Chandrababu: కనీసం తాగునీటి పరీక్షలూ జరగలేదు

గత వైకాపా ప్రభుత్వ విధ్వంస పాలన వల్ల ప్రజలు బలవుతున్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అందుకే రాష్ట్రంలో సీజనల్‌ వ్యాధులు పెరుగుతున్నాయని తెలిపారు.

Published : 04 Jul 2024 05:44 IST

వైకాపా పాలనలో వ్యవస్థల నిర్వీర్యం
2014-19 నాటి ఉత్తమ విధానాలు  అవలంబించాలి
నీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలి
సీజనల్‌ వ్యాధులు పెరగకుండా చూడాలి: సీఎం చంద్రబాబు

ఈనాడు, అమరావతి: గత వైకాపా ప్రభుత్వ విధ్వంస పాలన వల్ల ప్రజలు బలవుతున్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అందుకే రాష్ట్రంలో సీజనల్‌ వ్యాధులు పెరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో బుధవారం సీజనల్‌ వ్యాధుల నియంత్రణ చర్యలపై వైద్య, పంచాయతీ, మున్సిపల్‌ శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. కనీసం తాగునీటి పరీక్షలూ ఎందుకు చేయలేకపోయారని అధికారులను నిలదీశారు. ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే.. పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయన్నారు. మలేరియా కేసులు ఎందుకు పెరుగుతున్నాయని ప్రశ్నించారు. తమ హయాంలో గిరిజన ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా మందు స్ప్రే చేసేవారిమని, గ్రామాల్లో వాటర్‌ట్యాంకుల క్లీనింగ్, క్లోరినేషన్‌ పనులు పక్కాగా జరిగేవని తెలిపారు. ఆయా శాఖల్లో 2014-19 మధ్య అనుసరించిన ఉత్తమ విధానాలను మళ్లీ అమలుచేయాలని అధికారులను ఆదేశించారు.

రూ.14 లక్షలు చెల్లించక పరీక్షలు నిలిచాయి: మంత్రి నారాయణ

వైకాపా హయాంలో నీటినిర్ధారణ పరీక్షలకు అవసరమైన ల్యాబ్‌ నిర్వహణకు రూ.14 లక్షలు చెల్లించకపోవడంతో పనులు నిలిచాయని పురపాలకశాఖ మంత్రి నారాయణ చెప్పారు. ప్రస్తుతం చెల్లింపులు చేసి, ల్యాబ్‌లో పరీక్షలు చేయిస్తున్నామన్నారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ మాట్లాడుతూ.. సీజనల్‌ వ్యాధుల నియంత్రణకు శాఖాపరంగా అవసరమైన చర్యలు చేపట్టామని, వైద్యసిబ్బందిని అప్రమత్తం చేశామని తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి కృష్ణబాబు మాట్లాడుతూ మలేరియా, డెంగ్యూ కేసుల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. హైరిస్క్‌ కేసులపై ప్రత్యేకదృష్టి పెట్టామని తెలిపారు. ప్రస్తుతం 6 గ్రామాల్లో 35 డయేరియా కేసులు ఉన్నాయని అన్నారు. ఈ సీజన్‌లో కలుషిత నీటి వల్ల 9 మంది డయేరియాతో చనిపోయారని వివరించారు. 

వైద్య సీట్ల భర్తీపై.. 

కొత్త వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌ ప్రవేశాలకు ఎన్‌ఎంసీ నుంచి అనుమతులు పొందడం, వైద్యసీట్ల భర్తీలో స్థానిక, స్థానికేతర కోటాలో చేయాల్సిన మార్పుల గురించి ఈ సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ సిద్ధమయ్యారు. అయితే.. మంగళవారం లేదా బుధవారం లోగా సమావేశమవుదామని సీఎం చంద్రబాబు మంత్రికి తెలిపారు. ఢిల్లీ పర్యటన సమయంలో వీటిగురించి అధికారులతోనూ చర్చిస్తానని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని