Harish Rao: 2028 ఎన్నికల్లో భారాసదే అధికారం

రాజకీయాల్లో జయాపజయాలు సహజమని, ఓటమి తర్వాత వచ్చేది గెలుపేనని.. 2028 ఎన్నికల్లో భారాస మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు.

Published : 04 Jul 2024 03:57 IST

మాజీ మంత్రి హరీశ్‌రావు

దుబ్బాక, న్యూస్‌టుడే: రాజకీయాల్లో జయాపజయాలు సహజమని, ఓటమి తర్వాత వచ్చేది గెలుపేనని.. 2028 ఎన్నికల్లో భారాస మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో నిర్వహించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే పంచాయతీలకు ఎలాంటి నిధులు ఇవ్వకుండా గ్రామాలను మురికికూపాలుగా మార్చిందని విమర్శించారు. పారిశుద్ధ్య సిబ్బంది, పాఠశాలల్లోని మధ్యాహ్న భోజన కార్మికులకు ఏడు నెలలుగా జీతాలు ఇవ్వకుండా మొద్దునిద్ర పోతోందని ధ్వజమెత్తారు. పాలనను గాలికి వదిలేసిందని, ప్రతిపక్షాలపై కేసులు, కుట్రలతోనే కాలం వెల్లదీస్తోందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా రైతుల ఆత్మహత్యలు, హత్యలు, అత్యాచారాలు, నేరాలు జరుగుతున్నాయన్నాని.. శాంతిభద్రతలు ఆగమయ్యాయని చెప్పారు. ఖమ్మం జిల్లాలో ఓ రైతు ఆత్మహత్య, సీఎం సొంత జిల్లా అయిన మహబూబ్‌నగర్‌లోని కలెక్టరేట్‌లో మరో రైతు ఆత్మహత్యాయత్నం ఘటనలు కాంగ్రెస్‌ ప్రభుత్వ చేతగాని పాలనకు నిదర్శనమని ఆరోపించారు. గత భారాస ప్రభుత్వ హయాంలో ఏటా జూన్‌ నెల నాటికి రైతుల ఖాతాల్లో రైతుబంధు సొమ్ము పడితే, జులై గడుస్తున్నా రైతుభరోసా ఇవ్వడంలో కాంగ్రెస్‌ సర్కారు విఫలమైందని విమర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడి,్డ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ బక్కి వెంకటయ్య, మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్‌ హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని