Payyavula: నిబంధనల ప్రకారం.. జగన్‌ ప్రతిపక్ష నేత కాలేరు

‘వైకాపా నాయకుడు జగన్‌కు ప్రజలు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు. ఏ పార్టీలూ ఎవరికీ ప్రతిపక్ష హోదా ఇవ్వవు. ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలి అనేది ప్రజలే నిర్ణయిస్తారు.

Updated : 27 Jun 2024 06:53 IST

ఆ హోదా ఇచ్చేది ప్రజలు.. పార్టీలు కాదు
శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్‌

ఈనాడు, అమరావతి: ‘వైకాపా నాయకుడు జగన్‌కు ప్రజలు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు. ఏ పార్టీలూ ఎవరికీ ప్రతిపక్ష హోదా ఇవ్వవు. ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలి అనేది ప్రజలే నిర్ణయిస్తారు. ఆయన స్పీకర్‌కు రాసిన లేఖ విన్నవించినట్లుగా లేదు. బెదిరింపు ధోరణితో రాసినట్లుంది. ఏ నిబంధన ప్రకారం చూసినా.. వైకాపాకు ప్రతిపక్ష హోదా రాదు. అన్ని రాష్ట్రాల శాసనసభలు, పార్లమెంటరీ సంప్రదాయాలు, గతంలో స్పీకర్లు ఇచ్చిన మార్గదర్శకాలను పరిశీలించినా ఇదే స్పష్టమవుతుంది’ అని రాష్ట్ర శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్‌ స్పష్టం చేశారు. ‘జగన్‌ ఎప్పుడూ ఎక్సైజ్, ఇసుక ఎకౌంట్‌ పుస్తకాలు మాత్రమే చదివితే సరిపోదు. పార్లమెంటరీ సంప్రదాయాలు, శాసనసభ నిబంధనలు చదవాలి. గతంలో లోక్‌సభకు స్పీకర్లుగా వ్యవహరించిన వారు ఇచ్చిన అనేక మార్గదర్శకాలను పుస్తకాల రూపంలో వెలువరించారు. అవి కూడా చదవాలి. అప్పుడే నిబంధనలు తెలుస్తాయి’ అని సలహా ఇచ్చారు. వెలగపూడి సచివాలయంలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. శాసన సభాపతికి జగన్‌ లేఖ రాయడం, తదనంతర పరిణామాలపై విలేకరులు ప్రశ్నించగా తన స్పందన తెలియజేశారు. 

సలహాదారులను మార్చుకోవాలి

‘శాసన సభాపతికి జగన్‌ రాసిన లేఖను పరిశీలిస్తే ప్రజలిచ్చిన తీర్పును ఆయన ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారని అర్థమవుతోంది. రాష్ట్రంలో జీతాలు, భత్యాలు, పెన్షన్లు ఇచ్చే చట్టం ప్రకారం ప్రతిపక్ష హోదా వస్తుందని జగన్‌కు ఎవరు సలహా ఇచ్చారో తెలియదు. ఇప్పటి వరకు ఉన్న సలహాదారుల వల్ల ఆయన ఈ స్థాయికి వచ్చారు. మళ్లీ అలాంటి వారి మాట వింటే ఎక్కడివరకు వెళ్తారో తెలుసుకోవాలి. ఒకవేళ జగన్‌ ఆలోచనతోనే ఈ లేఖ రాసి ఉంటే.. తన ఆలోచనా విధానం మార్చుకొని, ప్రజలిచ్చిన తీర్పును గౌరవించాలి.

  • ప్రతిపక్ష హోదాను నిర్ణయించే సూత్రాలు స్పష్టంగా ఉన్నాయి. లోక్‌సభ మొదటి స్పీకర్‌ ఇందుకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలు ఇచ్చారు. కావాలంటే ఆ పుస్తకం పంపిస్తా. చదవండి. మొత్తం శాసనసభ సభ్యుల్లో పదిశాతం మంది ఆ పార్టీకి ఉంటేనే ప్రతిపక్ష హోదా దక్కుతుంది. దీన్నే దేశమంతా పాటిస్తున్నారు.
  • మంత్రుల కన్నా ముందే ప్రతిపక్ష నాయకుడు ప్రమాణ స్వీకారం చేయాలని జగన్‌ స్పీకర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. జగన్‌ ప్రతిపక్ష నాయకుడు కాదు. కేవలం ఆ పార్టీకి నాయకుడు. ఫ్లోర్‌ లీడర్‌ అవుతారు.
  • గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్‌ తాను చిటికేస్తే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని ఇదే శాసనసభ సాక్షిగా అనేకసార్లు చెప్పారు. ఆయన ఎన్నిసార్లు చిటికెలు వేసినా.. చంద్రబాబు వెనకున్నవారు ఎవరూ ఎక్కడికీ వెళ్లలేదు. ఆయన మాటలను బట్టి ప్రతిపక్ష హోదా ఉండాలంటే ఎంతమంది పార్టీ ఎమ్మెల్యేలు ఉండాలో తెలుసని అర్థమవుతోంది. మరి ఈ రోజు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు?
  • 1984లో ఉపేంద్రను కేవలం తెదేపా పార్లమెంటరీ నాయకుడిగానే పార్టీ నిర్ణయించింది. అప్పుడు కేవలం ఆయన్ను ఫ్లోర్‌ లీడర్‌గానే గుర్తించారు.
  • 1994లో ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి శాసనసభలో జనార్దనరెడ్డిని ప్రతిపక్షనాయకుడిగా గుర్తించారు. అది కూడా తప్పు. ఆయన కాంగ్రెస్‌ ఫ్లోర్‌ లీడర్‌ మాత్రమే.
  • 2004లో చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడు. తెరాస తరఫున విజయరామారావు ఫ్లోర్‌ లీడర్, నోముల నర్సింహయ్య (సీపీఎం), చాడ వెంకటరెడ్డి (సీపీఐ), అక్బరుద్దీన్‌ ఒవైసీ (ఎంఐఎం), కిషన్‌రెడ్డి (భాజపా), కె.రాములు (జనతా పార్టీ), రాజారావు (బీఎస్పీ), డి.కె.అరుణ (సమాజ్‌వాదీ)లు ఫ్లోర్‌ లీడర్లు మాత్రమే.
  • లోక్‌సభలో పదేళ్లుగా కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. వారికి ప్రతిపక్ష నాయకుడిగా అవకాశం ఇవ్వలేదు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా దక్కింది. అందుకు పదేళ్లు పట్టింది. 
  • ప్రస్తుతం వైకాపాకే కాదు జనసేన, భాజపాలకు కూడా సభలో ఫ్లోర్‌ లీడర్లు ఉంటారు.
  • మీరు ప్రజల తరఫున పోరాటం చేయండి. ప్రజలు గుర్తిస్తే పదేళ్ల తర్వాత ప్రతిపక్ష హోదా దక్కొచ్చు. లేఖలు రాసి స్పీకర్‌ను, పార్టీలను బెదిరిస్తేనో, ప్రజల తీర్పును తప్పుపడితేనో అది రాదు.
  • మేం ప్రజలకు జవాబుదారీ. సభను హుందాగా నడపాలనుకుంటున్నాం. ఆయన ఓపిగ్గా సభకు వస్తే ప్రతిపక్ష సభ్యుడిగా మాట్లాడే అవకాశం వస్తుంది. 
  • జగన్‌ ఏదో వంక పెట్టి సభకు హాజరుకాకుండా ఉండాలని.. ప్రజల నుంచి ఏదోలా సానుభూతి పొందాలని చూస్తున్నారని తెలిసింది’ అని కేశవ్‌ వివరించారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని