Pawan Kalyan: తప్పులన్నీ బయటకు తీస్తాం..

రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే పింఛన్లు ఆగిపోతాయని భయపెట్టారని.. కానీ ఎక్కడా అలా జరగలేదని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు.

Updated : 02 Jul 2024 06:39 IST

వ్యవస్థను వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసింది
హామీ ప్రకారం పింఛన్ల సొమ్ము పెంచి ఇళ్ల వద్దే ఇస్తున్నాం
ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీలో ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌

కాకినాడ జిల్లా గొల్లప్రోలులో మహిళకు పింఛను అందిస్తున్న ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌. చిత్రంలో వర్మ

ఈనాడు, కాకినాడ- న్యూస్‌టుడే, గొల్లప్రోలు: రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే పింఛన్లు ఆగిపోతాయని భయపెట్టారని.. కానీ ఎక్కడా అలా జరగలేదని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. రెట్టింపు పింఛను ఇళ్లకు వస్తోందన్నారు.మాట ఇచ్చినట్లు సొమ్ము పెంచామని తెలిపారు. పింఛన్లు పంపిణీ చేస్తామని గత ప్రభుత్వం వాలంటీర్లనే ప్రైవేటు సంస్థను పెట్టిందని ధ్వజమెత్తారు. వారు పింఛను ఇచ్చినందుకు రూ.100 నుంచి రూ.300 లంచంగానో.. నజరానాగానో తీసుకునేవారని ఆరోపించారు. ఇప్పుడు ఉద్యోగుల ద్వారా అందుతోందన్నారు. ఎవరైనా లంచం అడిగితే ప్రభుత్వ అధికారులకు, కూటమి నాయకులకు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. తాము ప్రజల కోసం పనిచేయకపోతే నిలదీయవచ్చన్నారు. వాలంటీర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి ఎలా చూపాలో ఆలోచిస్తున్నామని వివరించారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో సోమవారం ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పవన్‌కల్యాణ్‌ మాట్లాడారు. ‘‘మాకు ఓటేశారో లేదో అడగం.. ఏ పార్టీ వారైనా, అర్హత ఉంటే లబ్ధి చేకూరుతుంది. అద్భుతాలు చేస్తామని చెప్పట్లే.. ఉన్నది ఉన్నట్లు చెబుతాం. ప్రజలకు జవాబుదారీగా ఉంటాం. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తనిఖీల్లో ఎన్ని వేల టన్నుల పేదల బియ్యం పట్టుకున్నారో మీకు తెలుసు. గత ప్రభుత్వంలో పేదలకు చేరాల్సిన బియ్యాన్ని దాచేశారు. కడపలాంటి చోట బెరైటీస్‌ గనులను ఖాళీ చేశారు. ఇసుక, మైనింగ్‌లో ఒక్కో అవినీతి తవ్వితే ఎన్ని బయటపడతాయో తెలీదు. మాది ప్రతీకార ప్రభుత్వం కాదు. తప్పుల్ని మాత్రం బయటకు తీస్తాం. ఇది ప్రజల కష్టాలు వినే ప్రభుత్వం.

గొల్లప్రోలులో పింఛన్ల నమూనా చెక్కుతో పవన్‌కల్యాణ్‌. చిత్రంలో ఎస్‌.వి.ఎస్‌.ఎన్‌.వర్మ తదితరులు

పథకాలపై రీసర్వే జరిగితే మంచిది..

గత ప్రభుత్వం అర్హతలేని వారికి పథకాలు ఇచ్చి, ఉన్నవారికి తీసేసిందనే ఆరోపణలు ఉన్నాయి. సంక్షేమ పథకాలపై రీసర్వే జరిగితే మంచిది. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, క్యాబినెట్‌లో చర్చిస్తాం.

జీతం వద్దని చెప్పా

నా క్యాంపు కార్యాలయం మరమ్మతులు చేస్తామంటే వద్దన్నా. ఫర్నిచర్‌ కొత్తది వద్దని, నేనే తెచ్చుకుంటానని తెలిపా. సెక్రటేరియట్‌ సిబ్బంది వచ్చి జీతం ఇవ్వడానికి సంతకాలు పెట్టమంటే మనస్కరించలేదు. జీతం తీసుకుని పనిచేస్తా అనుకున్నా.. అప్పగించిన శాఖలో డబ్బుల్లేవు. ఈ పరిస్థితుల్లో జీతం తీసుకోవడం తప్పని భావించి వద్దని చెప్పా. పంచాయతీరాజ్‌శాఖ లెక్కలు చూస్తుంటే నిధులు ఎటు వెళ్లిపోయాయో తెలియట్లేదు. ఎన్ని వేల రూ.కోట్లు అప్పులున్నాయో తెలియట్లేదు. ఇష్టారాజ్యంగా నిధుల ఖర్చు చూపారు. శాఖలో అంతా అడ్డగోలుగా ఉంది. రోడ్లు, కాలువల మరమ్మతులకు కనీస ప్రాధాన్యం ఇవ్వలేదు. జల్‌జీవన్‌ మిషన్‌ ద్వారా కేంద్రం నుంచి నిధులకు కొరతలేదు.. అయినా ఎందుకు చేయలేకపోయారో అర్థం కాలేదు. కొల్లేరు ఉన్న కైకలూరు నియోజకవర్గంలో 80 శాతం చేపల చెరువులు ఉన్నా తాగడానికి నీళ్లు లేవు. గోదావరి జిల్లాల్లోనూ అదే పరిస్థితి. పంచాయతీరాజ్‌ శాఖను నడిపే వ్యక్తిగా చెబుతున్నా.. నా వైపు నుంచి అవినీతి ఉండదని మాటిస్తున్నా. ఎన్నికల్లో 21కి 21 ఎలా కొట్టామో రక్షిత మంచినీరు లేని గ్రామం లేదని అనిపించుకోవాలన్నది నా కోరిక. గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు ఉండాలి. అరకులో గర్భిణులను డోలీల్లో తీసుకొచ్చే పరిస్థితి పోవాలి. మన్యం వెళ్లి ప్రతి కుగ్రామం చూడాలని ఉంది. పర్యావరణ శాఖను బలోపేతం చేస్తాం. ఏ కాలుష్యం ఎందుకు వస్తుందో ఆరా తీస్తాం. పారిశ్రామికవేత్తలు ఏం చేస్తున్నారో తెలుసుకుంటాం. 

అప్పుడే పిఠాపురం ఎమ్మెల్యేగా ప్రకటించుకుంటా..

నన్ను పిఠాపురం నుంచి భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటా. ఎక్కువ మాటలు చెప్పి తక్కువ పని చేయదలచుకోలేదు.. తక్కువ చెప్పి, ఎక్కువ చేయాలని అనుకుంటున్నా. ఇప్పుడిక హామీలు నెరవేర్చడమే మన ముందున్న సవాలు. గెలిచిన వెంటనే విజయయాత్ర చేస్తే తృప్తి, ఆనందం ఉండదు. పనిచేసి మీ మన్ననలు పొందాకే ఆనందం వస్తుంది. అప్పుడే నాకు నేను పిఠాపురం ఎమ్మెల్యేగా ప్రకటించుకుంటా’’ అని పవన్‌ కల్యాణ్‌ వివరించారు. కార్యక్రమంలో కాకినాడ గ్రామీణ ఎమ్మెల్యే పంతం నానాజీ, తెదేపా మాజీ ఎమ్మెల్యే ఎస్‌.వి.ఎస్‌.ఎన్‌.వర్మ తదితరులు పాల్గొన్నారు.


పింఛన్ల పెంపు చంద్రబాబుతోనే సాధ్యం..

‘‘ఇది ఏ ఒక్క పార్టీ ప్రభుత్వం కాదు. చంద్రబాబు అధినాయకత్వంలో తెలుగుదేశం సారథ్య పార్టీగా, జనసేన వెన్నుదన్నుగా, భాజపా ఆశీస్సులతో కూడిన ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఇది. ముఖ్యమంత్రి చంద్రబాబు అపార అనుభవం ఈ రాష్ట్రానికి చాలా అవసరం. అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్రాన్ని ఆయన ముందుకు తీసుకెళ్లగలరు. మాట ఇచ్చినట్లు ప్రభుత్వం ఏర్పడిన నెలలోనే పెంచిన పింఛను సొమ్ము ఇంటింటికీ ఇవ్వడం ఆయన అనుభవంతోనే సాధ్యమైంది.’’ 

ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని