Telangana news: రెండు లక్షల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారు?: ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి

తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని సీఎం రేవంత్ రెడ్డి దిల్లీలో తాకట్టు పెట్టారని భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి విమర్శించారు.

Updated : 01 Jul 2024 17:08 IST

హైదరాబాద్‌: తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని సీఎం రేవంత్ రెడ్డి దిల్లీలో తాకట్టు పెట్టారని భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి విమర్శించారు. వైద్యానికి పెద్దపీట వేస్తామన్న ముఖ్యమంత్రి కార్పొరేట్ ఆసుపత్రులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.  వరంగల్‌లో కార్పొరేట్ ఆసుపత్రిని ముఖ్యమంత్రి ప్రారంభించి.. కార్పొరేట్‌ను ప్రోత్సహిస్తున్నారన్నారు. గాంధీ ఆసుపత్రి వద్ద మీడియాకు ఆంక్షలు విధించడమే ప్రజాపాలనా? అని ప్రశ్నించారు. నిరుద్యోగ యువతపై కనికరం లేకుండా లాఠీఛార్జ్ చేయించడం అప్రజాస్వామికమన్నారు. రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ఎప్పటి వరకు భర్తీ చేస్తారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

‘‘ఎమ్మెల్యేలు పార్టీ మారితే వారి ఇళ్ల ముందు చావు డప్పు కొట్టమన్నారు. ఇప్పుడు భారాస ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ చేర్చుకుంటోంది. మరి ఆ ఎమ్మెల్యేల ఇంటి ముందు ఏ డప్పు కొట్టాలో చెప్పాలి. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్‌కు ఫిర్యాదు చేద్దామంటే అందుబాటులో ఉండటం లేదు.. సమయం ఇవ్వడం లేదు. పౌర సరఫరాల శాఖ అవినీతిపై ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పడం లేదు. పీడీఎస్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తూ.. అతిపెద్ద కుంభకోణానికి పాల్పడుతున్నారు. నీటి పారుదల, పౌర సరఫరాలశాఖలో జరుగుతున్న అవినీతిని ఆధారాలతో సహా త్వరలో బయటపెడతా. అవినీతిని అసెంబ్లీలో ప్రశ్నిస్తా.. మీడియా ముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తా. దానం నాగేందర్‌పై అనర్హత పిటిషన్‌ ఇస్తున్నాం. త్వరలో  పార్టీ మారిన మిగతా ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ వేస్తాం. దానం ఒక పార్టీ ఎమ్మెల్యేగా ఉండి.. మరో పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేశారు’’ అని మహేశ్వర్‌ రెడ్డి విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని