AP Exit Polls 2024: కూటమి ఖాయం

ఇటీవలి కాలంలో 95%పైగా కచ్చితత్వంతో విశ్వసనీయ సర్వే సంస్థగా పేరొందిన ‘యాక్సిస్‌ మై ఇండియా’ ఎగ్జిట్‌ పోల్‌ కూడా ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిదే అధికారమని తేల్చింది!

Updated : 03 Jun 2024 07:56 IST

ఆంధ్రా అసెంబ్లీపై ‘ఇండియా టుడే-యాక్సిస్‌ మై ఇండియా’ ఎగ్జిట్‌పోల్‌
ఎన్డీయేకు 98-120 సీట్లు.. వైకాపాకు 55-77
యువత, విద్యావంతులు, పట్టణవాసుల్లో అధికశాతం కూటమి వైపే
ఈనాడు - అమరావతి

ఇటీవలి కాలంలో 95%పైగా కచ్చితత్వంతో విశ్వసనీయ సర్వే సంస్థగా పేరొందిన ‘యాక్సిస్‌ మై ఇండియా’ ఎగ్జిట్‌ పోల్‌ కూడా ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిదే అధికారమని తేల్చింది! ‘ఇండియా టుడే’ ఆధ్వర్యంలో చేసిన ఈ సర్వే ఆంధ్రప్రదేశ్‌లో అధికార మార్పిడి ఖాయమని స్పష్టం చేసింది. శనివారం లోక్‌సభ ఎగ్జిట్‌ పోల్స్‌ను వెల్లడించిన ఈ సంస్థ... ఆదివారం ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల అంచనాలనూ తెలిపింది. లోక్‌సభ ఎన్నికల్లో కూటమిదే విజయమన్న ఈ సర్వే.. అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే ఒరవడి కొనసాగుతున్నట్లు అంకెలు సహా ప్రకటించింది. ఎన్డీయే కూటమి 51% ఓట్లతో 98-120 స్థానాల్లో గెలుస్తుందని, వైకాపా 44% ఓట్లతో 55-77 స్థానాలకు పరిమితమవుతుందని అంచనా వేసింది. కాంగ్రెస్‌ 2% ఓట్లతో 0-2 సీట్లలో గెలుపొందే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే మెజారిటీ ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ దాదాపుగా ఇదే సరళిని అంచనా వేసిన సంగతి తెలిసిందే.

గత ఎన్నికలతో పోలిస్తే వైకాపా 85 స్థానాలు కోల్పోతుందని.. ఆ మేరకు స్థానాలు ఎన్డీయేకు వస్తాయని ‘ఇండియా టుడే-యాక్సిస్‌ మై ఇండియా’ సర్వే అంచనా వేసింది. తెదేపా 78-96 స్థానాల్లో జనసేన 16-18 స్థానాల్లో, భాజపా 4-6 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలున్నాయంది. పథకాలు 22%, ప్రభుత్వ పనితీరు 9%, అభివృద్ధి 18%, పార్టీ అనుకూలత 12% ఈసారి పోలింగ్‌లో ప్రభావం చూపాయని తెలిపింది.

  • ఎన్టీయే కూటమికి పురుషులు 54%, మహిళలు 48%.. వైకాపాకు పురుషులు 41%, మహిళలు 47% మంది మద్దతు పలికారని సర్వే వెల్లడించింది. గత ఎన్నికలతో పోల్చిచూస్తే పురుషుల్లో 10%, మహిళల్లో 2% ఓట్లను వైకాపా కోల్పోయే అవకాశం ఉందంది.
  • 18-25 ఏళ్ల యువతలో 57% మంది ఎన్డీయేకు మద్దతివ్వగా.. వైకాపాకు 39% మందే మొగ్గు చూపారు. 26-35 ఏళ్లవారిలో 52% ఎన్డీయేకు, 43% వైకాపాకు మద్దతిస్తున్నారు. 36-50 ఏళ్లవారిలో 49% ఎన్డీయేకు, 46% వైకాపాకు ఓట్లేశారు. 61 ఏళ్ల పైబడిన వారిలో వైకాపాకు 49%, ఎన్డీయేకు 46%మద్దతు పలికారని సర్వే వెల్లడించింది.
  • పట్టభద్రుల్లో 56%, వృత్తినైపుణ్యం కలిగిన పట్టభద్రుల్లో 58%, పదోతరగతి ఉత్తీర్ణులైన వారిలో 52% ఎన్డీయే వైపు మొగ్గుచూపారు.
  • మాల, మాదిగ వర్గాల్లో 3% చొప్పున.. ఎస్టీ వర్గాల్లో 11% ఎన్డీయే ఓటుబ్యాంకు పెరిగింది. ముస్లింలలో 11% ఓట్లు కూటమికి పడ్డాయి. ఓబీసీ, యాదవుల్లో 8%, కమ్మ సామాజికవర్గంలో 4%, కాపులలో 11% రెడ్డి, ఇతరుల్లో 5% ఓటుబ్యాంకు గతంతో పోలిస్తే కూటమికి పెరిగింది.


జగన్‌ను దెబ్బతీయనున్న అంశాలివీ.. 

ఓట్లు, సీట్ల అంచనాలతో పాటు... రాష్ట్ర ప్రజల మనోగతంపైనా ఈ సర్వే దృష్టిసారించింది. గెలుపోటములను నిర్దేశించే అంశాలను విశ్లేషించింది. దాని ప్రకారం జగన్‌ను తీస్తాయనుకుంటున్న ప్రధాన అంశాలివీ...

రాష్ట్రంపై అప్పుల భారం.. కనిపించని అభివృద్ధి

జగన్‌ సారథ్యంలోని వైకాపా అయిదేళ్ల పాలనలో ఆర్థిక అవరోధాలే ప్రధాన అడ్డంకిగా మారాయి. అడ్డగోలుగా అప్పులు తీసుకొచ్చి రాష్ట్ర రుణాలను రూ.13 లక్షలకుపైగా కోట్లకు తీసుకెళ్లారు. వీటిల్లో అధికశాతం నవరత్నాల అమలు కోసమే వినియోగించారు. మౌలిక వసతులను మెరుగుపర్చడంలో సర్కారు ఘోరంగా విఫలమైంది. విద్యుత్తు సరఫరాలో ఎడాపెడా కోతలు, తాగునీటి కొరత, అధిక విద్యుత్తు ఛార్జీలు, నిత్యావసరాల ధరల పెరుగుదల ప్రతికూలంగా మారాయి. నిరుద్యోగిత పెరిగి ఆశావహుల్లో అసహనం మూటగట్టుకుంది.

గందరగోళంగా అభ్యర్థుల ఎంపిక: ఆర్థిక అంశాలు, పథకాల అమలులో వైఫల్యం తదితరాలన్నీ ఒకెత్తయితే.. అసెంబ్లీ, లోక్‌సభకు అభ్యర్థుల ఎంపిక అంతకుమించి దెబ్బతీసింది. ప్రజల్లో వ్యతిరేకత పేరిట నియోజకవర్గ అభ్యర్థులను ఇష్టానుసారం మార్చేశారు. పలువురు సిటింగ్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలకు మరోసారి పోటీచేసే అవకాశం కల్పించలేదు. ఈ మార్పులు పార్టీ ద్వితీయశ్రేణి నేతలు, కార్యకర్తల్లో గందరగోళానికి కారణమయ్యాయి. వారిలో గూడుకట్టుకున్న ఆ అసంతృప్తే ఎన్నికల్లో ప్రతిపక్ష నేతలకు సహకరించేలా పురిగొల్పింది. 

చంద్రబాబుపై సానుభూతి: అధికారంలో ఉన్నప్పుడు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో అవినీతికి పాల్పడినట్లు అభియోగాలు మోపి, మాజీ సీఎం చంద్రబాబునాయుడును అరెస్టు చేసి జైలుకు పంపించడం ప్రజల్లో ఆయన పట్ల సానుభూతిని తీసుకొచ్చింది. బాబు అరెస్టుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన నిరసన కార్యక్రమాలతో శ్రేణులు ఉత్తేజితమయ్యాయి. అరెస్టు అక్రమ మంటూ వివిధ వర్గాల నుంచి చంద్రబాబుకు విశేష మద్దతు లభించింది. ఈ క్రమంలో గతంలో ఆయన చేపట్టిన అభివృద్ధిపై చర్చ జరిగేలా చేశాయి. ‘యువగళం’ పేరిట నారా లోకేశ్‌ చేపట్టిన పాదయాత్ర కూడా పార్టీకి కలిసొచ్చింది.

పవన్‌ కరిష్మా.. అధికార భాజపా అండ..: ఎగ్జిట్‌ పోల్‌ ప్రకారం రాష్ట్రంలో తెదేపా అతిపెద్ద పార్టీగా అవతరించిందంటే దానికి ప్రధాన కారణం కూటమిగా ఏర్పడటం. పవన్‌ కల్యాణ్‌ క్రేజ్‌తోపాటు యూత్‌లో ఆయనకున్న ఫాలోయింగ్‌.. ఎన్డీయే నేతల ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కించింది. వైకాపా ఎత్తుగడలను చిత్తు చేస్తూ.. సభలకు జనాలను విశేషంగా రప్పించడంలో కలిసొచ్చింది. చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు సంఘీభావం తెలిపిన పవన్‌.. బయటకు వచ్చిన వెంటనే కూటమిగా ముందుకెళ్లనున్నట్లు ప్రకటించడం చారిత్రక నిర్ణయం. సామాజిక సమీకరణాలను ఇది మార్చింది. భాజపా అధికార బలం కూడా పోలింగ్‌ పరంగా సానుకూల వాతావరణం కల్పించింది.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు