Vijay Varma: ‘మీర్జాపూర్‌’ ఎంతో ప్రేక్షకాదరణ పొందింది.. వాటిని పట్టించుకోవద్దు: విజయ్‌ వర్మ

‘మీర్జాపూర్‌’ సిరీస్‌ ఎంతో ప్రేక్షకాదరణ పొందిందని నటుడు విజయ్‌ వర్మ అన్నారు. ఇందులో భాగం కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

Published : 05 Jul 2024 10:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓటీటీలో మంచి ఆదరణ దక్కించుకున్న వెబ్‌సిరీస్‌ల్లో ‘మీర్జాపూర్‌’ (Mirzapur) ఒకటి. దీని మూడో సిరీస్‌ ‘మీర్జాపూర్‌ 3’ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో (Amazon Prime Video) వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్‌లో కీలకపాత్ర పోషించిన నటుడు విజయ్‌ వర్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఇందులో నటించడంపై తన అనుభవాలను పంచుకున్నారు. 

‘‘నేను ‘మీర్జాపూర్‌’కు అభిమానిని. దీని మొదటి భాగాన్ని ఓ ప్రేక్షకుడిగా చూసినప్పుడు ఆకట్టుకుంది. తర్వాత ఏం జరుగుతుందోనని అందరిలా నేనూ ఎదురుచూశాను. రెండో సీజన్‌ ఎప్పుడు విడుదలవుతుందా అని ఎన్నోసార్లు అనుకున్నాను. మేకర్స్‌ సీజన్‌2 కోసం నన్ను సంప్రదించినప్పుడు సంతోషంతో వెంటనే అంగీకరించాను. ఇది అసమానమైన ప్రేక్షకాదరణ పొందింది. ఇప్పటివరకు ఏ సిరీస్‌నూ చూడనంతమంది ప్రేక్షకులు దీన్ని వీక్షించారు. ఎంతోమంది ప్రేమను ఇది సొంతం చేసుకుంది. ఇందులో భాగమైనందుకు నేనెంత ఆనందంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను. విమర్శకుల కామెంట్స్‌ను ఎవరూ పట్టించుకోవద్దు. దీన్ని (Mirzapur 3) చూసి అందరూ మంచి అనుభూతి పొందండి’’ అని విజయ్‌ వర్మ (Vijay Varma) కోరారు.

అసలు కథ ముందుంది.. ‘కల్కి’ సీక్వెల్‌పై స్పందించిన నాగ్‌ అశ్విన్‌

క్రైమ్‌, థ్రిల్లర్‌ యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్‌లకు గుర్మీత్‌ సింగ్‌ దర్శకత్వం వహించారు. తొలి సీజన్‌ (Mirzapur) 2018 నవంబరు 16న విడుదలైంది. పంకజ్‌ త్రిపాఠి, శ్వేతా త్రిపాఠి, దివ్యేందు శర్మ, అలీ ఫజల్‌, శ్రియ పిల్గోంగర్‌, హర్షిత గౌర్‌ తదితరులు నటించారు. దానికి మంచి స్పందన లభించింది. సీక్వెల్‌గా 2020 అక్టోబరు 23న రెండో సీజన్‌ (Mirzapur 2) విడుదలైంది. ఇదీ విశేష ఆదరణ అందుకుంది. దీంతో మూడో సీజన్‌ రూపొందించారు. ఇది జులై 5 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా ప్రసారమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని