Nimmala Ramanaidu: పట్టిసీమను జగన్‌ ఒట్టిసీమ అన్నారు.. ఇప్పుడదే బంగారమైంది: మంత్రి నిమ్మల

దేశాన్ని కరవు రహితంగా మార్చాలంటే నదుల అనుసంధానమే మార్గమని ఏపీ జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.

Updated : 03 Jul 2024 13:40 IST

కొయ్యలగూడెం గ్రామీణం: దేశాన్ని కరవు రహితంగా మార్చాలంటే నదుల అనుసంధానమే మార్గమని ఏపీ జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది సీఎం చంద్రబాబేనని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుతోనే నదుల అనుసంధానం సాకారమన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా డెల్టాకు సాగు, తాగునీటిని మంత్రి విడుదల చేశారు. 4, 5, 6 పంపుల ద్వారా 1,050క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టారు. అక్కడ యంత్రాలు, మోటార్లకు పూజలు నిర్వహించారు. అనంతరం పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ఛాయాచిత్ర ప్రదర్శనను మంత్రి పరిశీలించారు. 

అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే వృథా నీటిని అరికట్టవచ్చన్నారు. ‘‘ముంపు మండలాలను తెలంగాణ నుంచి ఆంధ్రాకు బదిలీ చేయించడం చంద్రబాబు ముందుచూపునకు నిదర్శనం. పట్టిసీమ ద్వారా ఏటా 80 టీఎంసీల నీటి వినియోగం జరుగుతోంది. గతంలో పట్టిసీమను జగన్‌ ఒట్టిసీమ అన్నారు.. ఇప్పుడు అదే బంగారమైంది. కృష్ణా డెల్టాకు తాగు, సాగునీరు అందుతుందంటే అది పట్టిసీమ పుణ్యమే. తాగునీటి వ్యవస్థను జగన్‌ విధ్వంసం చేశారు. పట్టిసీమ నీటిని విడుదల చేయకపోతే లక్షలాది మంది దాహార్తిని ఎలా తీరుస్తారు?ఒక్క చుక్క నీటినీ వృథా చేయొద్దని సీఎం చెప్పారు. 

తాడిపూడి నుంచి 1.50లక్షల ఎకరాలకు సాగునీరందిస్తున్నాం. ఏలేరు రిజర్వాయర్‌లో నీరుంటే స్టీల్‌ప్లాంట్‌, విశాఖకు తాగునీరు అందుతుంది. ఏలేరులో నీటి నిల్వకు ప్రయత్నం చేస్తున్నాం. ఒకే రోజు నాలుగు పథకాల ద్వారా నీటిని విడుదల చేయడం చరిత్ర. అధికారులతో సమన్వయం చేసుకుని నీటి నిర్వహణ సమర్థంగా చేపడుతున్నాం. పోలవరం ఫలాలు పట్టిసీమ ద్వారా కొంతమేర కృష్ణా డెల్టాకు అందుతున్నాయి’’ అని రామానాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఐటీడీఏ పీవో సూర్యతేజ తదితరులు పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని