CM Revanth Reddy: హరీశ్‌రావు ట్రాప్‌లో కేసీఆర్‌!

‘‘కేసీఆర్‌... మాజీ మంత్రి హరీశ్‌రావు ట్రాప్‌లో పడ్డారు. అందువల్ల భవిష్యత్తులో భారాస బతకడం, కేసీఆర్‌ రాజకీయంగా నిలదొక్కుకోవడం కష్టం.

Updated : 28 Jun 2024 07:06 IST

భారాస బతకడంకానీ, కేసీఆర్‌ నిలదొక్కుకోవడం కానీ జరగదు
కేసీఆర్‌ విధానాన్ని బట్టే రాష్ట్ర రాజకీయాలు
ఇప్పుడు మా ప్రభుత్వాన్ని కాపాడుకోవడం ముఖ్యం
మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఈనాడు, దిల్లీ: ‘‘కేసీఆర్‌... మాజీ మంత్రి హరీశ్‌రావు ట్రాప్‌లో పడ్డారు. అందువల్ల భవిష్యత్తులో భారాస బతకడం, కేసీఆర్‌ రాజకీయంగా నిలదొక్కుకోవడం కష్టం. కేసీఆర్‌ లేకుంటే తన సొంతలైన్‌ తీసుకోవచ్చని హరీశ్‌ ఎదురుచూస్తున్నారు’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో 2019లో తెదేపాకు 23 సీట్లు వచ్చినా చంద్రబాబునాయుడు కోర్‌ రాజకీయాలను వదలకుండా పోరాడారని, అందుకే మళ్లీ గెలిచారని గుర్తుచేశారు. తెలంగాణలో కేసీఆర్‌ పరిస్థితి అలాలేదని స్పష్టంచేశారు. మన సొంత పగలు తీర్చుకోవడానికి ప్రజలు మనకు అధికారాన్ని ఇవ్వరనే విషయాన్ని జగన్‌మోహన్‌రెడ్డిని చూశాక నేర్చుకోవాలన్నారు. ఆయన గురువారం దిల్లీలోని తన నివాసంలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ అనేక విషయాలపై స్పందించారు.  

ప్రభుత్వాన్ని నిలుపుకోవడమే ముఖ్యం 

‘‘ఎమ్మెల్యేలను చేర్చుకోవడం నెగెటివా? పాజిటివా? అన్నది కాదు. ఇప్పుడు ప్రభుత్వాన్ని కాపాడుకోవడం ముఖ్యం. ఈ ప్రభుత్వమే పోతే వాటిపై మాట్లాడుకోవడంలో అర్థం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో తెదేపా, జనసేన, భాజపాల పొత్తు కారణంగానే హైదరాబాద్‌ చుట్టుపక్కల సెటిలర్ల ఓట్లు భాజపాకు వెళ్లాయి. దానివల్లే మల్కాజిగిరి, చేవెళ్లలో ఆ పార్టీకి ప్రయోజనం కలిగింది. 

నా మార్కు పాలనే లక్ష్యం 

శాసనసభ ఎన్నికలు కేసీఆర్‌ని దించాలా? నన్ను గెలిపించాలా? అన్న అంశంపైనే జరిగాయి. పదేళ్లు ఆయనకు వ్యతిరేకంగా కొట్లాడింది నేనే కావడంతో ప్రజలు ప్రత్యామ్నాయంగా నన్ను ఎంచుకున్నారు. భాజపా నుంచి బండి సంజయ్‌ ఉంటే నా తర్వాత అవకాశం వచ్చేదేమో. పాలనలో నా మార్కు ముద్ర వేయడమే లక్ష్యం. 


కేసీఆర్‌ హేతుబద్ధంగా ప్రవర్తిస్తేనే భారాసకు మనుగడ 

చంద్రబాబునాయుడు ముందు జగన్‌ ఎంత? అయినా, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. వాళ్లు తిట్టే తిట్లు, చేసే కామెంట్లను తట్టుకొని పోరాడారు. కోర్‌ ఏరియాను వదల్లేదు. ఇక్కడ కేసీఆర్‌ ఆ పని చేయడంలేదు. హరీశ్‌రావు ఆ పని చేయించడం లేదు. కేసీఆర్‌ పార్టీని నిలబెట్టుకొనే మూడ్‌లో లేరు. ఆయన ఇప్పుడు హరీశ్‌ ట్రాప్‌లో ఉండటంతో భారాస బతకడంకానీ, కేసీఆర్‌ రాజకీయంగా నిలదొక్కుకోవడం కానీ జరగదు. ఈరోజు భావోద్వేగాలు కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఉన్నాయి. అందువల్ల ఆయన హేతుబద్ధంగా ప్రవర్తిస్తేనే భారాస బతుకుతుంది. పార్టీ బతికితే కేసీఆర్‌ తర్వాత కేటీఆర్, కవిత ఉంటారు. అందుకే భారాస ఫినిష్‌ కావాలని కోరుకుంటున్న వారిలో మొదటి, చివరి వ్యక్తి హరీశ్‌రావే. ఈటల రాజేందర్, నరేంద్ర, విజయశాంతిలను బయటికి గెంటించింది హరీశే. ఎప్పుడూ ఏదో ఒక సంక్షోభాన్ని సృష్టించి దాన్ని తనకు అనుకూలంగా మలచుకుంటారు. అసెంబ్లీకి కేసీఆర్‌ రాకపోతే మాట్లాడేది హరీశే. అందుకే అతను వ్యూహాత్మకంగా ప్రవర్తిస్తున్నారు. కేటీఆర్‌ ఎప్పుడైనా డమ్మీయే.  


మా ప్రధాన ప్రత్యర్థి ఎవరంటే...  

భారాస నేతలు తమ ఓట్లు తామే వేసుకొని ఉంటే మేం 12 సీట్లు గెలిచేవాళ్లం. కాంగ్రెస్‌ను ఓడించడానికి డబ్బులు పంచి మరీ భాజపాకు ఓట్లేయించారు. భారాస డిపాజిట్లు తెచ్చుకున్న సీట్లలో కాంగ్రెస్‌ గెలిచింది. ఆ పార్టీ  డిపాజిట్లు  కోల్పోయిన చోట్ల భాజపా గెలిచింది. రాష్ట్రంలో భాజపాకు పార్టీ నిర్మాణం లేదు. కేసీఆర్‌ భారాసను విలీనం చేస్తే తప్ప ఆ పార్టీకి బలం ఉండదు. స్థానిక సంస్థల్లో భాజపా పరిస్థితి తెలుస్తుంది. మా ప్రధాన  ప్రత్యర్థిగా ఎవరుంటారనేది భాజపా,  కేసీఆర్‌ల పనితీరుపై ఆధారపడి ఉంటుంది. కేసీఆర్‌ విధానాన్ని బట్టే రాష్ట్ర రాజకీయాలు ఉంటాయి. 


జగన్‌ తప్పులు చేయడంతోనే ప్రజలు శిక్షించారు... 

ప్రజలు...అధికారాన్ని మనకు సొంత పగలు తీర్చుకోవడానికి ఇవ్వరని జగన్‌ని చూసి నేర్చుకోవాలి. ఏపీ ప్రజలు 2019లో జగన్‌కు 151 సీట్లను ఎన్నో ఆశలతో ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక జగన్‌ చేసిన పనులు తప్పని నిరూపించడానికే మొన్న ప్రజలు 11 సీట్లు ఇచ్చారు. కేసీఆర్‌ తెలంగాణలో తెదేపాను లేకుండా చేయాలనుకున్నారు. కానీ, ఆయనే తుడిచిపెట్టుకుపోయారు. సమాజంలో కొన్నింటిని బతకనిస్తే అవి సమాజానికో, మనకో పనికొస్తాయి. తెదేపాకు పోటీచేసే పరిస్థితి కల్పించి ఉంటే వాళ్లు 10% ఓట్లు దక్కించుకొనేవారు. అప్పుడు కాంగ్రెస్‌ పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు. 


అలా చేస్తే ఏ పనీ చేయలేను...  

త ప్రభుత్వంపై కేసులన్నీ ఒకేసారి తెరిస్తే ఏఒక్క పనీ పూర్తిచేయలేను. అన్నీ స్తంభిస్తాయి. కేసులతో రాజకీయ ప్రయోజనాలు ఎలా ఉన్నా వ్యవస్థ కుప్పకూలుతుంది. నేను ఏ విచారణకు ఆదేశించినా అందులో ప్రభుత్వ సంస్థలు, కేసీఆర్‌ మాత్రమే ఉండరు. ప్రైవేటు ఇన్‌ఫ్రా కంపెనీలు, ఇతర సంస్థలు ఉంటాయి. ఒకసారి కేసు నమోదైతే బ్యాంకులు వాటికి రూపాయి అప్పు ఇవ్వవు. ఓడీలను వెనక్కు తీసుకుంటాయి. అప్పులు తీర్చాలని ఒత్తిడి తెస్తాయి. అప్పుడు రాష్ట్రంలో పెట్టుబడులకు ఎవరూ ముందుకు రారు. 


చంద్రబాబు కోసం నా ఉద్యోగం వదులుకుంటానా? 

ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టినప్పటికీ మన రాష్ట్ర ప్రయోజనాల విషయంలో నేను రాజీపడను. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌పై ఎంత నిబద్ధతతో పనిచేస్తారో... నేను నా రాష్ట్రంపై అంతే నిబద్ధతతో పనిచేస్తా. చంద్రబాబు చెప్పారని రాష్ట్ర ప్రయోజనాలను విస్మరిస్తే ప్రజలు నన్నెందుకు రాజకీయాల్లో ఉంచుతారు? నా ఉద్యోగం కోసమే ఆయన్ని వదిలి  వచ్చా. ఇప్పుడు చంద్రబాబు కోసం ఆ ఉద్యోగం వదులుకుంటానా? 


ఇప్పుడు జగన్‌ చచ్చిన పాములాంటి వ్యక్తి  

హైదరాబాద్‌లో జగన్‌మోహన్‌రెడ్డి ఇంటి ముందు కూల్చివేతల గురించి నాకెవ్వరూ చెప్పలేదు. దీనిపై ఆరాతీస్తే ఓ నాయకుడు చెప్పడంతోనే అధికారులు ఆ పని చేశారని తెలిసింది. అందుకే వారిని సరెండర్‌ చేశాం. బయట మాత్రం చంద్రబాబు చెబితే నేను చేయించానని ప్రచారం చేశారు. ఇప్పుడు జగన్‌ అనే వ్యక్తి చచ్చిన పాము. అలాంటి వ్యక్తి ఇంటి ముందున్న గదులు కూలగొట్టాలని చెప్పాల్సిన అవసరం చంద్రబాబుకు ఏముంటుంది? కేసీఆర్‌ ఫామ్‌ హౌస్‌ ముందే ఏవేవో కట్టుకున్నారు. అవేం మేం తీయలేదు. నా ప్రధాన ప్రత్యర్థి మీదే నేను ఇలాంటివి చేయనప్పుడు జగన్‌ విషయంలో ఎందుకు చేస్తా? 


సీడబ్ల్యూసీలో ఏకగ్రీవ తీర్మానానికి చొరవ 

లోక్‌సభలో ప్రతిపక్ష నేత పదవి రాహుల్‌గాంధీ తీసుకోవాలని సీడబ్ల్యూసీలో ఏకగ్రీవ తీర్మానం చేయడానికి చొరవ తీసుకున్నా. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య బలపరిచేలా చేశా. రాహుల్‌గాంధీ తనపై ఒత్తిడి చేయొద్దన్నా మేం ఒప్పుకోలేదు. ఆయనకు అద్భుతమైన జ్ఞానముంది. మోదీ రాజకీయ ప్రభ సృష్టించుకున్నారే తప్పితే ఆయనకు లోతైన పరిజ్ఞానం లేదు’ అని రేవంత్‌ పేర్కొన్నారు.


హైదరాబాద్‌కు అమరావతి పోటీ కాదు... 

మరావతి హైదరాబాద్‌కు పోటీ కాదు. హైదరాబాద్‌లోనే ఒకవైపు ఉన్న వారు మరోవైపునకు వెళ్లడానికి ఇష్టపడటంలేదు. అలాంటిది హైదరాబాద్‌ను వదిలి అమరావతిలో పెట్టుబడులు పెడతారనుకోవడంలేదు. అయితే, లాభం లేదంటే సొంతూర్లో కూడా ఎవ్వరూ పెట్టుబడి పెట్టరు. అమరావతిలో లాభం ఉంటే మనం తాడుతో కట్టేసినా ఆగకుండా అక్కడికిపోతారు. ప్రాంతీయ రింగురోడ్డు ద్వారా 50 లక్షల ఎకరాల అభివృద్ధికి తలుపులు తెరిస్తే అమరావతి ఎక్కడుంటుంది. పోర్టులకు గ్రీన్‌ఫీల్డ్‌ హైవేలు వేస్తున్నాం. డ్రైపోర్టులు కడుతున్నందున నేరుగా కంటెయినర్లు ఇక్కడికే వస్తాయి. రాజస్థాన్‌లో మాదిరి డెస్టినేషన్‌ మ్యారేజ్‌ సెంటర్‌గా హైదరాబాద్‌ను మారుస్తాం. రహదారుల నిర్మాణానికి మట్టిని తవ్వుతాం. మట్టి తవ్విన ప్రాంతాలను లేక్‌లుగా అభివృద్ధి చేస్తాం. రీజినల్‌ రింగ్‌రోడ్డు వెంట 24 రేడియల్‌ రోడ్లు నిర్మిస్తాం. దానివల్ల ఏ ప్రాంతానికైనా 30 నిమిషాల్లో చేరుకోవచ్చు. అన్ని జిల్లా ప్రధాన కేంద్రాలకు అవుటర్‌ రింగురోడ్లు వేస్తాం. 2050కల్లా గ్రీన్‌ తెలంగాణ తయారీకి ప్రణాళిక రూపొందిస్తాం. 


రెండు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ 

గ్రేటర్‌ హైదరాబాద్‌ను రెండు కార్పొరేషన్లుగా విభజించి రెండు కమిషనరేట్లు ఏర్పాటు చేస్తాం. హెచ్‌ఎండీఏ సరిహద్దులను ఆర్‌ఆర్‌ఆర్‌ వరకు పెంచుతాం. జీహెచ్‌ఎంసీ హద్దులను ఓఆర్‌ఆర్‌ వరకు విస్తరిస్తాం. పాతనగరంలో 40% విద్యుత్తు బిల్లులు వసూలు కావడంలేదు. ఇక్కడి నుంచి 75% బిల్లు వసూలుచేసే బాధ్యతలను  అదానీ వాళ్లకు అప్పగిస్తున్నాం. అక్కడ అండర్‌గ్రౌండ్‌ విద్యుత్తు లైన్లు వేసి మొత్తం వ్యవస్థను మార్చాలని కోరాం. 

దిల్లీలో తెలంగాణభవన్‌ను మహారాష్ట్ర సదన్‌లా నిర్మిస్తాం. అయిదున్నర ఎకరాల్లో అధికారులు, ఎమ్మెల్యేలకు... మూడున్నర ఎకరాల్లో గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులకు భవనాలను నిర్మిస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని