Congress Party: వచ్చే వారంలో కొలిక్కి!.. మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్‌ అధిష్ఠానం కసరత్తు

మంత్రివర్గ విస్తరణ, పీసీసీ నూతన అధ్యక్షుడి ఎంపికపై దిల్లీలో కాంగ్రెస్‌ అధిష్ఠానం కసరత్తు చేస్తుండగా వచ్చే వారంలో తుది నిర్ణయానికి రావొచ్చని తెలుస్తోంది.

Updated : 29 Jun 2024 08:38 IST

ఈనాడు, హైదరాబాద్‌: మంత్రివర్గ విస్తరణ, పీసీసీ నూతన అధ్యక్షుడి ఎంపికపై దిల్లీలో కాంగ్రెస్‌ అధిష్ఠానం కసరత్తు చేస్తుండగా వచ్చే వారంలో తుది నిర్ణయానికి రావొచ్చని తెలుస్తోంది. డిప్యూటీ స్పీకర్, చీఫ్‌ విప్‌ విషయంలో కూడా నిర్ణయం తీసుకోవచ్చని పార్టీ వర్గాల సమాచారం. గురువారం రాత్రి పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ వద్ద జరిగిన సమావేశంలో మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడు, డిప్యూటీ స్పీకర్, చీఫ్‌ విప్‌ల ఎంపిక, కార్పొరేషన్‌ ఛైర్మన్ల నియామకం, ఇతర పార్టీల నుంచి వచ్చే ఎమ్మెల్యేలను చేర్చుకోవడం... ఇలా అన్ని అంశాల గురించి కూలంకషంగా చర్చించినట్లు తెలిసింది. శుక్రవారం రాహుల్‌గాంధీని కలిసేందుకు నేతలు సమయం కోరినా, పార్లమెంటు సమావేశాల దృష్ట్యా సోమవారం వరకు వీలు కాకపోవచ్చని సమాచారం అందినట్లు తెలిసింది.

సుదీర్ఘ చర్చ... కుదరని ఏకాభిప్రాయం!

కేసీ వేణుగోపాల్‌ వద్ద జరిగిన సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ, సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నట్లు సమాచారం. ఈ సమావేశంలో రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి గురించి సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలలో ఎవరికి ఇవ్వాలనేదానిపై ఎక్కువగా చర్చ జరిగినట్లు సమాచారం. బీసీల్లో మహేశ్‌కుమార్‌గౌడ్, మధుయాస్కీ, సురేశ్‌ షెట్కార్, ఎస్టీల్లో బలరాం నాయక్, ఎస్సీల్లో సంపత్‌కుమార్‌తోపాటు కొత్తగా విప్‌ లక్ష్మణ్‌కుమార్‌ పేరు కూడా తెరపైకి వచ్చినట్లు సమాచారం. కర్ణాటకలో ఉప ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడిగా ఒకరే ఉన్నందున, తెలంగాణలోనూ ఇదే తరహాలో ఉండాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరుతున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే కేసీ వేణుగోపాల్‌ వద్ద జరిగిన సమావేశంలో భట్టి అంశాన్ని ఎవరూ మాట్లాడలేదని సమాచారం. కేంద్ర మాజీ మంత్రి, సీనియర్‌ అయినందున ఎంపీ బలరాంనాయక్‌కు పీసీసీ అధ్యక్షపదవి ఇవ్వాలనే అభిప్రాయం బలంగా ముందుకు వచ్చినట్లు తెలిసింది. బలరాంనాయక్‌కు పీసీసీ అధ్యక్షపదవి రాకపోతే డోర్నకల్‌ ఎమ్మెల్యే రామచంద్రునాయక్‌ పేరును డిప్యూటీ స్పీకర్‌గా పరిశీలించనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఎస్సీల్లో మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ ఆశిస్తున్నా, ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడిద్దరూ ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన వారే అవుతారు. ఈ కారణంగా విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ పేరు ముందుకొచ్చినట్లు సమాచారం. సమావేశంలో పాల్గొన్న నాయకులతో పాటు ఇతర ముఖ్యనాయకుల అభిప్రాయాలను కూడా అధిష్ఠానం పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలిసింది. దీంతో పీసీసీపై తుది నిర్ణయం కొన్ని రోజులు వాయిదాపడే అవకాశం ఉన్నట్లు సమాచారం. పీసీసీ అధ్యక్షుని విషయంలో ముఖ్యనాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని తెలిసింది.

నాలుగో పేరుపైనే చర్చంతా!

మంత్రివర్గ విస్తరణలో ముగ్గురి పేర్లు దాదాపు ఖరారైనట్లేనని, నాలుగో పేరుపైనే చర్చ ఎక్కువగా ఉందని కాంగ్రెస్‌ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరేటప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకొంటామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయనతోపాటు జి.వివేక్‌కు కూడా హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వారిద్దరితో పాటు ముదిరాజ్‌ సామాజిక వర్గం నుంచి మక్తల్‌ ఎమ్మెల్యే శ్రీహరిని మంత్రివర్గంలోకి తీసుకొంటామని ముఖ్యమంత్రి బహిరంగంగానే ప్రకటించారు. ఈ ముగ్గురికి మంత్రివర్గ విస్తరణలో కచ్చితంగా అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. నాలుగోపేరుపైనే చర్చంతా నడుస్తోంది. నిజామాబాద్‌ జిల్లా నుంచి బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డికి చోటు దక్కవచ్చని తెలుస్తోంది. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి తదితరులు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని