Kalki 2898 AD: ‘కల్కి’ విడుదల.. ఆ విషయంపై పోస్ట్‌ పెట్టిన నిర్మాణ సంస్థ

‘కల్కి’ విడుదల నేపథ్యంలో నిర్మాణ సంస్థ పోస్ట్‌ పెట్టింది. సినిమా సన్నివేశాలను పంచుకోవద్దని తెలిపింది.

Published : 27 Jun 2024 10:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్: నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ (Prabhas) హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ప్రేక్షకుల ముందుకువచ్చింది. అభిమానులతో పాటు సినీప్రియులు విజువల్స్‌కు ఫిదా అవుతూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. ఇక ‘కల్కి’ విడుదల సందర్భంగా పైరసీని ప్రోత్సహించొద్దని కోరుతూ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ పోస్ట్‌ పెట్టింది.

‘ఈ చిత్రం 4 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం. దీనికోసం నాగ్‌అశ్విన్‌తో పాటు చిత్రబృందమంతా ఎంతో కృషి చేసింది. గ్లోబల్‌ స్థాయిలో దీన్ని తెరకెక్కించడం కోసం ఎంతో కష్టపడ్డారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. ఎంతోమంది చెమటను రక్తంగా చిందించి దీన్ని రూపొందించారు. సినిమాను, క్రాఫ్ట్‌ను గౌరవిద్దాం. సినిమా చూసేవాళ్లు సన్నివేశాలను పోస్ట్‌ చేయొద్దు. నిమిషానికి ఒక అప్‌డేట్‌ను పంచుకోవద్దు. పైరసీని ప్రోత్సహించొద్దు. మూవీకి వచ్చే ప్రేక్షకుల ఆసక్తిని తగ్గించొద్దని వినయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాం. సినిమా కంటెంట్‌ను కాపాడుకోవడానికి చేతులు కలుపుదాం. విజయాన్ని కలిసి సెలబ్రేట్‌ చేసుకుందాం’ అని నిర్మాణసంస్థ పేర్కొంది.

‘కల్కి’ మూవీ వెళ్తున్నారా? ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?

ఇక ఈ చిత్రం భారీ తారాగణంతో రూపొందింది. అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan), కమల్‌ హాసన్‌ (Kamal Haasan), దీపికా పదుకొణె (Deepika Padukone), దిశా పటానీ, రాజేంద్ర ప్రసాద్‌, శోభన, మాళవిక నాయర్‌ కీలక పాత్రలు పోషించారు. అతిథి పాత్రల్లో విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan)లు నటించారు. వీరితో పాటు మరికొందరు స్టార్స్‌ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని