Ramoji Rao: డాలస్‌లో పద్మవిభూషణ్ రామోజీరావుకు ఘన నివాళి

రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌, అక్షర యోధుడు, పద్మవిభూషణ్ రామోజీరావుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్‌) ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు.

Published : 21 Jun 2024 15:04 IST

డాలస్, టెక్సాస్: రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌, అక్షర యోధుడు, పద్మవిభూషణ్ రామోజీరావుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్‌) ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. డాలస్‌లో ఏర్పాటుచేసిన సంతాప కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరైన ప్రవాసాంధ్రులు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి వివిధ రంగాల్లో ఆయన అందించిన విశేష సేవల్ని స్మరించుకున్నారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రముఖ రచయిత, నటుడు, దర్శకుడు తనికెళ్ళ భరణి మాట్లాడుతూ.. ‘‘రామోజీరావు ఒక విశిష్టమైన వ్యక్తి.  ఏ రంగంపై ఆయన దృష్టిపెట్టినా అందులో పూర్తిగా నిమగ్నమయ్యేవారు. ప్రతిభకు అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. వ్యక్తిగతంగా ఆయనతో అనేక అనుభవాలున్నాయి. తెలుగు భాష అంటే ఆయనకు ప్రాణం. సంగీత, సాహిత్య వికాసం కోసం నిరంతరం కృషి చేసిన కృషీవలుడు. చివరకు మరణాన్ని సైతం చిరునవ్వుతో ఆహ్వానించిన ధీరోదాత్తుడు” అని కొనియాడారు.

తానా పూర్వ అధ్యక్షులు డా.ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. ఒక చిన్న గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించి ఎవరూ ఊహించలేనంత ఎత్తుకు ఎదిగిన రామోజీరావు జీవితం కేవలం తెలుగువారికే కాకుండా విశ్వవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఒక సందర్భంలో రామోజీరావును ప్రత్యేకంగా కలిసి గంటకు పైగా ఆయనతో జరిపిన సంభాషణ తన జీవితంలోనే ఒక మధురమైన అనుభూతి అని గుర్తు చేసుకున్నారు. రామోజీరావు జీవన ప్రస్థానంలో సాగిన కృషి, పట్టుదల, క్రమశిక్షణ, దూరదృష్టి తరతరాలకు ఆదర్శప్రాయమన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా తలవంచకుండా ధైర్యంగా ఎదుర్కొన్నారని, ఆశయ సాధనే లక్ష్యంగా ఆయన పని తీరు అన్నిరంగాల వారికీ అనుసరణీయమన్నారు.

రామోజీరావుకు నివాళులర్పించేందుకు ఏర్పాటుచేసిన సభలో తనికెళ్ళ భరణి, కళారత్న కేవీ సత్యనారాయణ, సుప్రసిద్ధ కవి డా.వడ్డేపల్లి కృష్ణ, ప్రముఖ దర్శకులు వీఎన్‌ ఆదిత్య, రచయిత సాయి లక్కరాజు, ఆధ్యాత్మికవేత్త శ్రీనివాస చక్రవర్తి తట్టా, ప్రముఖ కళాకారుడు చంద్రశేఖర్, తేజస్వి సుధాకర్ ప్రత్యేకంగా విచ్చేశారు. వీరితో పాటు తానా పూర్వాధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, టాంటెక్స్‌ అధ్యక్షులు సతీష్ బండారు, టాంటెక్స్‌ పాలకమండలి అధిపతి సురేష్ మండువ, టాంటెక్స్‌ తెలుగు సాహిత్యవేదిక సమన్వయకర్త దయాకర్ మాడా, వివిధ తెలుగు సంఘాల ప్రతినిధులు - చంద్రశేఖర్ రెడ్డి పొట్టిపాటి, మాధవి లోకిరెడ్డి, దీపికా రెడ్డి, అర్పితా రెడ్డి, కళ్యాణి తాడిమేటి, చైతన్య రెడ్డి గాదె, రఘునాథ రెడ్డి, నరసింహ పోపూరి, వీర లెనిన్ తుళ్ళూరి, శ్రీకాంత్ పోలవరపు, శ్రీనాథ్ వట్టం, ప్రవీణ్ బిల్లా, మురళీ వెన్నం, పరమేష్ దేవినేని, సుబ్బు జొన్నలగడ్డ, అనంత్ మల్లవరపు, శారద సింగిరెడ్డి, లెనిన్ వేముల, డా. ఊరిమిండి నరసింహారెడ్డి, ఎం.వి.ఎల్ ప్రసాద్, డా.పూదూర్ జగదీశ్వరన్, డా. పులిగండ్ల విశ్వనాథం, డా. రమణ జువ్వాడి, చంద్రహాస్ మద్దుకూరి తదితరులు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని