PM Modi: రాహుల్‌ది పిల్లచేష్ట

లోక్‌సభ విపక్ష నేత రాహుల్‌గాంధీది పిల్లచేష్ట (బాలక్‌ బుద్ధి) అని ప్రధాని నరేంద్రమోదీ ఎద్దేవా చేశారు. వరసగా మూడు లోక్‌సభ ఎన్నికల్లో వంద సీట్లను దాటకపోవడం కాంగ్రెస్‌కు ఇదే తొలిసారి అని చెప్పారు.

Published : 03 Jul 2024 04:44 IST

సానుభూతి కోసం కొత్త నాటకాలు
అంబేడ్కర్‌నే ఓడించిన చరిత్ర కాంగ్రెస్‌ది 
రాజ్యాంగం గురించి ఆ పార్టీవారా మాట్లాడేది? 
హిందువులు హింసావాదులని అనడం సంస్కారమా?
లోక్‌సభలో తూర్పారబట్టిన ప్రధాని మోదీ

ఈనాడు, దిల్లీ: లోక్‌సభ విపక్ష నేత రాహుల్‌గాంధీది పిల్లచేష్ట (బాలక్‌ బుద్ధి) అని ప్రధాని నరేంద్రమోదీ ఎద్దేవా చేశారు. వరసగా మూడు లోక్‌సభ ఎన్నికల్లో వంద సీట్లను దాటకపోవడం కాంగ్రెస్‌కు ఇదే తొలిసారి అని చెప్పారు. కేవలం సానుభూతి పొందడం కోసం సభలో కాంగ్రెస్‌ కొత్త నాటకాలు ఆడుతోందని విరుచుకుపడ్డారు. పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రెండ్రోజులు కొనసాగిన చర్చకు మంగళవారం సాయంత్రం లోక్‌సభలో ఆయన సమాధానమిచ్చారు. విపక్షాల నిరసనల మధ్య ఆయన ప్రసంగం 135 నిమిషాలు కొనసాగింది. ‘‘దేశంలో ఆర్థిక అరాచకత్వం సృష్టించాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. ఓటమిని అంగీకరించకుండా అహంకారంతో ప్రవర్తిస్తోంది. వంద సీట్లు కూడా తెచ్చుకోకపోయినా వారే మామీద గెలిచేసినట్లు చూపించుకోవాలని అనుకుంటోంది. ఓబీసీలను దొంగలుగా సంబోధించినందుకు వారికి శిక్ష పడింది. దేశ అత్యున్నత న్యాయస్థానంపై బాధ్యతారాహిత్య వ్యాఖ్యలకు వారు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. కనీస మద్దతు ధరలు, అగ్నిపథ్‌లపై పార్లమెంటును తప్పుదోవ పట్టించాలని చూశారు. సందర్భానికి తగ్గట్లు స్వరం మార్చే అలాంటి నేత (రాహుల్‌ గాంధీని ఉద్దేశించి) ఇలాంటి అరాచకమైన మార్గాన్ని ఎంచుకోవడం.. దేశాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేయడమే’’ అని మోదీ చెప్పారు. 

స్పీకర్‌ అన్నింటినీ చిరునవ్వుతో భరిస్తారు 

‘‘స్పీకర్‌ జీ! మీరు అన్నింటినీ చిరునవ్వుతో భరిస్తున్నారు. కానీ సోమవారం ఇక్కడ జరిగిన దానిపై ఏదోఒకటి చేయకపోతే పార్లమెంటుకు మంచిదికాదు. ఇలాంటి ప్రయత్నాలను పిల్లచేష్టలుగా వదిలేయకూడదు. దానివెనుక లోతైన కుట్ర ఉంది. ప్రజల తీర్పును విపక్షాలు నిజాయతీగా అర్థంచేసుకోవాలి. కల్పిత విజయాలతో సంబరాలు చేసుకోకూడదు. ఎన్ని అబద్ధాలు చెప్పినా ఓటమి చవిచూడాల్సివచ్చినందుకు కొందరు పడుతున్న బాధను నేను అర్థం చేసుకోగలను. వారు ఓటమిని అంగీకరించి ఆత్మవిమర్శ చేసుకునే బదులు శీర్షాసనం వేయడంలో తలమునకలై ఉన్నారు. దళితులు, వెనుకబడిన వర్గాలపట్ల నెహ్రూ ప్రభుత్వ చిన్నచూపును సహించలేక రాజీనామా చేసి, మంత్రివర్గం నుంచి బయటికి వచ్చిన అంబేడ్కర్‌ను పట్టుబట్టి ఓడించిన కాంగ్రెస్‌ నాయకులు ఇప్పుడు రాజ్యాంగం, రిజర్వేషన్ల రక్షణ గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తోంది. భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుతున్న హిందూ మతంపై హింసావాదులుగా ముద్ర వేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? 

కాంగ్రెస్‌వి కుటిల ప్రయత్నాలు

ఈ ఎన్నికల్లో తాము భాజపాను ఓడించామనే భావనను ప్రజల మనసుల్లో నాటే కుటిల ప్రయత్నాలను కాంగ్రెస్‌ మొదలుపెట్టింది. ఇలా ఎందుకు చేస్తోందనడానికి ఓ ఉదాహరణ చెబుతాను. ఒక పిల్లవాడు సైకిల్‌ తొక్కడం మొదలుపెట్టిన తర్వాత కిందపడిపోయాడు. ఏడుస్తున్న పిల్లాడిని సముదాయించడానికి ఓ పెద్దమనిషి- ‘నువ్వు సైకిల్‌ బాగా తొక్కావు, కానీ చీమ అడ్డువచ్చి పడిపోయావు’ అని సాంత్వన చేకూర్చేలా మాట్లాడినట్లుగానే కాంగ్రెస్‌ నాయకులు ప్రచారం మొదలుపెట్టారు.

విద్వేషాలతో ప్రయోజనం పొందే ప్రయత్నం

కాంగ్రెస్‌ పార్టీ ప్రజల మధ్య విద్వేషాలు పెట్టి రాజకీయ ప్రయోజనం పొందే ప్రయత్నం చేసింది. దక్షిణాదికి వెళ్లి ఉత్తర భారతీయులకు వ్యతిరేకంగా మాట్లాడింది. ఉత్తరాదికి వెళ్లి పశ్చిమభాగం వారిపై విషం చిమ్మింది. ఒక పిల్లాడు స్కూల్‌నుంచి వచ్చి గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. ఏమైందోనని అమ్మ భయపడింది. స్కూల్‌లో తనను కొట్టారని చెప్పాడు. స్కూల్‌లో ఆ పిల్లాడే మిగతా పిల్లలను దూషించడం, పక్కనున్నవారి పుస్తకాలు చింపేయడం, టీచర్‌ను దొంగ అని తిట్టడం, పక్కవారి టిఫిన్‌ చోరీచేసి తినడం వంటివి చెప్పలేదు. ఈ సభలో ఇలాగే నిన్న బాలబుద్ధి విలాపం చూశాం. నన్ను వీళ్లుకొట్టారు... వాళ్లు కొట్టారన్న ఏడుపులే వినిపించాయి. దేశానికి వాస్తవం తెలుసు. బాలబుద్ధి మాటతీరు, వ్యవహారశైలి బాగాలేదు. సభలో ఉన్నట్టుండి ఎవరివద్దకో వెళ్లి కౌగిలించుకుంటారు... లేదంటే సభలో కూర్చొని కన్ను కొడతారు. అబద్ధాలు చెప్పడాన్ని కాంగ్రెస్‌ రాజకీయ ఆయుధంగా మార్చుకొంది. కాంగ్రెస్‌ నోటికి అబద్ధాల రక్తం అంటుకుంది. 60 ఏళ్లు అధికార పీఠంలో కూర్చున్న పార్టీకి అనుభవజ్ఞులైన నాయకులున్నా అరాచక, అబద్ధాల రహదారిపై వెళ్లాలనుకోవడం అత్యంత ఆందోళనకరం. 

రాజ్యాంగం, రిజర్వేషన్లపై నిరంతరం అబద్ధాలు

అత్యవసర పరిస్థితి విధించి ఇప్పటికి 50 ఏళ్లయింది. కేవలం అధికారం నిలబెట్టుకోవడం కోసం నియంతృత్వ మనస్తత్వంతో దాన్ని దేశంపై రుద్దింది కాంగ్రెసే. రాజ్యాంగానికి విరుద్ధంగా చేయాల్సిన పనులన్నీ ఆ పార్టీ చేసింది. మొదటి నుంచీ దళితులు, బీసీలకు ఘోర అన్యాయం చేసింది. ఆ వ్యతిరేకత కారణంగా నెహ్రూ క్యాబినెట్‌ నుంచి అంబేడ్కర్‌ రాజీనామా చేసి వారి నిజస్వరూపం బయటపెట్టారు. నెహ్రూ పట్టుబట్టి ఎన్నికల్లో ఆయన్ని ఓడించారు. ఎమర్జెన్సీ తర్వాత జగ్జీవన్‌రామ్‌ ప్రధాని కావాల్సి ఉన్నా అలా ఎట్టిపరిస్థితుల్లోనూ జరగకూడదని ఇందిరాగాంధీ నిర్ణయించారు. ఒకవేళ ఆయన ప్రధానమంత్రి అయితే జీవితాంతం తప్పుకోరని ఇందిరాగాంధీ చెప్పినట్లు ఓ పుస్తకంలో ఉంది. బిహార్‌ నేత సీతారాం కేసరిని అవమానించిన పాపం కూడా కాంగ్రెస్‌కే దక్కుతుంది. ప్రారంభం నుంచి రిజర్వేషన్లకు తీవ్ర వ్యతిరేకంగా ఆ పార్టీ పనిచేసింది.

రాహుల్‌ ప్రసంగాన్ని వందేళ్ల తర్వాతా క్షమించరు

సోమవారం సభలో జరిగిన దాన్ని ఈ దేశ ప్రజలు వందేళ్ల తర్వాతా క్షమించబోరు. 131 ఏళ్లకుముందు స్వామి వివేకానంద షికాగోలో హిందూమతం గొప్పతనం గురించి ప్రపంచ దిగ్గజాల ముందు ఘనంగా చెప్పారు. హిందువులు సహనశీలురు కాబట్టే ఈ దేశంలో ప్రజాస్వామ్యం, వైవిధ్యం పరిఢవిల్లుతోంది. కానీ ఈరోజు హిందువులపై తప్పుడు ఆరోపణలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. హిందువులు హింసావాదులు అనడం సంస్కారమా? ఇలాంటి ఆరోపణలు చేస్తారా? హిందూమతం, దేశ సంస్కృతి, వారసత్వాన్ని నీచంగా చూపి అవమానించడం, హిందువులను ఎగతాళి చేయడం ఫ్యాషన్‌గా మారిపోయింది. రాజకీయ స్వార్థం కోసం ఇవన్నీ చేస్తున్నారు.. యువత భవిష్యత్తుతో ఆడుకొనేవారిని వదిలిపెట్టం. నీట్‌ విషయంలో దేశవ్యాప్తంగా అరెస్టులు జరుగుతున్నాయి. పరీక్ష వ్యవస్థను బలోపేతం చేసే ప్రయత్నం చేస్తున్నాం’’ అని ప్రధాని చెప్పారు.

100కి 99కాదు, 543కి 99

99 మార్కులు వచ్చినట్లు ఒక బాలుడు అహంకారంతో తిరుగుతూ నాకు ఎన్నిమార్కులు వచ్చాయో చూడమని దేశానికంతా చెబుతున్నాడు. 99ని చూసినవారు మెచ్చుకుంటున్న సమయంలో టీచర్‌ వచ్చి అతనికి వచ్చింది 100కి 99కాదు, 543కి 99అని చెప్పింది. కానీ అది ఆ బాలబుద్ధికి అర్థంకాలేదు. పరాజయం పొందడంలో అతను ఇప్పటికే ప్రపంచరికార్డు సృష్టించారు. మూడోసారి ఓడిపోయినా నైతిక విజయమంటూ భుజాలు చరుచుకుంటున్నారు. 13 రాష్ట్రాల్లో జీరో సీట్లు వచ్చినా తానే హీరో అంటున్నారు.మిత్రపక్షాల ఓటు రాకపోతే  కాంగ్రెస్‌ పార్టీకి లోక్‌సభలో ఇన్ని సీట్లు గెలవడం కూడా కష్టమే. 

రాహుల్‌ను ఉద్దేశించి మోదీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని