డాలస్‌లో మహాత్మా గాంధీ స్మారకం వద్ద అంతర్జాతీయ యోగా వేడుకలు

అమెరికాలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ స్మారకస్థలం వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఆదివారం ఉత్సాహంగా జరిగాయి.

Published : 26 Jun 2024 16:15 IST

డాలస్, టెక్సాస్: అమెరికాలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ స్మారకస్థలం వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఆదివారం ఉత్సాహంగా జరిగాయి. గౌరవ కాన్సుల్ జనరల్ అఫ్ ఇండియా, డి. సి. మంజునాథ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయనకు మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంజునాథ్‌ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ పదేళ్ల క్రితం ఐక్యరాజ్య సమితిలో ఇచ్చిన పిలుపు మేరకు ఏటా జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా పాటించడం ముదావహమన్నారు. అనునిత్యం యోగాభ్యాసం చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని తెలిపారు.

పదేళ్లుగా మహాత్మాగాంధీ స్మారకస్థలి వద్ద అంతర్జాతీయ యోగాదినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు ప్రసాద్‌ తోటకూర అన్నారు. ఏటా హాజరవుతున్న వారి సంఖ్య పెరుగుతోందని, ఇది కేవలం ఒక రోజు వేడుక కాకూడదన్నారు. అన్ని కార్పొరేట్‌, విద్యా సంస్థల్లో ప్రతి రోజూ యోగాభ్యాసం చేసే విధాన నిర్ణయాలు తీసుకొని అందుకు తగిన ఏర్పాట్లు చేస్తే అందరూ శారీరక, మానసిక ఆరోగ్యంతో సత్ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. మహత్మాగాంధీ మెమోరియల్ బోర్డ్ సభ్యులందరితో కలసి ప్రసాద్‌ తోటకూర గౌరవ కాన్సుల్ జనరల్‌ ఆఫ్‌ ఇండియా, డి.సి.మంజునాథ్‌కు మహాత్ముడి చిత్రపటాన్ని బహూకరించి ఘనంగా సన్మానించారు. 

తొలుత మహాత్మాగాంధీ మెమోరియల్ కార్యదర్శి రావు కల్వాల సభను ప్రారంభించి ముఖ్య అతిథి, బోర్డుసభ్యులు, ఈ వేడుకల్లో పాల్గొన్న అందరికీ స్వాగతం పలికారు. ఇండియా అసోసియేషన్ అఫ్ నార్త్ టెక్సాస్ అధ్యక్షురాలు, మహాత్మాగాంధీ మెమోరియల్ బోర్డు సభ్యురాలు సుష్మా మల్హోత్రా క్రమక్రమంగా యోగా వేడుకలలో పాల్గొంటున్న వారి సంఖ్య పెరుగుతోందని, ఈ ఏడాది డి.ఎఫ్.డబ్ల్యు హిందూ టెంపుల్, యోగ భారతి, హార్డ్‌ఫుల్‌నెస్‌, ఈషా, ది యూత్ ఎక్స్‌లెన్స్‌ లాంటి సంస్థలు తమ సభ్యులతో కలసి పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.  మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, బోర్డు సభ్యులు రావు కల్వాల, జాన్ హామండ్, రన్నా జానీ, మురళీ వెన్నం, సుష్మా మల్హోత్రా, కమల్ కౌశల్, రాజీవ్ కామత్, బి. ఎన్. రావు,  ఇండియా అసోసియేషన్ అఫ్ నార్త్ టెక్సాస్ కార్యవర్గ సభ్యులు మహేందర్ రావు, దినేష్ హూడా, ఉర్మీత్ జునేజా, దీపక్ కాల్ రా, ఆమన్ సింగ్, అమిత్ బూచె, సమర్నిక రౌత్ తదితరులు ఏర్పాట్లలో భాగస్వాములై యోగా వేడుకల విజయవంతానికి కృషి చేశారు. విశాల మైదానంలో రెండు గంటలకు పైగా సాగిన ఈ యోగా వేడుకల్లో అన్ని వయసుల వారు ఉత్సాహంగా పాల్గొని యోగాసనాలు వేశారు. అనంతరం ‘పీకాక్‌ ఇండియా రెస్టారంట్‌’ వారు ఏర్పాటు చేసిన ఫలాహారాలను ఆస్వాదించి ఆనందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని