Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై.. కొత్తగా అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌) 221, 126(2) కింద కరీంనగర్‌ ఒకటో ఠాణాలో కేసు నమోదైంది.

Published : 04 Jul 2024 03:58 IST

కరీంనగర్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై.. కొత్తగా అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌) 221, 126(2) కింద కరీంనగర్‌ ఒకటో ఠాణాలో కేసు నమోదైంది. మంగళవారం కరీంనగర్‌ జడ్పీ సమావేశంలో తన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం లేదంటూ భారాస ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి పోడియం వద్ద కూర్చొని ప్లకార్డులతో నిరసన తెలిపారు. అక్కడి నుంచి కలెక్టర్‌ పమేలా సత్పతి వెళ్లే క్రమంలో ఆమెను అడ్డగించారు. దీంతో సమావేశానికి ఆటంకం కలిగించడంతోపాటు, కలెక్టర్‌ వెళ్లకుండా అడ్డుకున్నారంటూ జడ్పీ కార్యాలయ పర్యవేక్షణ అధికారి ఎం.శ్రీనివాస్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బీఎన్‌ఎస్‌ 221, 126(2) కింద ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసినట్లు కరీంనగర్‌ ఒకటో ఠాణా సీఐ సరిలాల్‌ పేర్కొన్నారు.

సీపీకి కౌశిక్‌రెడ్డి వినతిపత్రం..: తనపై నమోదైన కేసును తొలగించి విచారణ జరిపించాలని కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో కలిసి కౌశిక్‌రెడ్డి కరీంనగర్‌ సీపీ అభిషేక్‌ మహంతిని కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం కౌశిక్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తన నియోజకవర్గంలోని మండల విద్యాధికారులతో సమావేశం నిర్వహిస్తే హాజరైన అధికారులకు జిల్లా విద్యాధికారి మెమో జారీచేసిన విషయంపై జడ్పీ సమావేశంలో ప్రశ్నించినందుకు పోలీసు కేసు పెట్టించారని.. దీనిపై అసెంబ్లీ స్పీకర్‌ను కలిసి జడ్పీ సీఈవో, జిల్లా విద్యాధికారులపై సభాహక్కుల తీర్మానం ప్రవేశపెడతామన్నారు. ఈ విషయాన్ని అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తి ప్రభుత్వాన్ని నిలదీస్తానన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని