TG News: మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక వాయిదా

ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(పీసీసీ) కొత్త అధ్యక్షుడి ఎంపిక, మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయం వాయిదాపడింది.

Updated : 04 Jul 2024 09:18 IST

త్వరలో మరోసారి సమావేశం

ఖర్గే నివాసంలో రాహుల్, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్‌రెడ్డి కొద్దిసేపు భేటీ

మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన కె.కేశవరావు. చిత్రంలో దీపా దాస్‌మున్షీ, సీఎం రేవంత్‌రెడ్డి, రాహుల్‌గాంధీ, కేసీ వేణుగోపాల్‌

ఈనాడు, హైదరాబాద్‌: ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(పీసీసీ) కొత్త అధ్యక్షుడి ఎంపిక, మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయం వాయిదాపడింది. బుధవారం దిల్లీలో కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో రాహుల్‌గాంధీ, కేసీ వేణుగోపాల్, పార్టీ తెలంగాణ ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ, సీఎం రేవంత్‌రెడ్డి కొద్దిసేపు సమావేశమై చర్చించారు. కానీ పీసీసీ అధ్యక్ష పదవి, మంత్రివర్గ విస్తరణపై పెద్దగా చర్చించలేదని తెలుస్తోంది. రెండు రోజుల్లో ఆషాఢమాసం ప్రారంభమవుతున్నందున మంచిరోజులు లేవని, ఇక పదవుల భర్తీ శ్రావణమాసం వచ్చేదాకా ఉండకపోవచ్చని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. పీసీసీకి, మంత్రి పదవులకు పలువురు పోటీపడుతుండటం, సామాజిక సమీకరణాల లెక్కలు తేలనందున త్వరలో మరోసారి సమావేశం చర్చించాలని అగ్రనేతలు నిర్ణయించారు. జాతీయ అంశాలపై కాంగ్రెస్‌ అగ్రనేతలు బిజీగా ఉన్నందున తెలంగాణలో పదవుల భర్తీపై అధిష్ఠానం పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేదని తెలుస్తోంది. ఈ పదవుల కోసం పోటీపడుతున్న పలువురు నేతలు కూడా బుధవారం ఖర్గే నివాసం బయటే ఉన్నారు. పీసీసీ అధ్యక్ష పదవి ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలలో ఒకరికి ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించారు. కానీ ఈ వర్గాల నుంచి నలుగురి మధ్య గట్టి పోటీ ఏర్పడింది. ఎస్సీల నుంచి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎస్టీల్లో ఎంపీ బలరాం నాయక్, బీసీల్లో ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌ గౌడ్, మధుయాస్కీ పోటీపడుతున్నారు. ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి పార్టీ ఆ పదవి ఎవరికిచ్చినా తనకు అభ్యంతరం లేదని చెప్పినట్లు తెలుస్తోంది. వర్కింగ్‌ ప్రెసిడెంటుగా మూడేళ్ల నుంచి పార్టీ కార్యకలాపాలను నిర్వహిస్తున్నందున తనకే ఇవ్వాలని మహేశ్‌కుమార్‌ గౌడ్‌ రెండురోజుల క్రితం ఖర్గేని కలిసి విన్నవించారు. ఇలాగే ఇతర నేతలు కూడా తమ ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడి ఎంపిక ఆధారంగా సామాజిక సమీకరణాల ప్రకారం మంత్రివర్గ విస్తరణ కూడా ముడిపడి ఉన్నందున ఈ రెండింటిపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండానే అగ్రనేతలు సమావేశాన్ని వాయిదా వేశారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని