Anna Ben: ‘కల్కి 2898 ఏడీ’లో మలయాళ నటి.. ఎవరీ అన్నా బెన్‌?

‘కల్కి 2898 ఏడీ’లో కీలక పాత్ర పోషించిన అన్నా బెన్‌ గురించి పలు ఆసక్తికర విషయాలు..

Updated : 21 Jun 2024 11:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) విడుదల సమయం సమీపిస్తుండడంతో చిత్రబృందం ప్రచారాన్ని వేగవంతం చేసింది. ఓవైపు వేడుకలు నిర్వహిస్తూ మరోవైపు.. సినిమాలో కీలక పాత్రలు పోషించిన వారి లుక్స్‌ను సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటోంది. ఈ క్రమంలోనే ‘ది లక్కీ రెబల్‌’ అంటూ కైరా క్యారెక్టర్‌ ప్లే చేసిన నటిని గురువారం సాయంత్రం ప్రత్యేకంగా పరిచయం చేసింది. దీంతో, ఆమె గురించి తెలుసుకునేందుకు చాలామంది నెట్టింట తెగ వెతికేస్తున్నారు. ఇంతకీ ఎవరీ యాక్ట్రెస్‌..?

తొలి ప్రయత్నంలోనే విజయం..

ఈ మలయాళ నటి ‘కల్కి’లోని ఓ పాత్రకు ఎంపికైనట్టు చాలా తక్కువమందికి తెలుసు. తాజా పోస్టర్‌తో ఆమె పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆమె.. అన్నా బెన్‌ (Anna Ben). కొచ్చికి చెందిన బెన్‌ అక్కడే ‘ఫ్యాషన్‌ అండ్‌ అపెరల్‌ డిజైనింగ్‌’లో పట్టా పొందారు. తన తండ్రి స్క్రీన్‌ రైటర్‌ బెన్నీ పి. నాయరాంబలం. మలయాళంతోపాటు తమిళ్‌ చిత్ర పరిశ్రమలో పనిచేశారాయన. సినీ నేపథ్య కుటుంబం కావడంతో అన్నాకు బాల్యంలోనే నటనపై ఆసక్తి కలిగింది. చదువు పూర్తయిన అనంతరం.. మలయాళ సినిమా ‘కుంబలంగి నైట్స్‌’ (2019)తో తెరంగేట్రం చేశారు. ఉత్తమ పరిచయ నటిగా ‘సైమా’, ‘కేరళ స్టేట్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌’ సహా పలు పురస్కారాలు అందుకున్నారు. కమర్షియల్‌గానూ ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత ‘హెలెన్‌’, ‘కప్పేలా’, ‘నారదన్‌’, ‘నైట్‌ డ్రైవ్‌’, ‘కాపా’ వంటి విభిన్న కథా చిత్రాల్లో నటించారు. సోషల్‌ డ్రామా థ్రిల్లర్‌గా తెరకెక్కి, సక్సెస్‌ అయిన ‘కప్పేలా’.. తెలుగులో ‘బుట్టబొమ్మ’గా రీమేక్‌ అవగా అందులో అనికా సురేంద్రన్‌ నటించారు.

కోలీవుడ్‌, టాలీవుడ్‌ ఎంట్రీ ఇలా..

చేసింది తక్కువ సినిమాలే అయినా అన్నింటిలోనూ తనదైన ముద్ర వేసుకొంది ఈ కేరళ అందం. ప్రతీ సినిమాకి ఏదో ఒక అవార్డు సొంతం చేసుకోవడం ఆమెకు అలవాటుగా మారింది. ఈ బ్యూటీ నటించిన ‘కొట్టుక్కాళి’ చిత్రం 74వ బెర్లిన్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శితమవడం విశేషం. ఆమె నటించిన తొలి తమిళ్‌ సినిమా ఇదే. ఇప్పుడు ‘కల్కి’తో తెలుగు ఆడియన్స్‌ను నేరుగా పలకరించనున్నారు. ‘‘దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ‘కల్కి’ గురించి చెప్పగానే ఎంతో ఆనందించా. ఇప్పటివరకూ నేను సైన్స్‌ ఫిక్షన్‌ సినిమా చేయలేదు. ఆ డ్రీమ్‌ ‘కల్కి’తో నెరవేరింది. ప్రభాస్‌ (Prabhas), అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌ వంటి ప్రతిభావంతులతో కలిసి నటించడం ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకం. ఇందులో నేను పోషించిన పాత్ర చిన్నదే అయినా ప్రేక్షకులపై మంచి ప్రభావం చూపుతుంది’’ అని ఓ ఇంటర్వ్యూలో ఆశాభావం వ్యక్తంచేశారు. 

ఈ పాన్‌ ఇండియా మూవీలో దీపికా పదుకొణె, దిశా పటానీ, రాజేంద్ర ప్రసాద్‌, శోభన ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాని 27న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం ఈ రోజు సాయంత్రం రెండో ట్రైలర్‌ను (Kalki second trailer) విడుదల చేయనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని