Congress: కాంగ్రెస్‌లో నూతనోత్సాహం.. ఆ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి

ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు, ఎన్నికల వ్యూహాలను రూపొందించేందుకుగానూ వచ్చే వారం నుంచే కాంగ్రెస్‌ కార్యాచరణ ప్రారంభించనుంది.

Published : 18 Jun 2024 23:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించిన కాంగ్రెస్‌ (Congress).. ఈ ఏడాది జరగనున్న ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే జోష్‌ కొనసాగించాలని చూస్తోంది. ఈ క్రమంలోనే ఝార్ఖండ్‌, మహారాష్ట్ర, హరియాణా, జమ్మూ-కశ్మీర్‌లలో హస్తం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు, ఎన్నికల వ్యూహాలను రూపొందించేందుకుగాను వచ్చే వారం నుంచే స్థానిక నేతలతో సంప్రదింపులు ప్రారంభించనుంది.

పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌ గాంధీల ఆధ్వర్యంలో ఈ నెల 24న ఝార్ఖండ్‌ నేతలతో భేటీ మొదలు ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు. 25న మహారాష్ట్ర, 26న హరియాణా, 27న జమ్మూ-కశ్మీర్‌ నేతలతో అసెంబ్లీ ఎన్నికల వ్యూహ, ప్రతివ్యూహాలపై వారు కసరత్తు జరుపుతారని తెలిపారు. ప్రస్తుతం తమకు అనుకూలంగా ఉన్న రాజకీయ పరిస్థితులను మరింత అధ్యయనం చేస్తూ .. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలనే అంకితభావంతో ఉన్నామని తెలిపారు.

మహారాష్ట్ర అసెంబ్లీ పదవీకాలం నవంబర్ 26తో, హరియాణా.. నవంబర్ 3, ఝార్ఖండ్‌.. వచ్చే ఏడాది జనవరి 5తో ముగియనుంది. ఈ నేపథ్యంలో మూడు రాష్ట్రాల్లో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు.. జమ్మూ-కశ్మీర్‌లో సెప్టెంబర్‌ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మరోవైపు.. ఎన్నికల సన్నద్ధతకుగానూ ఈ రాష్ట్రాలకు భాజపా ఇప్పటికే తన ఇన్‌ఛార్జులను నియమించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని