Jeevan Reddy: జీవన్‌రెడ్డికి బుజ్జగింపు

జగిత్యాల భారాస ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకోవాలన్న నిర్ణయంపై అసంతృప్తితో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమైన జీవన్‌రెడ్డిని అధిష్ఠానం బుజ్జగించింది.

Published : 27 Jun 2024 06:38 IST

చేరికలు పార్టీకి అవసరమన్న కేసీ వేణుగోపాల్‌
సీనియర్లకు ప్రాధాన్యమిస్తామని భరోసా
ఆయన హామీతో సంతృప్తి చెందానన్న ఎమ్మెల్సీ

కేసీ వేణుగోపాల్‌తో భేటీ అనంతరం విలేకర్లతో మాట్లాడుతున్న జీవన్‌రెడ్డి 

ఈనాడు, దిల్లీ: జగిత్యాల భారాస ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకోవాలన్న నిర్ణయంపై అసంతృప్తితో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమైన జీవన్‌రెడ్డిని అధిష్ఠానం బుజ్జగించింది. పార్టీ పెద్దల పిలుపు మేరకు బుధవారం దిల్లీ చేరుకున్న ఆయన.. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ, మంత్రి శ్రీధర్‌బాబులతో కలిసి పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డికి వేణుగోపాల్‌ సర్దిచెప్పారు. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా చేరికలు అవసరమని, అయినప్పటికీ సీనియర్లకు ప్రాధాన్యం ఉంటుందని భరోసా ఇచ్చినట్లు తెలిసింది. మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా తీసుకుంటున్న నిర్ణయాలను అందరూ ఆమోదించాలని కోరినట్లు సమాచారం. 

కార్యకర్తల మనోభావాలను గౌరవించాలి

ఈ సమావేశానంతరం వేణుగోపాల్‌ ఇంటి వద్ద జీవన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ‘‘వాస్తవంగా జరిగిన పరిణామాల వల్ల స్థానికంగా మనస్తాపానికి గురైన మాట వాస్తవం. పార్టీ కార్యకర్తల ప్రయోజనాలు, వారి మనోభావాలను గౌరవించడం పార్టీ ప్రధాన బాధ్యత అని పెద్దలకు చెప్పాను. అందుకు వారు సానుకూలంగా స్పందించారు. ఇంతకాలం పార్టీని నిలబెట్టిన కార్యకర్తల మనోభావాలను పరిగణనలోకి తీసుకుంటామని, భవిష్యత్తులో వారి అభిప్రాయాలను తెలుసుకున్నాకే నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. కేసీ వేణుగోపాల్, దీపా దాస్‌మున్షీ, శ్రీధర్‌బాబులు జిల్లాలో కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ఈ భేటీ ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నా. అందరికీ కావాల్సింది పార్టీ ఐక్యత, కార్యకర్తల ఆత్మగౌరవమే. ఇంతవరకూ పార్టీ బలోపేతానికి చేసిన కృషిని తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటామని, ఎట్టిపరిస్థితుల్లోనూ క్యాడర్‌కు ప్రాధాన్యమిస్తామని వేణుగోపాల్‌ చెప్పారు. ఆ మాటలు విన్న తర్వాత కొంత సంతృప్తి చెందాం’’ అని జీవన్‌రెడ్డి వివరించారు. అందరూ కలిసిమెలిసి పనిచేయాలని అధిష్ఠానం సూచించినట్లు ఆయన పేర్కొన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తున్నారా అని విలేకరులు ప్రశ్నించగా.. ‘లెటజ్‌ సీ’ (చూద్దాం) అని జీవన్‌రెడ్డి అన్నారు.


తలుపులు తెరిచే ఉంటాయి: దీపా దాస్‌మున్షీ

దీపా దాస్‌మున్షీ మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్‌ పెద్ద పార్టీ. చేరికలకు తలుపులు అందరికీ తెరిచే ఉంటాయి. ఏ ఎమ్మెల్యే అయినా కాంగ్రెస్‌ ప్రభుత్వంపై భరోసాతో చేరడానికి వస్తే స్వాగతిస్తాం. అదే సమయంలో మా పార్టీ నేతల మనోభావాలను విస్మరించం. అందరినీ కలుపుకొని ముందుకెళ్తాం. పార్టీలో ఇప్పటికే పలువురు చేరారు. మున్ముందు కూడా చాలా మంది చేరనున్నారు. తెలంగాణ ప్రభుత్వం బలంగా నడుస్తోంది’’ అన్నారు. నామినేటెడ్‌ పోస్టుల భర్తీ, మంత్రివర్గ విస్తరణ గురించి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. అన్నీ ఒకేరోజు సాధ్యమవుతాయా? అని ప్రశ్నించారు. సినిమా ఇంకా ముందుందన్నారు. అవన్నీ త్వరలో పూర్తవుతాయన్నారు. పీసీసీ అధ్యక్ష పదవీకాలం ముగుస్తోందన్న విషయం ప్రస్తావించగా.. ఆ పదవికి గడువేమీ ఉండదని అన్నారు. భారాస ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై ఆ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలను మంత్రి శ్రీధర్‌బాబు ఎద్దేవా చేశారు. వారు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ను అంతం చేయడానికి చేసిన ప్రయత్నాలను అందరూ చూశారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను భారాసలో చేర్చుకున్నప్పుడు ఫిరాయింపులు గుర్తుకురాలేదా?’’ అని నిలదీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు