Gabbar Singh: అందుకే పవన్‌ కల్యాణ్‌ ‘గబ్బర్‌ సింగ్‌’ చేయలేనన్నారు.. కానీ!

పవన్‌ కల్యాణ్‌ ‘గబ్బర్‌ సింగ్‌’ సినిమా విడుదలై 12 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా పలు ఆసక్తికర సంగతులు మీకోసం..

Updated : 11 May 2024 09:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘గబ్బర్‌ సింగ్‌’ (Gabbar Singh).. టాలీవుడ్‌లో ఓ ట్రెండ్‌ సెట్‌ చేసిన చిత్రం. మండుటెండలో బాక్సాఫీసు వద్ద కురిపించింది వసూళ్ల వర్షం. ‘నాక్కొంచెం తిక్కుంది.. కానీ దానికో లెక్కుంది’ అంటూ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) మాటల తూటాలు పేలుస్తుంటే ఉప్పొంగిపోయింది అభిమానగణం. ఈ హంగామాకు 12 ఏళ్లు (12 Years of Gabbar Singh). 2012 మే 11న విడుదలైందీ సినిమా. మరి, ఈ సూపర్‌హిట్‌ మూవీలో నటించేందుకు పవన్‌ ముందుగా ఆసక్తి చూపించలేదనే సంగతి మీకు తెలుసా..? పవన్‌ అప్పట్లో తెర వెనుక విశేషాలు పంచుకున్నారు. అవి ఆయన మాటల్లోనే..

‘గుడుంబా శంకర్‌’ స్ఫూర్తి..

‘గబ్బర్ సింగ్‌’ చిత్రాన్ని తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వచ్చిందని పవన్‌ తెలిపారు. ‘‘దబాంగ్‌’ రీమేక్‌ నేను చేస్తే బాగుంటుందంటూ ఆ చిత్రం విడుదలైన 2- 3 నెలల తర్వాత నాకు చూపించారు. అది చూశాక ఇలాంటి సినిమాలో నేనెలా నటించాలో నాకు అర్థం కాలేదు. ఈ చిత్ర కథనమంతా సల్మాన్‌ఖాన్‌ వ్యక్తిత్వానికి తగ్గట్టుగా ఉంటుంది. చాలా సినిమాల్లో చూపించినట్టు ఇందులోనూ తల్లి, కొడుకు కథే కదా.. కొత్తదనం ఏముంది..? అని అనిపించి, నేను చేయలేనన్నా. కానీ, కొన్ని రోజుల తర్వాత తక్కువ బడ్జెట్‌లో త్వరగా పూర్తయ్యే ఓ చిత్రం చేయాలని నిర్ణయించుకున్నా. అదే సమయంలో ‘దబాంగ్‌’ గుర్తొచ్చి మరోసారి చూశా. ఆ రీమేక్‌లో నటించేందుకు సిద్ధమయ్యా. ఈ చిత్రంలోని పోలీసు (కథానాయకుడు) పాత్ర ఎలా ఉండాలో నేనే డిసైడ్‌ చేశా. ఇందులో హీరో తన వృత్తి పట్ల నిబద్ధతతో ఉంటాడు. కానీ, డ్రెస్సింగ్‌ స్టైల్‌, వ్యవహార శైలి చాలా విభిన్నంగా ఉంటాయి. ‘గుడుంబా శంకర్‌’లోని ఓ సన్నివేశంలో నేను చేసిన పోలీసు పాత్రను ఇందుకు స్ఫూర్తిగా తీసుకున్నా’’ అని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు.

టైటిల్‌ అలా..

‘‘ఈ సినిమాలోని నా పాత్ర పేరు వెంకటరత్నం నాయుడు అయినా అందరూ ‘గబ్బర్‌ సింగ్‌’ అంటుంటారు. ఈ పేరు పెట్టడానికి కారణం.. ఒకప్పుడు ఓల్డ్‌ సిటీలో ఉన్న ఓ పోలీసు అధికారి. అప్పట్లో అందరూ ఆయన్ను గబ్బర్‌ సింగ్‌ అని పిలిచేవారు. ఆయన్ను నేను చూశా. కానీ, పరిచయం లేదు. ఆ పేరు నాకు చాలా నచ్చింది. అలా ఈ చిత్రంలోని పోలీసు పాత్ర చూశాక దానికి ‘గబ్బర్‌ సింగ్‌’ పేరైతేనే సరిపోతుందని ఫిక్స్‌ అయ్యా’’ అని వివరించారు.

పవన్‌ స్థానంలో హరీశ్‌

ఈ చిత్రంలోని ఓ సీన్‌లో పవన్‌ స్థానంలో దర్శకుడు హరీశ్‌ శంకర్‌ కనిపించారనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు. ప్రత్యేక గీతం ‘కెవ్వుకేక’ పూర్తవగానే చెక్‌ పోస్ట్‌ చిత్రీకరించిన సీన్‌ ఒకటుంది. రెప్పపాటు కాలం కనిపించే ఆ షాట్‌లోనే హరీశ్‌ కనిపిస్తారు. తీక్షణంగా పరిశీలిస్తేనేగానీ అక్కడుంది పవనా, హరీశా? అని గుర్తించలేం. అంతగా మాయచేశారు.

మరికొన్ని సంగతులు..

  • సినిమా విజయంలో సంగీతం ప్రధాన పాత్ర పోషిస్తుందనడానికి ‘గబ్బర్‌ సింగ్‌’ చక్కని ఉదాహరణ. దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన మ్యూజిక్‌ ఇప్పటికీ మ్యాజిక్‌ చేస్తూనే ఉంటుంది.
  • అప్పటికి వరుస పరాజయాల్లో ఉన్న శ్రుతి హాసన్‌ను హీరోయిన్‌గా ఓకే చేసి, పవన్‌ ఆమె కెరీర్‌ని టర్న్‌ చేశారు.
  • ఈ సినిమా కంటే ముందు పవన్‌కు హరీశ్‌ ఓ స్టోరీ చెప్పారు. దానికి ‘రొమాంటిక్‌ రిషి’ అనే పేరు అనుకున్నారు. అదే రవితేజ హీరోగా వచ్చిన ‘మిరపకాయ్‌’.
  • రూ. 30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా భారీ వసూళ్లను సొంతం చేసుకుంది. ఈ చిత్రం 306 కేంద్రాల్లో 50 రోజులకుపైగా, 65 కేంద్రాల్లో 100 రోజులకుపైగా ప్రదర్శితమై, రికార్డు నెలకొల్పింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని