CM Revanth Reddy: విభజన సమస్యల పరిష్కారం కోసం కేంద్ర హోంశాఖ చొరవ తీసుకోవాలి: సీఎం రేవంత్‌

తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీని కోరామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. 

Updated : 04 Jul 2024 20:25 IST

దిల్లీ: తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీని కోరామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రధాని, హోం మంత్రి అమిత్‌ షాతో భేటీ అనంతరం సీఎం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. ‘‘ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు.. ఆ తర్వాత రాజకీయాలకు అతీతంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు కొనసాగించాలనే ఆలోచనతోనే ప్రధాని, కేంద్రమంత్రులను కలిశాం. వివిధ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న అంశాలపై వినతిపత్రాలు ఇచ్చాం. రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పనిచేయాలన్న ఆలోచనతోనే వారిని కలిశాం. కేంద్రం వైపు నుంచి కూడా సానుకూల స్పందన కనిపించింది. విభజన సమస్యల పరిష్కారం కోసం కేంద్ర హోంశాఖ చొరవ తీసుకోవాలి’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ... ‘‘తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు, విభజన చట్టంలో పొందుపర్చిన హక్కులు.. ఈ రెండు అంశాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలిశాం. గోదావరి పరిసరాల్లోని బొగ్గు గనులను వేలం లేకుండా ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి కాలరీస్‌కు కేటాయించాలని, రాష్ట్రానికి ఐఐఎం ఇవ్వాలని, ఐటీఆర్‌ ప్రాజెక్టును తిరిగి పునరుద్ధరించాలని ప్రధానిని కోరాం. ఏపీలో విలీనమైన 5 గ్రామాలను తెలంగాణలో కలపాలని, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి కృషి చేయాలని, తెలంగాణకు 25 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని, జిల్లాకో నవోదయ స్కూల్ ఏర్పాటు చేయాలని, విభజన చట్టంలో పెండింగ్‌ సమస్యలను పరిష్కరించాలని, రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చాలని విజ్ఞప్తి చేశాం. మా వినతులకు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా సానుకూలంగా స్పందించారు’’ అని భట్టి విక్రమార్క తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని