Indian 2: సేనాపతికి అప్పుడు 75.. ఇప్పుడు 103.. లాజిక్‌ ఏంటో చెప్పిన శంకర్‌

భారతీయుడు2లో కమల్‌హాసన్‌ వయసు విషయంలో జరుగుతున్న చర్చకు దర్శకుడు శంకర్‌ వివరణ ఇచ్చారు.

Updated : 28 Jun 2024 10:05 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కమల్‌ హాసన్‌ (Kamal Haasan) కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ ఫిల్మ్‌ ‘భారతీయుడు2’ (Indian 2). 1996లో వచ్చిన ‘భారతీయుడు’ చిత్రానికి సీక్వెల్‌గా రాబోతోంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ జులై 12న తమిళ, తెలుగు భాషలతో పాటు, ఇతర భారతీయ భాషల్లోనూ విడుదల కానుంది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌ సినిమాపై అంచనాలను పెంచింది. అయితే, వృద్ధుడైన సేనాపతి పాత్రలో కమల్‌హాసన్‌ ఫైట్స్‌ చేయడంపై సామాజిక మాధ్యమాల వేదికగా చర్చ నడుస్తోంది. ఎందుకంటే ‘భారతీయుడు’ చిత్రం జరిగే సమయానికి సేనాపతి పాత్రకు వయసు 75ఏళ్లుగా చూపించారు. ఆ లెక్క ప్రకారం 2024కు వచ్చే సరికి ఆ పాత్ర వయసు 103 సంవత్సరాలు. అంత వయసున్న వృద్ధుడు మార్షల్‌ ఆర్ట్స్‌ ఫైట్స్‌ చేయడం సాధ్యమేనా?అన్న ప్రశ్న దర్శకుడు శంకర్‌కు ఎదురైంది. దీనికి వివరణ ఇస్తూ సేనాపతి సాధారణ వ్యక్తిగా చూడొద్దని, సూపర్‌హీరోగా చూడాలంటూ సమాధానం ఇచ్చారు.

‘‘సేనాపతి వృద్ధుడే కావచ్చు కానీ, సూపర్‌మ్యాన్‌. ఈ ప్రశ్న నన్ను చాలా మంది అడిగారు. నేను ఫస్ట్‌ పార్ట్‌ చేసినప్పుడు సీక్వెల్‌ గురించి ఆలోచనే లేదు. కేవలం ఆ ఒక్క చిత్రమే అనుకున్నా. అందుకు తగినట్లుగానే దాన్ని రాసుకున్నా. సేనాపతిని స్వాత్రంత్య సమరయోధుడిగా చూపించాలనుకున్నా. అందుకే అతడి పుట్టిన సంవత్సరాన్ని అందులో చూపించాం. సేనాపతి గురించి పోలీసులు విచారణ చేసే క్రమంలో అతడు పుట్టిన సంవత్సరం ఏంటో తెలుస్తుంది. ఆ విషయం నాకు గుర్తు లేదు. ప్రస్తుతం సేనాపతి చైనాలో మార్షల్‌ ఆర్ట్స్‌ ఫైటర్‌గా కనిపిస్తాడు. అత్యధిక వయసు కలిగిన మార్షల్‌ ఆర్ట్స్‌ ఫైటర్స్‌ అక్కడ ఉన్నారు. లు జిజియన్‌ అనే ఫైటర్‌ వయసు 108 సంవత్సరాలు. ఇప్పటికీ ఆయన యాక్టివ్‌గా ఉన్నారు. గాల్లో ఎగురుతూ కిక్‌ కూడా కొట్టగలరు. అది వారికున్న క్రమశిక్షణ, సాధన వల్ల సాధ్యమైంది. సేనాపతి కూడా అలాంటి వాడే. మర్మకళలో అతడు మాస్టర్‌. అందుకే నేను అతడిని సూపర్‌హీరోగా చూస్తా’ అని శంకర్‌ చెప్పుకొచ్చారు.

‘భారతీయుడు’ కోసం వేసుకున్నట్లే ప్రోస్థటిక్‌ మేకప్‌ వేసుకోవడం విసుగ్గా అనిపించడం లేదా? అని కమల్‌ను ప్రశ్నించగా, ‘సినిమా కథ ఆసక్తిగా లేకపోయినా, దర్శకుడు డిమాండ్‌ చేయకపోయినా అది సాధ్యమయ్యేది కాదు. ఇక ప్రోస్థటిక్‌ మేకప్‌లు వేసుకోవద్దని చాలా సార్లు అనుకునేవాడిని. కానీ, మంచి చిత్రాలు, కథలు రావటం వల్ల మళ్లీ నేను ఆ దిశగా పయనించాల్సి వస్తోంది’ అని కమల్‌ అన్నారు. ‘భారతీయుడు2’లో సిద్ధార్థ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, ఎస్‌జే సూర్య, బాబీ సింహా, దివంగత నటుడు వివేక్‌, ప్రియా భవానీ శంకర్‌, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని