BJP: లోక్‌సభ ఓట్లగణనకు ముందు.. భాజపా నేతల కీలక సమీక్ష

మరికొన్ని గంటల్లో లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడనుండగా.. విజయంపై ధీమాగా ఉన్న భాజపా నేతలు సోమవారం పార్టీ అధ్యక్షుడు జె.పి.నడ్డా అధ్యక్షతన కీలక భేటీ నిర్వహించారు.

Updated : 04 Jun 2024 05:22 IST

నడ్డా అధ్యక్షతన సమావేశం
హాజరైన అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ 

దిల్లీ: మరికొన్ని గంటల్లో లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడనుండగా.. విజయంపై ధీమాగా ఉన్న భాజపా నేతలు సోమవారం పార్టీ అధ్యక్షుడు జె.పి.నడ్డా అధ్యక్షతన కీలక భేటీ నిర్వహించారు. కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్, పలువురు సీనియర్‌ నేతలు హాజరయ్యారు. ఎన్నికల్లో పార్టీ ప్రదర్శనతోపాటు మంగళవారం జరగనున్న ఓట్లగణన సందర్భంగా అన్ని పోలింగ్‌ బూత్‌లకు ఏజెంట్లు సకాలంలో చేరుకోవడం వంటి సన్నాహాలను సమీక్షించారు. ఈ ఎన్నికల్లోనూ భాజపా సారథ్యంలోని ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించబోతోందని అత్యధిక ఎగ్జిట్‌ పోల్స్‌ పేర్కొన్న నేపథ్యంలో రాజకీయ పరిస్థితులతోపాటు ఆ అంచనాలను తిరస్కరిస్తూ విపక్ష ఇండియా కూటమి నిర్వహించిన వరుస సమావేశాల గురించి నేతలు చర్చించారు. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్‌ తావ్డే మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలను ధ్రువీకరించారు. ఏడు దశల్లో జరిగిన పోలింగు సరళిని సమావేశంలో సమీక్షించినట్లు ఆయన తెలిపారు. ఓట్లలెక్కింపుపై ఎక్కడైనా అనుమానాలు ఉంటే అటువంటి పరిస్థితులపై పార్టీ ఆఫీస్‌ బేరర్లు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించినట్లు వెల్లడించారు. ఫలితాల అనంతరం జరుపుకొనే సంబరాలు, ప్రభుత్వ ఏర్పాటు గురించి ఎటువంటి చర్చ జరగలేదని.. ఎగ్జిట్‌ పోల్స్‌ ఆధారంగా కాకుండా ఓటింగు సరళి తెలిశాకే ఆ విషయంపై మాట్లాడుతామని ఒక ప్రశ్నకు సమాధానంగా తావ్డే చెప్పారు. ప్రతిపక్షాల వ్యూహాలను ఎదుర్కోవడంపై సమావేశంలో భాజపా నేతలు చర్చించినట్లు తెలిసినా.. ఆ విషయాన్ని అధికారికంగా ఆయన ధ్రువీకరించలేదు. ఇటు భాజపా, అటు ఇండియా కూటమి నేతలు ఆదివారం ఎన్నికల కమిషనర్లను కలిసి ఫిర్యాదులు సమర్పించిన విషయం తెలిసిందే.  


ఇండియా కూటమి ఓటమిని హుందాగా అంగీకరించాలి

-భాజపా

మంగళవారం వెల్లడయ్యే లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్‌ సారథ్యంలోని ఇండియా కూటమి అనివార్యమైన ఓటమిని హుందాగా అంగీకరించాలని, ప్రజాస్వామ్య గౌరవాన్ని కించపరచరాదని భాజపా హితవు పలికింది. పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం భాజపా జాతీయ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగ వ్యవస్థలపై విపక్షాలు లేవనెత్తుతున్న నిరాధార ఆరోపణలు సమాజంలో అశాంతికి దారి తీస్తాయన్నారు. 


ప్రధాని మోదీతో నీతీశ్‌ భేటీ

బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్‌ సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. లోక్‌సభ ఎన్నికల ఓట్లగణనకు ఒకరోజు ముందు జరిగిన ఈ సమావేశానికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఎన్డీయేలో భాగమైన నీతీశ్‌ సారథ్యంలోని జేడీయూకు ఈసారి బిహార్‌లో ఆర్జేడీ నుంచి గట్టి సవాలు ఎదురైంది. రాష్ట్రంలో భాజపా కూడా బలంగా ఉన్నందున 2005 నుంచి మధ్యలో కొద్దికాలం మినహా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నీతీశ్‌ భవితవ్యం ఫలితాల తర్వాత ఎలా ఉంటుందన్నదానిపై కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని