Tollywood: అసలు దూకుడంతా... ద్వితీయార్ధంలోనే!

 2024 ప్రథమార్ధంలో భారీ చిత్రాల హంగామా చాలా తక్కువ. నిన్న విడుదలైన ‘కల్కి 2898 ఎ.డి’ మినహా అగ్ర తారల నుంచి వచ్చిన పాన్‌ ఇండియా సినిమాలే లేవు. విడుదల కావల్సిన సినిమాలు చాలా వరకూ వాయిదా పడ్డాయి.

Published : 28 Jun 2024 01:04 IST

వచ్చే ఆరు నెలల్లో జోరుగా సాగనున్న సినిమాల వ్యాపారం

2024 ప్రథమార్ధంలో భారీ చిత్రాల హంగామా చాలా తక్కువ. నిన్న విడుదలైన ‘కల్కి 2898 ఎ.డి’ మినహా అగ్ర తారల నుంచి వచ్చిన పాన్‌ ఇండియా సినిమాలే లేవు. విడుదల కావల్సిన సినిమాలు చాలా వరకూ వాయిదా పడ్డాయి. పెద్ద సినిమాలు వస్తాయేమో అనే భయంతో చిన్న చిత్రాలూ సిద్ధం కాలేకపోయాయి. దాంతో కీలకమైన వేసవి సీజన్‌ కూడా వృథా అయిపోయింది. సరైన విడుదలలే లేక కొన్ని రోజులు థియేటర్లు మూత పడిపోయాయి. తొలి ఆర్నెళ్ల సంగతి ఇలా ఉంటే... రానున్న ఆరు నెలల కాలం మాత్రం అంచనాల్ని రేకెత్తిస్తోంది. అగ్ర తారలు నటించిన భారీ సినిమాలు ఈ ద్వితీయార్ధంలోనే ఎక్కువ సంఖ్యలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇప్పటికే కొన్ని చిత్రాలు విడుదల ఖరారు చేసుకున్నాయి. మిగిలినవి ఎప్పుడనేదే రేపో మాపో ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

తెలుగు సినిమాకి ప్రథమార్ధంలో సంక్రాంతి, వేసవి కీలకమైన సీజన్లు.  ద్వితీయార్ధంలోనేమో దసరా, దీపావళి, క్రిస్మస్‌ పండగలను పురస్కరించుకుని  సినిమాల్ని విడుదల చేస్తుంటారు. మధ్యలో సుదీర్ఘమైన వారాంతాలు  కలిసొచ్చినా ఒకట్రెండు సినిమాలు బాక్సాఫీస్‌ ముందుకు దూసుకొస్తుంటాయి. అలా ప్రతి పండగపైనా, కలిసొస్తున్న సెలవులపైనా   దృష్టిపెడుతూ ద్వితీయార్ధంలోనే పలు చిత్రాలు  విడుదల తేదీల్ని ఖరారు చేసుకున్నాయి. ఇప్పటివరకూ వాయిదా పడుతూ వచ్చిన సినిమాలు,  రావాలనుకున్న సినిమాలు అన్నీ కలిసి  ఆర్నెళ్ల కాలంలో హంగామా చేయనున్నాయి. వీటిలో పాన్‌ ఇండియా చిత్రాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అవి దక్షిణాదితోపాటు... హిందీ ప్రేక్షకుల్నీ ఊరిస్తున్నాయి. ప్రభాస్‌ ‘కల్కి 2898 ఎ.డి’ గురువారం విడుదలైనా ఈ జోరు వచ్చే నెల ప్రథమార్ధంలోనూ కొనసాగనుంది. ఆ సందడికి కొనసాగింపు అన్నట్టుగా ఆ వెంటనే ‘భారతీయుడు 2’ విడుదలవుతోంది. ఆ తర్వాత  ‘దేవర’, ‘గేమ్‌ ఛేంజర్‌’, ‘పుష్ప2’, ‘గోట్‌’, ‘వేట్టయాన్‌’తోపాటు, ‘కంగువా’, ‘తంగలాన్‌’ తదితర పాన్‌ ఇండియా చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మధ్యలో అదరగొట్టేందుకు మన యువ కథానాయకుల చిత్రాలూ వడివడిగా ముస్తాబవుతున్నాయి.

  • దక్షిణాది నుంచి, అది కూడా తెలుగు నుంచి ఓ పాన్‌ ఇండియా చిత్రం వస్తోందంటే అన్ని భాషలూ ప్రత్యేక దృష్టితో చూస్తుంటాయి. నిన్నటివరకూ  దేశవ్యాప్తంగా ‘కల్కి 2898 ఎ.డి’ ఫీవర్‌ కొనసాగింది. వచ్చే రెండు వారాలూ ఈ సినిమా సాధించే వసూళ్లు, రికార్డుల సంగతులే వినిపించనున్నాయి. జులై 12న కమల్‌హాసన్‌ - శంకర్‌ కలయికలోని  ‘భారతీయుడు 2’ ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇదే కలయికలో రెండు దశాబ్దాల కిందట వచ్చిన ‘భారతీయుడు’కి కొనసాగింపుగా రూపొందిన చిత్రమిది. ఆగస్టులో రామ్‌ - పూరి జగన్నాథ్‌ కలయికలో రూపొందుతున్న ‘డబుల్‌ ఇస్మార్ట్‌’, నాని - వివేక్‌ ఆత్రేయ కలయికలోని ‘సరిపోదా శనివారం’ ప్రేక్షకుల ముందుకొస్తాయి. సెప్టెంబరులో మళ్లీ  ఎన్టీఆర్‌ విజృంభణ మొదలవుతుంది. ఆయన కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘దేవర పార్ట్‌ 1’ సెప్టెంబరు 27న విడుదల కానుంది. ఇదే నెల 5న తమిళ కథానాయకుడు విజయ్‌ నటించిన ‘గోట్‌’ విడుదల ఖరారైంది. దసరా పురస్కరించుకుని అక్టోబరు 10న రజనీకాంత్‌ కథానాయకుడిగా నటించిన ‘వేట్టయాన్‌’, సూర్య ‘కంగువా’ విడుదల కానున్నాయి. రామ్‌చరణ్‌ - శంకర్‌   కలయికలో రూపొందుతున్న ‘గేమ్‌ ఛేంజర్‌’ దీపావళి సందర్భంగా హంగామా చేసే అవకాశాలు ఉన్నాయి. అక్టోబరు 31వ తేదీన ఆ సినిమా విడుదల ఖరారయ్యే సంకేతాలున్నాయి. డిసెంబరు 6న అల్లు అర్జున్‌ ‘పుష్ప2’ విడుదల ఖరారైంది. విక్రమ్‌ ‘తంగలాన్‌’ ఈ ప్రథమార్ధంలోనే విడుదలకు ముస్తాబవుతోంది. వీటితోపాటు, డిసెంబరులోనే నితిన్‌ ‘రాబిన్‌హుడ్‌’, నాగచైతన్య ‘తండేల్‌’ కూడా వచ్చే అవకాశాలున్నాయి.
  • తొలి ఆరునెలల్లో సరైన సినిమాలు లేకపోవడంతో అటు తారల అభిమానులు... ఇటు సగటు సినీ ప్రేమికులు పాత సినిమాలతోనే కాలక్షేపం చేయాల్సి వచ్చింది. ద్వితీయార్ధంలో ఆ లోటుని భర్తీ చేస్తూ ఆసక్తికరమైన కలయికలతో కూడిన తారల సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఆయా పాన్‌ ఇండియా చిత్రాల నిర్మాణ వ్యయమే దాదాపు రూ.4000 కోట్లు ఉంటుందని పరిశ్రమ వర్గాలు లెక్క గడుతున్నాయి. ప్రతి నెలలోనూ ఒకట్రెండు అగ్ర తారల సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానుండడంతో చిత్రసీమలో ఇప్పటికే వ్యాపారం జోరందుకుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని