Virataparvam: ఆ పాత్ర పోషించినందుకు గర్వపడుతున్నా

‘‘చూసిన ప్రతిసారీ కొత్త అనుభూతిని పంచే చిత్రం ‘విరాటపర్వం’. చూసిన ప్రేక్షకులు అదే మాట చెబుతున్నారు. ఇందులో వెన్నెల పాత్రని పోషించినందుకు గర్వపడుతున్నా’’

Updated : 19 Jun 2022 07:58 IST

- సాయిపల్లవి

‘‘చూసిన ప్రతిసారీ కొత్త అనుభూతిని పంచే చిత్రం ‘విరాటపర్వం’. చూసిన ప్రేక్షకులు అదే మాట చెబుతున్నారు. ఇందులో వెన్నెల పాత్రని పోషించినందుకు గర్వపడుతున్నా’’ అన్నారు సాయిపల్లవి. ఆమె కథానాయికగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విరాటపర్వం’. రానా దగ్గుబాటి కథానాయకుడు. సుధాకర్‌ చెరుకూరి నిర్మాత. సురేష్‌బాబు సమర్పకులు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రానికి లభిస్తున్న ఆదరణపై సంతృప్తిని వ్యక్తం చేస్తూ శనివారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశాన్ని నిర్వహించింది చిత్రబృందం. వెన్నెల పాత్రకి స్ఫూర్తి అయిన సరళ సోదరుడు తూము మోహన్‌రావు ఈ వేడుకకి హాజరయ్యారు. ఈ సందర్భంగా డి.సురేష్‌బాబు మాట్లాడుతూ ‘‘మా సంస్థలో తొలిసారి యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. మేమూ ఓ బయోపిక్‌ చేశామనే తృప్తినిచ్చింది. సరళ జీవితాన్ని సినిమాగా తెరకెక్కించే అవకాశం ఇచ్చిన వారి కుటుంబ సభ్యులకి కృతజ్ఞతలు. దర్శకుడు వేణు కథని చెప్పిన విధానం చాలా బాగుంది. రానాని ఈ సినిమాని ఎందుకు చేస్తున్నావని అడిగితే... ‘ఇలాంటి కథ నేను చేయకపోతే ఎవరు చేస్తార’ని అన్నాడు. ఇలాంటి కళాత్మక చిత్రాలకి ప్రేక్షకులు ఎప్పుడూ పట్టం కడుతూనే ఉంటార’’న్నారు. సాయిపల్లవి మాట్లాడుతూ ‘‘సరళ కుటుంబాన్ని చూసిన తర్వాత నా గుండె బరువెక్కింది, కన్నీళ్లొచ్చాయి. గొప్ప మనసున్నవాళ్లు మళ్లీ పుడతారు. వాళ్లు ఏం అనుకున్నారో ఇంకో మార్గంలో సాధించుకుంటారని చెప్పా. సరళ సోదరుడు మోహన్‌రావు ఇక్కడికొచ్చి సినిమా విజయాన్ని ప్రేక్షకులతో పంచుకోవడం ఆనందంగా ఉంది’’ అన్నారు. దర్శకుడు వేణు ఊడుగుల మాట్లాడుతూ ‘‘ఇలాంటి అర్థవంతమైన సినిమాలు నోటి మాట ద్వారానే ప్రేక్షకుల్లోకి వెళతాయి. ఇలాంటి వాటిని నిలబెడితే మరిన్ని మంచి చిత్రాలొస్తాయి’’ అన్నారు. తూము మోహన్‌రావు మాట్లాడుతూ  ‘‘మా చెల్లెలు విప్లవాన్ని ప్రేమించింది. విప్లవం వల్లే చనిపోయింది. సినిమాలో రవన్న రచనలకి ప్రభావితమై విప్లవంలోకి వెళ్లినట్టు చూపించారు. మా దృష్టిలో రెండూ ఒక్కటే. మా కుటుంబం అంతా కలిసి ఈ సినిమా చూశాం. 30ఏళ్ల కిందట జరిగిన ఆ సంఘటనని ఓ గొప్ప చిత్రంగా నిర్మించార’’న్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు సురేష్‌ బొబ్బిలి, కళా దర్శకుడు నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని