The GOAT: ‘ది గోట్‌’.. ఫ్యాన్స్‌ ఖుష్ అయ్యే అప్‌డేట్‌ ఇచ్చిన మ్యూజిక్‌ డైరెక్టర్‌

విజయ్‌ హీరోగా తెరకెక్కుతోన్న ‘ది గోట్‌’ అప్‌డేట్‌ను మ్యూజిక్‌ డైరెక్టర్‌ యువన్‌ శంకర్‌ రాజా షేర్‌ చేశారు. దీంతో అభిమానులు ఆనందిస్తున్నారు.

Published : 27 May 2024 15:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కోలీవుడ్‌ స్టార్‌ విజయ్‌ (Vijay) హీరోగా వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ది గోట్‌’(ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌). ఈ సినిమా వరుస అప్‌డేట్‌లతో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. తాజాగా దీని సంగీత దర్శకుడు యువన్‌ శంకర్‌ రాజా ఓ మ్యూజికల్‌ అప్‌డేట్‌ను పంచుకున్నారు. దీంతో విజయ్‌ ఫ్యాన్స్‌ ఆనందిస్తున్నారు.

ఓ ఈవెంట్‌లో పాల్గొన్న యువన్‌ శంకర్‌ ‘ది గోట్‌’ పాటల అప్‌డేట్‌ ఇచ్చారు. ‘విజయ్‌ ఈ సినిమా కోసం రెండు పాటలు పాడారు. ఒకే సినిమాలో ఆయన రెండు పాటలు పాడడం ఇదే తొలిసారి’ అని చెప్పారు. తన సినిమాల్లో విజయ్‌ పాడడం ఇదేం తొలిసారి కాదు గతంలో తన సినిమాల కోసం ఇప్పటివరకు 25 పాటలు పాడారు. 1994లో విడుదలైన ‘రసిగన్‌’ కోసం మొదటిసారి పాడిన విజయ్‌ ఆ తర్వాత సినిమాల్లో ఎన్నో పాటలు పాడారు. 2012లో ‘తుపాకీ’లో ‘గూగుల్‌ గూగుల్‌’ పాటకు ‘ఫేవరెట్‌ సాంగ్ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డును కూడా గెలుచుకున్నారు. ఇప్పటివరకు తన చిత్రాల్లో ఒక్కో పాట పాడిన విజయ్‌ దీనికి మాత్రం రెండు పాటలు పాడడం విశేషం. ఇక తాజాగా ‘ది గోట్‌’లో విజయ్‌ పాడిన ‘విజిల్‌ పోడు’ లిరికల్‌ సాంగ్‌ను ఇటీవల విడుదల చేయగా అది మంచి ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో కోట్ల వ్యూస్‌తో ట్రెండింగ్‌లో నిలిచింది.

మే చివరి వారం.. థియేటర్‌లో అలరించే చిత్రాలివే.. మరి ఓటీటీలో..?

‘ది గోట్‌’ విషయానికొస్తే.. ఈ చిత్రంలో విజయ్‌ కోసం ప్రత్యేకంగా ‘డీ-ఏజింగ్‌ టెక్నాలజీ’ వాడారు. ఈ టెక్నాలజీతో ఆయన్ని పాతికేళ్ల కుర్రాడిలా చూపించనున్నారు. విజువల్‌ ఎఫెక్ట్‌ పనులు కూడా ఇటీవలే పూర్తయ్యాయి. అమెరికాలోని లాస్‌ఏంజెలిస్‌లోని స్టూడియోలో ‘అవతార్‌’, ‘అవెంజర్స్‌’ లాంటి హాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌కి పనిచేసిన సాంకేతిక నిపుణులు ‘ది గోట్‌’ కోసం వర్క్‌ చేశారు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుండగా.. స్నేహ, లైలా, ప్రశాంత్‌, ప్రభుదేవా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్టైలిష్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ముస్తాబవుతోన్న ఈ చిత్రం సెప్టెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకురానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని