఒక్కరికీ హామీ ఇస్తున్నాను. మీ అభ్యున్నతికే కష్టపడతాను. లంచాలు తీసుకోను’ అంటూ సభలో మరోసారి పవన్‌ ప్రమాణం చేశారు. అసెంబ్లీలోకి ఎలా అడుగుపెడతావో చూస్తామని, గేటు కూడా తాకలేవని తనను వైకాపా నాయకులు అన్నారని.. గేటు బద్దలుకొట్టుకొని అసెంబ్లీలోకి పవన్‌ వస్తారన్న తెదేపా మాజీ ఎమ్మెల్యే వర్మ వ్యాఖ్యలు నిజమయ్యాయని చెప్పారు. ‘2019 నుంచి 2024 వరకు 5కోట్ల మంది ప్రజలు.. ఐపీఎస్, ఐఏఎస్‌ యంత్రాంగం సైతం కొద్దిమందికి భయపడ్డారు. 164 అసెంబ్లీ, 21 పార్లమెంటు స్థానాలు ఎంత బలం ఇచ్చాయంటే.. మేము ఏపీ నుంచి వచ్చాం.. తెదేపా-భాజపా-జనసేన ప్రతినిధులమంటే మీకు ఏం కావాలో చెప్పండి అంటున్నారు’ అని చెప్పారు. 

ఎమ్మెల్యే తాలూకా అని చెడ్డపేరు తేవొద్దు..

‘మీరు పిఠాపురం ఎమ్మెల్యే తాలూకానే.. కానీ నాకు చెడ్డపేరు తీసుకురాకండి. రవాణా శాఖ అధికారులు మీ నంబర్‌ ప్లేట్లు చూసి అడిగినా.. వన్‌వేలో తప్పుగా వెళ్లి పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అనొద్దు.. చట్టాలు పాటించండి. మీకు అంత సరదాగా ఉంటే నేను కొన్న స్థలంలో బైక్‌లు తిప్పుకోండి.. మీరు బాగుండాలనే నేను కోరుకుంటా’ అని పవన్‌ అన్నారు. 

బహిరంగసభకు హాజరైన జన సందోహం, అభిమానులు, జనసైనికులు 

పిఠాపురంలో స్థలం కొన్నా.. ఇల్లు కట్టుకుంటా

పవన్‌ పిఠాపురంలో ఉండడు, హైదరాబాద్‌లో ఉంటాడని వైకాపా నేతలు విమర్శించారని.. తాను పిఠాపురంలో మూడున్నర ఎకరాలు కొని ఈరోజే రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నానని తెలిపారు. త్వరలో ఇల్లు, క్యాంపు ఆఫీసు కడతానన్నారు. వినతుల స్వీకరణకు అయిదుగురిని నియమించానని.. వైద్యం, విద్య, అపహరణలు, దాడులు, ఉపాధి తదితర సమస్యలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు.

కొత్త విధానం వచ్చేవరకు మందు తాగొద్దు

సమస్యల పరిష్కారానికి క్వార్టర్‌ సమయం కావాలని పవన్‌ అనడంతో నవ్వులు విరిశాయి. ‘గత ప్రభుత్వం అమ్మే మద్యం క్వార్టర్‌ కాదు.. మూడు నెలలు సమయం ఇవ్వండి.. ఆ మందు ఇంకా అమ్ముతున్నారా..?’ అని ప్రశ్నించారు. ‘అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను అడగాలి. కొత్త విధానం తీసుకొచ్చేవరకూ తప్పదు. ఈలోపు ఆ మద్యం తాగకండి. ఆరోగ్యాలు కాపాడుకోండి’ అంటూ హితవు పలికారు.

మూడు నెలల తర్వాత సినిమాలు

యువత ఓజీ.. ఓజీ.. అంటూ పవన్‌ కొత్త సినిమా టైటిల్‌ పేరు చెబుతూ నినాదాలు చేశారు. ‘సినిమాలు చేసే సమయం ఉందంటారా...? చూద్దాం. మూడు నెలలు ఇవ్వండి. రోడ్లు వేయలేదని, గుంతలు పూడ్చలేదని, ఏమీ చేయలేదని జనం తిట్టకూడదు కదా.. మా నిర్మాతలను కొంత సమయం కోరాను. మా ప్రజలకు సేవచేస్తానని చెప్పా’ అని పవన్‌ అన్నారు.


అరాచక ప్రభుత్వాన్ని మట్టిలో కలిపారు

‘రక్తం చిందించకుండా ప్రజాస్వామ్య విధానాల ద్వారా విప్లవం తెచ్చారు.. 151 స్థానాలున్న అరాచక ప్రభుత్వాన్ని మట్టిలో కలిపేసి 11 స్థానాలకు కుదించారంటే ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్ప లక్షణం అర్థమవుతోంది. మాట్లాడడం కంటే పనిచేయడం మాకు ఇష్టం. కొంచెం సమయం ఇవ్వండి. అన్ని సమస్యలకూ పరిష్కారం చూపుతాం. భవిష్యత్తులో మీరు ఎవరివైపూ చూడాల్సిన అవసరం రాదు.’


వైకాపా నాయకుల్లా దౌర్జన్యాలు వద్దు

‘మనం గెలిచాం కదా అని.. గత ప్రభుత్వ నాయకుల్లా దాడులు చేయొద్దు. చొక్కాలు పట్టుకుని బూతులు తిట్టొద్దు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టొద్దు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అధికారులపై జులుం ప్రదర్శిస్తే క్రమశిక్షణ చర్యలు ఉంటాయని మా నాయకులకు చెప్పా.’

పిఠాపురం బహిరంగసభలో ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని