Chandrababu: డెవిల్‌ను నియంత్రించాం.. ఇకపై ఎవరికీ ఇబ్బంది ఉండదు: చంద్రబాబు

ఐదేళ్ల పాటు రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. 

Updated : 05 Jul 2024 17:26 IST

దిల్లీ: ఐదేళ్ల పాటు రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రెండ్రోజుల దిల్లీ పర్యటన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఐదేళ్ల జగన్‌ పాలనతో సరిదిద్దలేనంత నష్టం జరిగిందన్నారు. ‘‘దక్షిణాదిలో ఏ రాష్ట్రానికీ లేని గొప్ప వనరులు ఏపీకి ఉన్నాయి. నదుల అనుసంధానంతో అద్భుతాలు సాధించవచ్చు. గోదావరి నుంచే మొత్తం దక్షిణాది రాష్ట్రాలకు నీరు ఇవ్వొచ్చు. కేంద్రం నుంచి ఎలాంటి పదవులూ ఆశించలేదు. వాజ్‌పేయీ ప్రభుత్వంలోనూ పదవులు ఆశించలేదు. ఏడు మంత్రి పదవులు తీసుకోవాలని వాజ్‌పేయీ కోరినా అంగీకరించలేదు. ఎన్డీయే ఉన్నందున అప్పుడు స్పీకర్‌ పదవి తీసుకున్నాం. ఇప్పుడు కూడా ఎన్డీయే ఇచ్చిన రెండు మంత్రి పదవులతో సంతోషంగానే ఉన్నాం. 

జగన్‌ పాలనతో అమరావతిపై జనాకర్షణ కొంత తగ్గింది. రాజధానికి పూర్వ వైభవం తేవడమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. అక్కడ 135 ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటుకానున్నాయి. రాజధానికి అవసరమైన మౌలిక వసతులన్నీ కల్పిస్తున్నాం. అమరావతిలో ఐకానిక్‌ బిల్డింగ్‌ సహా అన్నీ పూర్తి చేస్తాం. తొలుత నిర్మాణంలో ఉన్నవాటికి ప్రాధాన్యత ఇస్తాం. రాష్ట్రంలో కులగణన స్థానంలో నైపుణ్య గణన చేస్తాం. నైపుణ్య గణనకు త్వరలో మార్గదర్శకాలు విడుదల చేస్తాం. మానవ వనరులే పెట్టుబడిగా సంపద సృష్టిస్తాం. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలతో ఉపాధి కల్పిస్తాం. పీపీపీ నమూనా స్థానంలో పీ-4 విధానం తెస్తాం. దావోస్‌ పెట్టుబడుల సదస్సుకు తప్పకుండా హాజరవుతా. మళ్లీ జగన్‌ వస్తే ఎలా అని అన్ని వర్గాలూ అడుగుతున్నాయి. డెవిల్‌ను నియంత్రించాం.. ఇకపై ఎవరీ ఇబ్బంది ఉండదు’’ అని చంద్రబాబు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని