AP-Telangana: తెలుగు రాష్ట్రాల సీఎంల కీలక భేటీకి ఏర్పాట్లు

తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు మధ్య కీలక భేటీకి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.

Updated : 02 Jul 2024 16:50 IST

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఈనెల 6న హైదరాబాద్‌లో జరగనుంది. తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు మధ్య కీలక భేటీకి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. విభజన సమస్యలు పరిష్కరించుకునేందుకు సమావేశం ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు రాసిన లేఖకు సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. సమావేశంలో చర్చించాల్సిన అజెండాను తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ఈనెల 6న జరిగే సమావేశానికి ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగాన్ని సీఎం ఆదేశించినట్టు సమాచారం. సహచర మంత్రులు, ఉన్నతాధికారులతోనూ ఈ విషయమై సీఎం రేవంత్‌రెడ్డి చర్చించనున్నారు.

రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న అంశాలివే..

పునర్విభజన చట్టంలోని తొమ్మిదో షెడ్యూల్ లో ఉన్న ఆర్టీసీ, రాష్ట్ర ఆర్థిక సంఘం తదితర 23 కార్పొరేషన్ల ఆస్తులపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. పదో షెడ్యూల్‌లోని తెలుగు అకాడమీ, అంబేడ్కర్‌, తెలుగు యూనివర్సిటీ వంటి 30 సంస్థల ఆస్తులు, సేవలపై కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. రాజ్ భవన్, హైకోర్టు, లోకాయుక్త, కార్మిక సంక్షేమ నిధి, వాణిజ్య పన్నులు, విద్యుత్ సంస్థల బకాయిలపైనా వివాదాలు ఉన్నాయి. రెండు రాష్ట్రాల అధికారులతో కేంద్ర హోంశాఖ పలు సమావేశాలు నిర్వహించినప్పటికీ సమస్యలు పరిష్కారం కాలేదు. ముఖ్యమైన చిక్కులను ముఖాముఖి చర్చలతో పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని ఏపీ సీఎం చంద్రబాబు చొరవ చూపడంతో.. రెండు రాష్ట్రాల మధ్య ఏళ్లు తరబడి పెండింగులో ఉన్న విభజన సమస్యలు కొలిక్కి రావొచ్చని ఇరు రాష్ట్రాలు ఆశిస్తున్నాయి.

మరో వైపు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. తెలంగాణ ఆవిర్భావం నుంచి ఈ ప్రాంత వాసుల్లో చర్చనీయాంశంగా ఉన్న ఖమ్మం జిల్లా భద్రాచలం విలీన గ్రామపంచాయతీలపై ప్రత్యేక చొరవ తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. ఏపీలో విలీనమైన ఏటపాక, గుండాల, పురుషోత్తమపట్నం, కన్నాయిగూడెం, పిచుకులపాడు గ్రామ పంచాయతీలను తిరిగి భద్రాచలంలో కలపాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు