CM Revanth Reddy: ప్రభుత్వాన్ని పడగొడతామంటుంటే ఊరుకోవాలా?

రాజకీయ ఫిరాయింపుల గురించి కేసీఆర్‌ మాట్లాడుతున్న తీరు వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్లుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

Updated : 28 Jun 2024 07:14 IST

భాజపా, భారాసలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూటి ప్రశ్న
పీసీసీకి కొత్త అధ్యక్షుడిని నియమించాలని అధిష్ఠానాన్ని కోరా 
జగదీశ్‌రెడ్డి సవాల్‌తోనే విద్యుత్తుపై కమిషన్‌ ఏర్పాటు చేశాం 
ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి గౌరవానికి భంగం కలిగించబోం 
మంత్రివర్గ విస్తరణపై ఎప్పుడూ చర్చ జరగలేదని సీఎం స్పష్టీకరణ 

దిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

ఈనాడు, దిల్లీ: రాజకీయ ఫిరాయింపుల గురించి కేసీఆర్‌ మాట్లాడుతున్న తీరు వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్లుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఫిరాయింపులకు పునాది వేసిందే ఆయన అని దుయ్యబట్టారు. ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తీసుకున్న విషయాన్ని మరచిపోయారా... అని ప్రశ్నించారు. ఆ తప్పును ఒప్పుకొంటూ కేసీఆర్‌ తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం పడిపోతుందని, వంద రోజులైనా మనుగడ సాగించదని కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌లు ప్రకటించారని, దానికి భాజపా వంతపాడిందని గుర్తుచేశారు. 65 సీట్లతో అధికారంలోకి వచ్చిన, మెజారిటీ ప్రభుత్వాన్ని పడగొడతామని భారాస, భాజపాలు రోడ్లమీదికొస్తే చూస్తూ ఊరుకోవాలా... అని ప్రశ్నించారు. నాలుగు రోజులుగా దిల్లీ పర్యటనలో ఉన్న ఆయన గురువారం మధ్యాహ్నం ఇక్కడి 23 తుగ్లక్‌రోడ్డులోని తన అధికార నివాసంలో మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ కాంగ్రెస్‌లో చేరడాన్ని జీవన్‌రెడ్డి వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో... పార్టీ పెద్దలు ఆయన్ని పిలిపించి సర్దిచెప్పారు. తర్వాత రేవంత్‌రెడ్డితోనూ భేటీ అయ్యారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్రంలో మంత్రిత్వ శాఖల ఖాళీలు, పీసీసీ అధ్యక్షుడి నియామకం, విద్యుత్తు కొనుగోళ్లపై జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ ఏర్పాటుకు దారితీసిన పరిణామాలపై సీఎం తన అభిప్రాయాలను వెల్లడించారు.  

దిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశమైన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, కాంగ్రెస్‌ రాష్ట్ర ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ, మంత్రి శ్రీధర్‌బాబు, విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌ 

మోదీ ముందు మోకరిల్లడమే ఆయన వ్యూహమేమో? 

‘‘కేసీఆర్‌ వద్ద ఏం వ్యూహాలున్నాయో నాకు తెలియదు. మోదీ ముందు మోకరిల్లి... మా ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచనలే ఆయన వ్యూహంగా కనిపిస్తోంది. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి, రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు రాని నాయకుడాయన. రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో మాట్లాడటానికి ప్రతిపక్ష నాయకుడికి మైకు ఇవ్వాలని అడిగారు. అలాంటి సంప్రదాయం దేశంలో ఎక్కడైనా ఉందా? ఆయన అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలకు ప్రతిపక్షాలను ఏనాడూ పిలవనేలేదు. కానీ, మేం పదేళ్లు సీఎంగా పనిచేసినందుకు గౌరవిస్తూ అధికారికంగా ఆహ్వానం పంపినా రాలేదు. ఉద్యమ సోయి ఉండుంటే హుందాగా వచ్చి సంబరాల్లో పాల్గొని ఉండేవారు. నేను పీసీసీ అధ్యక్షుడినై మూడేళ్లు పూర్తికావొస్తోంది. అందుకే సామాజిక న్యాయాన్ని అనుసరించి సమర్థుడైన వ్యక్తిని కొత్త అధ్యక్షుడిగా నియమించాలని మా అధ్యక్షుడు మల్లికార్జునఖర్గేని, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కోరా. 

వాళ్లు తమనుతాము నిరూపించుకోవాలి... 

విద్యుత్తుపై విచారణ కమిషన్‌ను మేం ప్రతిపాదించలేదు. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ విద్యుత్తు కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి నిర్మాణాలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణకు ఆదేశించాలని సవాల్‌ విసిరారు. దాంతో మేం సిట్టింగ్‌ జడ్జిని కేటాయించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరితే... ఆ పరిస్థితి లేదని, రిటైర్డ్‌ జడ్జిలతో కమిషన్‌ వేసుకోవచ్చని సూచించారు. అందుకే జస్టిస్‌ నరసింహారెడ్డి నేతృత్వంలో కమిషన్‌ వేశాం. కమిషన్‌ ఏర్పాటైన మూడు నెలల వరకు వారేమీ మాట్లాడలేదు. కేసీఆర్‌కు లేఖ రాసి వ్యక్తిగత వివరణ ఇవ్వాలని కమిషన్‌ ఛైర్మన్‌ కోరిన తర్వాతే... ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. అసలు వాళ్లు విచారణ కమిషన్‌ వేయడాన్ని తప్పుపడుతున్నారా? కమిషన్‌ ముందు హాజరై వివరణ ఇవ్వాలని కేసీఆర్‌ను కోరడాన్ని తప్పుబడుతున్నారా? జస్టిస్‌ నరసింహారెడ్డి నేతృత్వం వహిస్తుండటాన్ని తప్పుబడుతున్నారా? అన్న ప్రశ్నలకు వారు సమాధానం చెప్పాలి.  వారికిప్పుడు నిరూపించుకొనే అవకాశమొచ్చింది. కమిషన్‌ ముందుకెళ్లి కేసీఆర్‌ తన అనుభవాన్ని, వాదనా పటిమను ప్రదర్శిస్తే మీడియాలో ప్రత్యక్ష ప్రసారంచేయాలని కోరుతున్నా. అవసరమైతే ప్రభుత్వం తరఫున మేం కమిషన్‌కు విన్నవిస్తాం. 

జీవన్‌రెడ్డి, కార్యకర్తల మనోభావాలను గౌరవిస్తాం 

ఈ ప్రభుత్వం చేస్తున్న రుణమాఫీ, ఆరు గ్యారంటీలను చూసి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ మాకు సహకరించాలని నిర్ణయించుకున్నారు. ఈ పరిణామాల కారణంగా 40 ఏళ్లుగా కాంగ్రెస్, ప్రజలపక్షాన నిలబడి కొట్లాడిన జీవన్‌రెడ్డి కొంత మనస్థాపానికి గురయ్యారు. వారి గౌరవానికి ఏ మాత్రం భంగం కలగకుండా పార్టీ చూసుకుంటుందని కేసీ వేణుగోపాల్, దీపా దాస్‌మున్షీ మాటిచ్చారు. వారి ఆదేశాల మేరకు జీవన్‌రెడ్డి, అక్కడి కార్యకర్తల మనోభావాలను గౌరవించాలని నిర్ణయించాం. రైతురుణమాఫీ, సంక్షేమ కార్యక్రమాలు, బడ్జెట్‌లోని వివరాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి జీవన్‌రెడ్డి అనుభవాలను ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది. 

వారికిచ్చిన వినతులపై ఫలితాలు ఉంటాయి 

దిల్లీలో కేంద్ర మంత్రులను మాలాగా ఇతర రాష్ట్రాల మంత్రులు ఎవరైనా సంప్రదించారా? భాజపా పాలిత సీఎంలైనా వారి సమస్యలపై కేంద్ర మంత్రులను ఇన్నిసార్లు కలిశారా? తెలంగాణకు రావాల్సిన నిధులు, అనుమతుల గురించి ఎక్కినమెట్టు ఎక్కకుండా ప్రతి మంత్రినీ కలిసి అడుగుతున్నాం. రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసి విన్నవించినందుకు రక్షణ భూములు అప్పగించారు. చాలావరకు నిధులను విడుదల చేయించుకున్నాం. 

విభజన సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం 

త్వరలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి విభజన చట్టంలో పేర్కొన్న వాటికి కేంద్రం నుంచి అనుమతుల సాధనకు, నిధులను తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాం. సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్‌తో నిరంతరం చర్చిస్తాం. పక్కరాష్ట్రం అభివృద్ధి చెందితే మేం అసూయపడం. మా రాష్ట్ర అభివృద్ధి కోసం అలసత్వం ప్రదర్శించం. తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. రోజుకు 18 గంటలపాటు పనిచేస్తానన్న నా వ్యాఖ్యలపై విమర్శలు చేసుకొనే వారిని చేసుకోనివ్వండి. నిరంతరం ప్రజల్లోనే ఉండి పనిచేస్తాం’’ అని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు.


కేసీఆర్‌కు కనువిప్పు కలగలేదు

-సీఎం రేవంత్‌రెడ్డి

లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 17 సీట్లలో ఓడిపోయిన తర్వాత కూడా కేసీఆర్‌కు కనువిప్పు కలగలేదు. వారికి ఓట్లేయకపోవడం ప్రజలదే తప్పన్నట్లుగా మాట్లాడుతున్నారు. శాసనసభ ఎన్నికల్లో 37.5% ఓట్లు పొందిన భారాస... పార్లమెంటు ఎన్నికలకల్లా 16 శాతానికి పడిపోయింది. కాంగ్రెస్‌ను ఓడించడానికి భారాస ఓట్లను గంపగుత్తగా భాజపాకు వేయించారు. సిరిసిల్లలో భాజపా తొలిస్థానంలో నిలవడమే అందుకు ఉదాహరణ. సిద్దిపేటలో కాంగ్రెస్‌ను దెబ్బతీయడానికి భాజపా, భారాసలకు సమానంగా ఓట్లు వచ్చేలా చూశారు. మొన్నటివరకు గేట్లోకి కూడా రానీయని ఎమ్మెల్యేలను కేసీఆర్‌ ఇప్పుడు ఇంటికి పిలిపించుకుని ఏం మాట్లాడుతున్నారో తెలియదుకానీ... వాళ్లు ఆయన్ను నమ్ముతారా?   


కేంద్రం నుంచి నిధుల సాధనే ధ్యేయం 

-సీఎం రేవంత్‌రెడ్డి 

కొత్త కేంద్ర ప్రభుత్వం త్వరలో బడ్జెట్‌ ప్రవేశపెడుతోంది. అందుకే మా మంత్రివర్గమంతా దిల్లీకి వచ్చి తెలంగాణకు కావాల్సిన నిధులపై కేంద్ర మంత్రులకు ప్రతిపాదలను సమర్పించాం. సానుకూల స్పందన ఉంటుందని నమ్మకంగా ఉన్నాం. త్వరలోనే ప్రధాని మోదీని, హోంమంత్రి అమిత్‌షాని కలుస్తాం. కేంద్ర, రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగించాలని మా ప్రభుత్వం భావిస్తోంది. ఎన్నికలు వచ్చినప్పుడు కాంగ్రెస్‌ తరఫున ఎలా కొట్లాడాలో అలా కొట్లాడుతాం. 


ఏ శాఖా ఖాళీగా లేదు 

మంత్రివర్గ విస్తరణపై ఇప్పటివరకూ చర్చలేమీ జరగలేదు. రాష్ట్రంలో  మంత్రిత్వ శాఖలేవీ ఖాళీగా లేవు.  విద్యాశాఖకు నేనే ఫుల్‌టైం మంత్రిని. మిగిలిన అన్ని శాఖలకూ మంత్రులున్నారు. మేమేమైనా పరీక్షలు నిర్వహించకుండా వదిలేశామా? ఫలితాలను నిలిపేశామా? ఎక్కడైనా గతంలో జరిగినట్లు లోపాలు జరిగాయా?  మేం 12 మందిమి నిరంతరం కష్టపడి పనిచేస్తున్నాం. ఇక్కడి మంత్రుల శాఖలను ఇతర రాష్ట్రాల శాఖలతో పోల్చిచూసి ఎక్కడ వెనుకబడ్డారో చెప్పండి. రాహుల్‌గాంధీ రైతు రుణమాఫీ చేస్తామని వరంగల్‌లో ప్రకటించారు. అందుకే ఏకకాలంలో రూ.31 వేల కోట్ల రైతు రుణమాఫీ చేయాలని నిర్ణయించాం. అనుభవజ్ఞులైన మంత్రులతో ప్రజలకు అద్భుతమైన పరిపాలన ఇస్తున్నాం. పండగలప్పుడు శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకున్నాం. లోక్‌సభ ఎన్నికల్లో చిన్నచిన్న సంఘటనలు జరగకుండా కట్టుదిట్టం చేశాం. అదే ఏపీలో 40-50 మంది అధికారులను తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది. చివరికి భారాస కూడా మా మీద ఆరోపణలు చేయలేకపోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని