TDP: ప్రజా సమస్యలపై తెదేపా టోల్‌ఫ్రీ నంబరు 73062 99999

ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ తరఫున ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేసినట్లు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు.

Published : 01 Jul 2024 05:02 IST

వివరాలు చెబితే.. చంద్రబాబును కలిసే ఏర్పాటు 
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు 

ఈనాడు డిజిటల్, అమరావతి: ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ తరఫున ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేసినట్లు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఇబ్బందులు ఉన్న వారు 73062 99999 నంబర్‌కు ఫోన్‌ చేసి సమస్య తెలియజేస్తే.. వివరాలు నమోదు చేసుకుని ముఖ్యమంత్రిని కలిసే అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య ఫోన్‌ చేయొచ్చని, ప్రతి శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్‌ ఉంటుందని చెప్పారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘‘సీఎంను కలిసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యాలయానికి వస్తున్నారు. వినతులు ఇచ్చే వారితో పాటు చంద్రబాబుతో ఫొటోలు దిగేందుకు యువత వేల సంఖ్యలో వస్తున్నారు. వీరిని నియంత్రించడం కష్టమవడంతో పాటు గ్రీవెన్స్‌ను మరింత సమర్థంగా నిర్వహించాలనే ఉద్దేశంతో టోల్‌ ఫ్రీ నంబర్‌ తీసుకొచ్చాం’’ అని శ్రీనివాసరావు పేర్కొన్నారు. తెదేపా నాయకులు, కార్యకర్తలపై గత ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా పెట్టిన తప్పుడు కేసుల్ని మూడు నెలల్లో, ఎఫ్‌ఐఆర్‌ నమోదై కోర్టుల పరిధిలో ఉన్న వాటిని ఏడాది లోపు తొలగించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. 

ఒక్కో పింఛన్‌దారుకు రూ.32 వేల నష్టం 

ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమల్లో భాగంగా చంద్రబాబు ఒకే విడతలో రూ.వెయ్యి చొప్పున పింఛన్‌ నగదును పెంచారని శ్రీనివాసరావు పేర్కొన్నారు. ‘‘గత ప్రభుత్వం రూ.వెయ్యి పెంచడానికి ఐదేళ్లు తీసుకుంది. దాంతో ఒక్కో పింఛన్‌దారు సగటున రూ. 32 వేల చొప్పున నష్టపోయారు’’ అని తెలిపారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎన్డీయే నేతలు పాల్గొనాలని కోరారు. 


అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారిని ఆదుకోండి 

దాతలకు పల్లా శ్రీనివాసరావు పిలుపు

స్పైనల్‌ మస్కులర్‌ ఆట్రోఫి (ఎస్‌ఎంఏ) అనే అరుదైన ప్రాణాంతక వ్యాధితో బాధపడుతోన్న హితైషి అనే తొమ్మిది నెలల చిన్నారికి దాతలు తమ వంతు సాయం చేసి ఆదుకోవాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా  శ్రీనివాసరావు కోరారు. చిన్నారి చికిత్సకు సుమారు రూ.16 కోట్ల విలువైన ఇంజెక్షన్‌ అవసరమని, అందుకు క్రౌడ్‌ ఫండింగ్‌ చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, పార్టీ తరఫున కూడా సాయం చేస్తామని హామీ ఇచ్చారు. రాజమహేంద్రవరానికి చెందిన ప్రీతమ్, గాయత్రి దంపతుల కుమార్తె హితైషి ఎస్‌ఎంఏ వ్యాధితో బాధపడుతోంది. కూర్చోవడం, తినడం, శ్వాసతీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ చిన్నారి తల్లిదండ్రులతో కలిసి పార్టీ కేంద్ర కార్యాలయంలో పల్లా శ్రీనివాసరావు ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. www.impactguru.com ద్వారా సాయం అందించాలని దాతలను ఆయన కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని