Chandrababu: ప్రజా సమస్యలు పరిష్కరించాలి.. పాలనలో మార్పు కనిపించాలి: చంద్రబాబు

ఇసుక, రోడ్లు, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై సచివాలయంలో మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు వరుసగా సమీక్షలు నిర్వహించారు. 

Updated : 02 Jul 2024 19:14 IST

అమరావతి: ఇసుక, రోడ్లు, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై సచివాలయంలో మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు వరుసగా సమీక్షలు నిర్వహించారు. గత ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలు అనేక సమస్యల్లో ఉన్నారని, వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఇసుక లభ్యత, నూతన ఇసుక పాలసీపై ముఖ్యమంత్రి సమీక్షించారు. పాలనలో మార్పు స్పష్టంగా కనిపించేలా.. అధికారులు వేగంగా పని చేయాలని తేల్చిచెప్పారు.

2014 నుంచి 2019 వరకు ఇసుక సరఫరాలో అమలు చేసిన పాలసీలను, ఆ తరువాత వైకాపా ప్రభుత్వం తెచ్చిన విధానాలను అధికారులు వివరించారు. 2016లో తెచ్చిన ఉచిత ఇసుక పాలసీ వల్ల వచ్చిన ఫలితాలు... తరువాత వచ్చిన వైకాపా ప్రభుత్వం పాలసీలు మార్చడం వల్ల జరిగిన నష్టాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. గత ప్రభుత్వ విధానాలతో ఇసుక కొరత, ధరల భారంతో నిర్మాణ రంగం సంక్షోభాన్ని ఎదుర్కొందని అధికారులు తెలిపారు. ఇసుక క్వారీల నిర్వహణలో పారదర్శకత లేకపోవడం, ప్రైవేటు వ్యక్తులు, ఏజెన్సీలకు ఇసుక క్వారీలను అప్పగించడంతో సరఫరా, అమ్మకాల్లో ఇబ్బందులు వచ్చాయన్నారు. సీసీ కెమెరాలు, జీపీఎస్‌ ట్రాకింగ్‌, ఆన్‌లైన్‌ విధానం సరిగా లేకపోవడం వల్ల అక్రమాలు జరిగాయని వివరించారు. ప్రైవేటు ఏజెన్సీలు ఎంత మేర తవ్వకాలు జరిపాయి, ఎంత మేర అమ్మకాలు జరిపాయనే విషయంలో కూడా ఎలాంటి పరిశీలన, పర్యవేక్షణ జరగలేదని వెల్లడించారు. తక్షణం నిర్మాణ రంగానికి అవసరమైన ఇసుకను అందుబాటులోకి తేవడానికి చర్యలు తీసుకోవాలని సీఎం .. అధికారులను ఆదేశించారు.

రోడ్ల మరమ్మతులకు ప్రాధాన్యం..

గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో రోడ్లను బాగు చేయడం ఒక విధానం అయితే... తక్షణం ప్రజల కష్టాలు తీర్చేందుకు రహదారులపై గుంతలు పూడ్చడం, వెంటనే మరమ్మతులు చేయాల్సిన రోడ్లపై దృష్టి సారించాలని సూచించారు. ఎన్ని కిలోమీటర్ల మేర రోడ్లు.. ఏ మేర దెబ్బతిన్నాయి అనే విషయంలో సత్వరమే నివేదికలు సిద్ధం చేయాలన్నారు. రోడ్ల మరమ్మతులకు సంబంధించి సాంకేతికంగా అందుబాటులోకి వచ్చిన కొత్త విధానాలపై అధ్యయనం చేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం వర్షాలు పడుతున్నప్పటికీ వెంటనే మరమ్మతులు చేయాల్సిన రోడ్లపై ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. ఆర్థిక సమస్యలు ఉన్నా... ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రోడ్ల మరమ్మతులకు ప్రాధాన్యం ఇస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.

ప్రజలపై నిత్యావసర సరకుల భారం తగ్గించాలి..

నిత్యావసర సరకుల భారం తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నిత్యావసర సరకుల ధరలపై వ్యవసాయ, మార్కెటింగ్, సివిల్ సప్లై శాఖల అధికారులు, మంత్రులతో సమీక్ష చేశారు. బియ్యం, కందిపప్పు, టమోటా, ఉల్లి ధరల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. డిమాండ్ కు సరిపడా సరఫరా లేక కంది పప్పు ధర అంతకంతకూ పెరుగుతోందని అధికారులు తెలిపారు. అలాగే టమోటా, ఉల్లిపాయల ధరలు ఒక్కోసారి అనూహ్యంగా పెరగడం వల్ల ప్రజలపై భారం పడుతోందని వెల్లడించారు. ధరల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నిత్యవసర వస్తువుల ధరల నియంత్రణకు ఆయా సరుకుల దిగుమతుల కోసం అవసరమైన చోట కేంద్రంతో కూడా సంప్రదింపులు జరుపుదామని సీఎం అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 122 రైతుబజార్లు ఉన్నాయని అధికారులు చెప్పగా, నిర్వహణ సరిగా లేక వాటి ఏర్పాటు వెనుక ఉన్న ఉద్దేశం నెరవేరడం లేదని చంద్రబాబు అన్నారు. మంత్రులు కొల్లు రవీంద్ర, బీసీ జనార్దన్‌రెడ్డి, కె.అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్‌తో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు సమీక్షల్లో పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని