Chandrababu: ప్రజల ఐదేళ్ల కష్టానికి నేటితో విముక్తి

రాష్ట్ర ప్రజల ఐదేళ్ల కష్టానికి నేటితో తెర పడనుందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఓటమి భయంతో కౌంటింగ్‌ మధ్యలోనే వైకాపా ఏజెంట్లు పారిపోతారని ఎద్దేవా చేశారు.

Updated : 04 Jun 2024 06:49 IST

కౌంటింగ్‌లో వైకాపావారు గొడవలకు దిగొచ్చు
ఎలాంటి సమస్యలొచ్చినా ‘వార్‌రూమ్‌’కు సమాచారమివ్వండి
నేను అక్కడి నుంచే పర్యవేక్షిస్తా
అభ్యర్థులు, ఏజెంట్లకు చంద్రబాబు దిశానిర్దేశం

ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్ర ప్రజల ఐదేళ్ల కష్టానికి నేటితో తెర పడనుందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఓటమి భయంతో కౌంటింగ్‌ మధ్యలోనే వైకాపా ఏజెంట్లు పారిపోతారని ఎద్దేవా చేశారు. పూర్తి స్థాయి ఫలితాలు వచ్చే దాకా కౌంటింగ్‌ కేంద్రంలోనే ఉండాలని.. డిక్లరేషన్‌ ఫాం తీసుకున్నాకే బయటకు రావాలని పార్టీ అభ్యర్థులకు సూచించారు. అభ్యర్థులు, కౌంటింగ్‌ ఏజెంట్లు సోమవారం రాత్రికే కౌంటింగ్‌ జరిగే ప్రాంతాలకు చేరుకోవాలని.. మంగళవారం ఉదయం 6:30 గంటల కల్లా కేంద్రాలకు వెళ్లాలని చెప్పారు. ఎవరైనా అనారోగ్యం, వ్యక్తిగత కారణాలతో వెళ్లలేకపోతే నిబంధనల మేరకు కౌంటింగ్‌కు ముందు వేరొకర్ని నియమించుకోవచ్చని గుర్తుచేశారు. కౌంటింగ్‌ ప్రక్రియ పర్యవేక్షణకు మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన వార్‌రూమ్‌ను సోమవారం ఆయన పరిశీలించారు. పలువురు నేతలకు వివిధ బాధ్యతలు అప్పగించారు. అంతకుముందు టెలికాన్ఫరెన్స్‌లో ఎన్డీయే ఏజెంట్లతో ఆయన మాట్లాడారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి సమస్యలు వచ్చినా.. వార్‌రూమ్‌కు సమాచారమివ్వాలన్నారు. తానూ అక్కడి నుంచే కౌంటింగ్‌ ప్రక్రియను పర్యవేక్షిస్తానని అభ్యర్థులకు చెప్పారు.  ‘కౌంటింగ్‌ కేంద్రంలో వైకాపా వాళ్లు ఉద్దేశపూర్వకంగా గొడవకు దిగే అవకాశం ఉంది. వీటిపై ఆర్వోకు ఫిర్యాదు చేయండి. స్ట్రాంగ్‌ రూం నుంచి ఈవీఎంలను తీసుకొచ్చే సమయంలో ప్రధాన సీళ్లు సరిగా ఉన్నాయో.. లేదో చూసుకోవాలి. అనుమానం ఉంటే రీకౌంటింగ్‌కు డిమాండ్‌ చేయ్యాలి. ఏ ఫిర్యాదునైనా లిఖితపూర్వకంగా చేసి, ఎక్‌నాలెడ్జ్‌మెంట్‌ను తప్పనిసరిగా తీసుకోండి’ అని చంద్రబాబు సూచించారు. 

సుప్రీంకోర్టులోనూ మొట్టికాయలు తప్పలేదు

పోస్టల్‌ బ్యాలట్‌ ఓట్లపై రాద్ధాంతం చేయాలనుకున్న వైకాపాకు సుప్రీంకోర్టులోనూ మొట్టికాయలు తప్పలేదని చంద్రబాబు పేర్కొన్నారు. ‘వైకాపా వారు అల్లర్లకు పాల్పడే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. కానీ ఎక్కడా సంయమనం కోల్పోవద్దు. నిబంధనల మేరకు ప్రక్రియ జరిగేలా పట్టుబట్టాలి. 17-సీ ఫాంను దగ్గర పెట్టుకొని పోలైన ఓట్లను.. కౌంటింగ్‌లో వచ్చిన ఓట్లను సరిచూసుకోవాలి’ అని ఎన్డీయే ఏజెంట్లకు సూచించారు. 

ఈ ఎన్నికల్లో తన పర్యటనల్ని సమన్వయం చేసిన బృందాన్ని ఉండవల్లి నివాసంలో చంద్రబాబు అభినందించారు. ప్రచారంలో భాగంగా రోజుకు మూడు నుంచి ఐదు కార్యక్రమాల్లో పాల్గొనేలా పకడ్బందీగా షెడ్యూల్‌ రూపొందించినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ కోసం కష్టపడి పనిచేశారని కొనియాడారు.


సైకిల్‌ సమాజానికి, ఆరోగ్యానికి మేలు చేస్తుంది

తెదేపా అధినేత చంద్రబాబు

అంతర్జాతీయ సైకిల్‌ దినోత్సవం సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు ‘ఎక్స్‌’లో స్పందించారు. సమాజానికి, వ్యక్తుల ఆరోగ్యానికి సైకిల్‌ మేలు చేస్తుందన్నారు. అది తొక్కడం మంచి వ్యాయామం అని పేర్కొంటూ.. తాను సైకిల్‌ తొక్కుతున్న ఫొటోను పోస్టు చేశారు.


శ్రేణులకు చంద్రబాబు అభినందన

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద శ్రేణుల సందడి

ఈనాడు డిజిటల్, అమరావతి : తెదేపా అధినేత చంద్రబాబు సోమవారం రాత్రి మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. పోలింగ్‌ ముగిశాక తొలిసారిగా ఆయన పార్టీ కార్యాలయానికి రావడంతో నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ‘సీఎం బాబు..సీఎం బాబు’... అని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. పుష్పగుచ్ఛాలు అందజేశారు. శాలువలతో సత్కరించారు. ఈ సందర్భంగా కార్యకర్తలను చంద్రబాబు అభినందించారు. సంబరాలు రేపు చేసుకుందామని, శక్తి ఇప్పుడే ఖర్చు చేసుకోవద్దని చమత్కరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు