Chandrababu: నేను అందరివాడిని

ప్రతి ఒక్క కుటుంబం గురించి ఆలోచించి అందరికీ న్యాయం చేయడాన్ని బాధ్యతగా తీసుకుంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. తాను అందరివాడినే తప్ప ఏ ఒక్కరివాణ్నీ కాదని స్పష్టం చేశారు.

Published : 02 Jul 2024 06:55 IST

పేదరికం లేని సమాజమే మా లక్ష్యం
65.31 లక్షల మందికి రూ.4,408 కోట్ల పంపిణీ 
సంక్షేమంలో ఇది తొలి అడుగు మాత్రమే
పెనుమాక ప్రజావేదికలో సీఎం చంద్రబాబు

 ప్రజా వేదికపై మాట్లాడుతున్న సీఎం చంద్రబాబునాయుడు.. పాల్గొన్న మంత్రులు లోకేశ్, కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్‌ నాగలక్ష్మి తదితరులు

ఈనాడు, అమరావతి: ప్రతి ఒక్క కుటుంబం గురించి ఆలోచించి అందరికీ న్యాయం చేయడాన్ని బాధ్యతగా తీసుకుంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. తాను అందరివాడినే తప్ప ఏ ఒక్కరివాణ్నీ కాదని స్పష్టం చేశారు. శాశ్వతంగా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించడానికి పనిచేస్తానని ప్రకటించారు. ఇందుకోసం భగవంతుడు ఇచ్చిన శక్తినంతా ఉపయోగించి, ఊపిరి ఉన్నంత వరకు పోరాడతానని మాట ఇచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పెనుమాక ఎస్టీకాలనీలో సోమవారం ఉదయం ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారులకు చంద్రబాబు పింఛను సొమ్ము అందించారు. అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ‘ప్రజలందరి ఆశీస్సులతో నాలుగోసారి సీఎంగా ప్రమాణం చేశాను. కొత్త ప్రభుత్వంలో మొదటి నెల ఒకటో తేదీనే తొలి కార్యక్రమంగా.. పెంచిన పింఛను పంపిణీకి శ్రీకారం చుట్టడం నా పూర్వజన్మ సుకృతం. పేదరికం లేని సమాజం కోసం పెనుమాకలో ఈ రోజే సంకల్పం చేస్తున్నాను. మేమంతా కష్టపడి సంపద సృష్టించి, ఆదాయం పెంచుతాం. పెంచిన ఆదాయం మళ్లీ పేదవాళ్లకు అప్పజెప్పి, పేదరికం లేని సమాజం చూడాలన్నది మా ఆశయం. ప్రభుత్వం ఏర్పడిన 26 రోజుల్లో పెంచిన పింఛనుతో పాటు బకాయిలు అందజేశాం. ఇది మా చిత్తశుద్ధి. ఇది మొదటి అడుగు మాత్రమే. సంక్షేమం అంటే ఏదో డబ్బులు ఇచ్చేయడం, ఇచ్చామని గొప్పలు చెప్పుకోవడం కాదు. ప్రజల జీవితాల్లో వెలుగు, వెసులుబాటు తీసుకువచ్చి జీవన ప్రమాణాలు పెంచాలి. పేదలు లేని, ఆర్థిక అసమానతలు కానరాని సమాజాన్ని సృష్టిస్తాం’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

పాల్గొన్న గ్రామస్థులు, వృద్ధులు, దివ్యాంగులు, పింఛనుదారులు

వైకాపా పాలన తవ్వేకొద్దీ తప్పులు, అప్పులు

‘పోలవరం పూర్తయితే ప్రతి ఎకరాకు నీరు వచ్చి సంపద సృష్టించేవాళ్లం. అమరావతి పూర్తయితే ఒక్కో కుటుంబం ప్రతి రోజూ కనీసం రూ.1000 సంపాదించుకునే అవకాశం వచ్చేది. అలాంటి అవకాశాన్ని గత ఐదేళ్లలో పూర్తిగా నిర్వీర్యం చేశారు. వైకాపా పాలన తవ్వుతున్నకొద్దీ నాటి తప్పులు, అప్పులే బయటపడుతున్నాయి. ఒక వ్యక్తి సీఎంగా పనికిరాడని ఐదేళ్లు నిరూపించిన ఏకైన వ్యక్తి జగన్‌.’ అని పేర్కొన్నారు

చేస్తామన్నాం.. చేసి చూపించాం

‘ఎన్నికల సమయంలో వాలంటీర్లు వద్దని ఈసీ ఆదేశిస్తే గత ప్రభుత్వ పెద్దలు పింఛను కోసం వృద్ధులను పంచాయతీ కార్యాలయానికి తిప్పి 33 మంది మరణానికి కారకులయ్యారు. 1,20,097 మంది సచివాలయ సిబ్బంది ఒక్కొక్కరు 40-50 మందికి పింఛన్లు ఇస్తే సరిపోతుందని మేం చెప్పినా పట్టించుకోలేదు. పట్టుదలతో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందితో రాష్ట్రంలో ఒకేరోజు అందరికీ పింఛన్లు ఇచ్చేలా కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఆ రోజు చేయలేమని చెప్పిన అధికార యంత్రాంగం చేతే చేసి చూపించాం’ అని పేర్కొన్నారు. 

పింఛనులో రూ.2,840 పెంచిన ఘనత

‘ఎన్టీఆర్‌ తొలిసారిగా పింఛను పంపిణీ ప్రారంభించారు. అప్పట్లో నెలకు రూ.35 ఇచ్చేవారు. 1994-95లో దాన్ని రూ.75కు పెంచాను. 2014లో రూ.200 ఉన్న పింఛను రూ.1000కి, తర్వాత రూ.2 వేలకు పెంచిన ఘనత తెదేపాదే. ఇప్పుడు రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచాం. ప్రస్తుతం ఇస్తున్న పింఛనులో రూ.2840 నేనే పెంచానని చెప్పడానికి గర్వపడుతున్నా. రాష్ట్రంలో మొత్తం 28 రకాల పింఛన్లు 65.31 లక్షల మందికి ఒక్క రోజులో ఇస్తున్నాం. పెరుగుతున్న ధరలకు కళ్లెం వేస్తే పెంచిన పింఛను వల్ల వెసులుబాటు వస్తుంది. వృద్ధులకు నెలకు రూ.4 వేల చొప్పున ఏడాదికి రూ.48 వేలు, దివ్యాంగులకు రూ.6 వేల చొప్పున ఏడాదికి రూ.72 వేలు అందిస్తాం. ఇది మూడెకరాల మాగాణి లేదా ఏడెకరాల మెట్ట పొలానికి వచ్చే కౌలుకు సమానమైన ఆదాయం’ అని చంద్రబాబు చెప్పారు.‘మమ్మల్ని నమ్మి గెలిపించిన ప్రజలకు సేవకులుగానే ఉంటాం. పెత్తందారులుగా ఉండమని హామీ ఇస్తున్నాం’ అని చెప్పారు. 2019 ఎన్నికల్లో మంగళగిరిలో లోకేశ్‌ ఓడినా పట్టువదలకుండా ఇక్కడే కష్టపడి, మీ అందరి అభిమానంతో ఇప్పుడు 92 వేల మెజారిటీతో గెలిచారన్నారు. కార్యక్రమంలో మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, నారా లోకేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 

పరదాలు లేవు.. హడావుడి లేదు

ముఖ్యమంత్రి వస్తున్నారంటే రెండు రోజుల ముందు నుంచి హడావుడి.. దారి పొడవునా పరదాలు.. కిలోమీటర్ల మేర బారికేడ్లు.. సీఎం ప్రయాణించే మార్గాలు, సభ పరిసరాల్లో చెట్ల నరికివేత.. దుకాణాల మూసివేత.. వందల మంది పోలీసుల పహారా.. ట్రాఫిక్‌ మళ్లింపు.. ఇది జగన్‌ పాలనలో నిత్యకృత్యం. ఇందుకు భిన్నంగా సోమవారం పెనుమాకలో సీఎం చంద్రబాబు పర్యటన అత్యంత సాదాసీదాగా కొనసాగింది. ఉదయాన్నే ముఖ్యమంత్రి వీధుల్లో నడుచుకుంటూ అందరినీ పలకరిస్తూ పింఛను లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లారు. స్థానిక మహిళలు ఆయనకు హారతులిచ్చి, స్వాగతం పలికారు. ఎక్కడా పోలీసుల అనవసర హడావుడి లేదు. ముఖ్యమంత్రి స్థాయి ప్రముఖుల సభలకు ఉండే డి-సర్కిల్‌ను సైతం ఎత్తివేసి, పెనుమాకలో సాదాసీదాగా వేదిక ఏర్పాటు చేశారు. వేదికపై ప్రత్యేక కుర్చీలు లేకుండా స్థానికులతో కలిసి చంద్రబాబు కూర్చున్నారు. ప్రసంగం తర్వాత ప్రజలు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని