Vinod kumar: తెలంగాణ శాసనమండలి ఉనికికి ప్రమాదం ఏర్పడింది: మాజీ ఎంపీ వినోద్‌

తెలంగాణలో శాసనమండలి ఉనికికి ప్రమాదం ఏర్పడిందని భారాస నేత, మాజీ ఎంపీ వినోద్‌ కుమార్‌ అన్నారు.

Published : 05 Jul 2024 15:48 IST

హైదరాబాద్‌: తెలంగాణ శాసనమండలి ఉనికికి ప్రమాదం ఏర్పడిందని భారాస నేత, మాజీ ఎంపీ వినోద్‌ కుమార్‌ అన్నారు. శనివారం జరిగే సమావేశంలో ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి అసెంబ్లీ సీట్లు పెరిగేలా చూడాలని కోరారు. రెండు రాష్ట్రాల్లో శాసనసభ సీట్లు పెంచాలని విభజన చట్టంలో ఉందని, చట్టానికి చిన్న సవరణ చేస్తే సీట్ల సంఖ్య పెంచవచ్చని చెప్పినప్పటికీ మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.

జమ్మూకశ్మీర్‌ కోసం చట్ట సవరణ చేశారు.. కానీ, ఈ విజ్ఞప్తిపై స్పందించలేదని ఆరోపించారు. ఆంగ్లో ఇండియన్ కలిపితే రాష్ట్ర శాసనసభలో 120 మంది ఎమ్మెల్యేలు ఉండేవారని వినోద్ వివరించారు. లోక్ సభలో, శాసనసభలో నామినేటెడ్ ఆంగ్లో ఇండియన్ సభ్యులను మోదీ ప్రభుత్వం తొలగించిందని... దీంతో రాష్ట్ర అసెంబ్లీ సభ్యుల సంఖ్య 119 మాత్రమేనని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో మండలి రాజ్యాంగం ప్రకారం లేదని, ఎవరైనా కేసు వేస్తే మండలి రద్దు అవుతుందని చెప్పారు. ఇప్పుడు మంచి అవకాశం వచ్చిందని, రేపటి ముఖ్యమంత్రుల సమావేశంలో ఈ అంశంపై చర్చించాలని సూచించారు. కేంద్రంపై ఏపీ సీఎం చంద్రబాబు ఒత్తిడి తీసుకొచ్చి రెండు రాష్ట్రాల్లో సీట్లు పెరిగేలా చూడాలని కోరారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీ పడొద్దని సీఎం రేవంత్ రెడ్డికి వినోద్‌ కుమార్‌ విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని