Sandeep kishan: నెల్లూరు ప్రభ పాత్రని ఆస్వాదించా

కుటుంబం అంతా కలిసి చూసే సినిమాల్లో నటించడం అన్నా...వాటిని చూడటం అన్నా ఎంతో ఇష్టం అంటున్నారు సందీప్‌కిషన్‌. ఆయన కథానాయకుడిగా నటిస్తూనే..నిర్మాణంలోనూ రాణించే ప్రయత్నం చేస్తున్నారు....

Published : 26 Aug 2021 10:22 IST

కుటుంబం అంతా కలిసి చూసే సినిమాల్లో నటించడం అన్నా...వాటిని చూడటం అన్నా ఎంతో ఇష్టం అంటున్నారు సందీప్‌కిషన్‌. ఆయన కథానాయకుడిగా నటిస్తూనే..నిర్మాణంలోనూ రాణించే ప్రయత్నం చేస్తున్నారు. కె.ఎస్‌.శినీష్‌తో కలిసి సందీప్‌ నిర్మించిన చిత్రం ‘వివాహ భోజనంబు’. హాస్య నటుడు సత్య కథానాయకుడిగా నటించారు. అర్జావీ రాజ్‌ కథానాయిక. రామ్‌ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 27న ఓటీటీ వేదిక సోని లివ్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా సందీప్‌కిషన్‌ బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...

‘‘కుటుంబ కథా చిత్రాలంటే ఎంతో ఇష్టం. దర్శకుడు రామ్‌ అబ్బరాజు కథ చెప్పినప్పుడు నాకు చాలా నచ్చింది. అయితే ఇదొక ఇమేజ్‌ ఉన్న హాస్యనటుడు చేయాల్సిన చిత్రం. అందుకే సత్యని ఎంచుకున్నాం. మనసులో మాత్రం ఈ కథలో నేనే నటించుంటే బాగుండేదేమో అనిపించింది. అందుకే కనీసం ఓ చిన్న పాత్రైనా చేయాలని నెల్లూరు ప్రభ పాత్రని పోషించా. సత్య ప్రధాన పాత్రని చాలా బాగా చేశాడు. తన నటన ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది’’.

‘‘పెళ్లికి సంబంధించిన కథ ఇది. పెళ్లిచూపులు తరహా పేర్లు స్ఫురణకి వచ్చాయి కానీ.. ‘వివాహ భోజనంబు’ కుదిరింది. పెళ్లంటే వివాహ సందడి, చక్కగా భోజనం చేయడమే కదా. అందుకే ఆ పేరు పెట్టాం. దర్శకుడు రామ్‌ అబ్బరాజు తను చూసిన కొన్ని నిజ జీవిత సంఘటనల్ని ఆధారంగా చేసుకుని  ఈ సినిమాని తెరకెక్కించాడు. ఈ సినిమాని చూస్తున్నప్పుడు ఎంతో ఆస్వాదించా. నేను చేసిన నెల్లూరు ప్రభ పాత్ర కోసం నెల్లూరు యాసలో మాట్లాడటాన్ని ఆస్వాదించా. లాక్‌డౌన్‌ సమయంలో ప్రయాణికుల్ని నిబంధనలకి విరుద్ధంగా తీసుకెళ్లే పాత్రలో కనిపిస్తా’’.

‘‘ఈ సినిమాని ఓటీటీలో విడుదల చేయాలని మార్చిలోనే నిర్ణయం తీసుకున్నాం. సోని లివ్‌తో అప్పట్లోనే ఒప్పందం కుదిరింది. కాపీరైట్‌ పరిమితుల్ని దృష్టిలో ఉంచుకుని సోని లివ్‌లో విడుదల చేస్తున్నాం. ఉత్తరాదిలో ఈ వేదికకి మంచి ఆదరణ ఉంది. మా చిత్రంతో తెలుగులోకి అడుగు పెడుతుండడం ఆనందంగా ఉంది. పూర్తిగా కుటుంబ కథతో రూపొందిన సినిమా కాబట్టి ఇది ఇంటిల్లిపాదీ కలిసి ఓటీటీలో చూస్తూ ఆస్వాదించొచ్చు. నేను కథానాయకుడిగా నటిస్తున్న ‘గల్లీ రౌడీ’ త్వరలోనే థియేటర్లలో విడుదల అవుతుంది. ఆ తర్వాత ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్‌లో సినిమా చేస్తున్నా. మరికొన్ని చిత్రాలు చేయాల్సి ఉంది. ‘ఫ్యామిలీ మేన్‌ 3’లోనూ ఓ పాత్ర చేస్తున్నా’’.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని