Congress party: విరామం ఇస్తూ.. ఒక్కొక్కరిని చేర్చుకుంటూ..

వచ్చే నెలలో ఇతర పార్టీల నుంచి మరికొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ గూటికి చేరనున్నారు. కొంత కొంత విరామం ఇస్తూ ఒక్కో ఎమ్మెల్యేను చేర్చుకునే విధానాన్ని పార్టీ అనుసరిస్తోంది. తాజాగా శుక్రవారం భారాసకి చెందిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య దిల్లీలో కాంగ్రెస్‌లో చేరారు.

Published : 29 Jun 2024 03:52 IST

చేరికలపై కాంగ్రెస్‌ అనుసరిస్తున్న విధానమిది
జులైలో మరికొందరు ఎమ్మెల్యేలు అధికార పార్టీ గూటికి
వచ్చేవారిని అడ్డుకోవద్దని సీనియర్లకు అధిష్ఠానం స్పష్టీకరణ

ఈనాడు, హైదరాబాద్‌: వచ్చే నెలలో ఇతర పార్టీల నుంచి మరికొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ గూటికి చేరనున్నారు. కొంత కొంత విరామం ఇస్తూ ఒక్కో ఎమ్మెల్యేను చేర్చుకునే విధానాన్ని పార్టీ అనుసరిస్తోంది. తాజాగా శుక్రవారం భారాసకి చెందిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య దిల్లీలో కాంగ్రెస్‌లో చేరారు. కొద్దిరోజుల క్రితం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ చేరిక తరవాత అదే నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జీవన్‌రెడ్డి అసంతృప్తితో పార్టీలో కొంత అలజడి ఏర్పడింది. దాంతో మున్ముందు చేరికల వ్యవహారంపై అధిష్ఠానం ఎలా వ్యవహరిస్తుందా అని నేతలు ఆలోచనలో పడ్డారు. ఈ పరిస్థితుల్లో... ఇతర పార్టీల నుంచి ఎవరు వచ్చి చేరినా అడ్డుకోవద్దని సీనియర్లకు అధిష్ఠానం గట్టిగా సూచించినట్లు తెలుస్తోంది. వారి రాక వల్ల కాంగ్రెస్‌లో ఎప్పటి నుంచో పనిచేస్తున్న సీనియర్‌ నేతల గౌరవానికి ఎలాంటి భంగం కలగదని, అందరినీ కలుపుకొని పార్టీ పనిచేస్తుందని దిల్లీలో అగ్రనేతలు స్పష్టం చేశారు. కొందరు సీనియర్‌ నేతలను పార్టీ కీలక పదవుల్లో నియమించే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పినట్లు సమాచారం. కొందరు నేతలు తమను ఇతర రాష్ట్రాలకు ఇంఛార్జులుగా నియమించాలని సైతం అడుగుతున్నారు.

ఓడిన చోట బలోపేతంపై దృష్టి...

అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో వెనుకబడిన చోట పార్టీని పటిష్ఠం చేయడంపై దృష్టి పెట్టాలని రాష్ట్ర నాయకత్వానికి కాంగ్రెస్‌ సూచించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి అధిక ప్రాధాన్యమిస్తోంది. కొద్దిరోజుల్లో కనీసం పది మంది ఎమ్మెల్యేలు వరసగా కాంగ్రెస్‌లోకి రానున్నారని పార్టీ వర్గాలు గట్టిగా చెపుతున్నాయి. అసెంబ్లీలో కాంగ్రెస్‌ బలం 80 దాటిపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని సీనియర్‌ నేత ఒకరు స్పష్టం చేశారు.

భాజపాను అడ్డుకోవాలి....

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకారం చూస్తే భాజపా కేవలం ఒకట్రెండు లోక్‌సభ సీట్లలోనే నెగ్గాలి కానీ ఏకంగా 8 లోక్‌సభ నియోజకవర్గాల్లో గెలిచినందున పార్టీ బలోపేతంపై కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రత్యేక దృష్టి పెట్టింది. భారాస నుంచి ఎమ్మెల్యేలు లేదా ఇతర నేతలు కాంగ్రెస్‌లోకి రావడానికి ఆసక్తి చూపితే రావొద్దని అడ్డుకుంటే అది పరోక్షంగా భాజపాకు మేలు చేసినట్లవుతుందని సీనియర్లను అధిష్ఠానం గట్టిగా హెచ్చరించినట్లు తెలుస్తోంది. ‘‘భారాస నేతలను కాంగ్రెస్‌ రావొద్దంటే భాజపాలోకి వెళతారు. అప్పుడు మీరు పార్టీకి మేలు చేసినట్టా లేదా దెబ్బతీస్తున్నట్టా’’ అని రాష్ట్ర నేతలను అధిష్ఠానం ప్రశ్నించినట్లు సమాచారం. గ్రేటర్‌ హైదరాబాద్‌లో పార్టీ.. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పూర్తిగా ఓడినందున ఇక్కడ బలోపేతానికి సంబంధించిన ఏ ఒక్క అంశాన్నీ నిర్లక్ష్యం చేయవద్దని కాంగ్రెస్‌ నిర్ణయించింది. మున్ముందు జరగబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ఈ చర్యలు ఉపకరిస్తాయని భావిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని